
తాడేపల్లి : నకిలీ మద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా బరితెగించి వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు తప్పులు మీద తప్పులు చేస్తూ కూడా అడ్డగోలుగా బుకాయిస్తున్నారని విమర్శించారు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 14వ తేదీ) పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శులతో సజ్జల సమావేశమయ్యారు.
‘భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మద్యం అసలుదా.. నకిలీదా అని తెలుసుకునేలా యాప్ పెట్టలేదు. చంద్రబాబు యాప్ పెట్టారంటే నకిలీ మద్యం ఉన్నట్లే కదా..?, చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తూ కూడా అడ్డంగా బుకాయిస్తున్నారు. సడెన్‌గా ఒకడు ఆఫ్రికానుంచి వస్తాడు, అతనికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారు. అతని వీడియో బయటికి వస్తుంది, జోగి రమేష్ పేరు చెబుతాడు.. అతను చెప్పినందుకే చేశానంటాడు, నకిలీ మద్యం కేసులో చంద్రబాబు అడ్డం దొరికారు. ఆ భయంతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. బెల్ట్ షాప్‌లు ఉన్నాయని చంద్రబాబే ఒప్పుకున్నారు.. కల్తీ మద్యాన్ని అసలు మద్యంలా చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టాం.. ఆ దుకాణాలకు వచ్చిన మద్యం ఏ డిస్టిలరీ నుంచి వచ్చిందో తెలుసేలా చేశాం. దాని అమ్మకం జరిగితేనే డిస్టిలరీకి డబ్బులు వెళ్ళే విధంగా క్యూఆర్ కోడ్ పెట్టాం. పక్కాగా పకడ్భందీగా లిక్కర్ సేల్స్ జరిగాయి. టీడీపీ ప్రభుత్వం కల్తీ మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. 24 గంటలు బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు పెట్టి నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలి. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఉవ్వెత్తున ఎగిసి పడి మనం పోరాటాలు చేస్తున్నాం.
చంద్రబాబు గ్యాంగ్ బరితెగించి అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలి. పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం అయ్యేలా యాప్‌ను కూడా సిద్దం చేశాం.. డేటా ప్రొఫైలింగ్ జరుగుతుంది. స్ధానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా పూర్తిస్ధాయిలో సిద్దంగా ఉండాలి. పార్టీ కమిటీలు, సంస్ధాగత నిర్మాణం విషయంలో పుంగనూరు, మడకశిర నియోజకవర్గాలను మోడల్ గా తీసుకుని ముందుకెళ్ళాలి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహిస్తే నష్టమని చంద్రబాబు అంటున్నారు పీపీపీలో మెడికల్ కాలేజీలు మంచిదని చెబుతున్నాడు.. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?’ అని సజ్జల ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
‘వైద్య రంగంలో జగన్ సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే’