కుంచెతో తెలుగును వెలిగించిన బాపు
నగరంపాలెం: చిత్రాలు, కార్టూన్ల ద్వారా తెలుగును వెలిగించిన చిరస్మరణీయుడు బాపును స్మరించుకోవడం అందరి బాధ్యతని గజల్ శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్ రోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఆడిటోరియంలో ఆదివారం బాపు– రమణ–బాలు కళాపీఠం, మల్లెతీగ సంయుక్తంగా బాపు జయంతి – బాపు స్మారక పురస్కారాల సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ అందమైన సీ్త్రని బాపు బొమ్మగా ప్రశంసిస్తున్నామంటే అది ఆయన చిత్రాలకున్న గొప్పతనమని తెలిపారు. తెలుగు వారు ఉన్నంత కాలం బాపు సినిమాలు, చిత్రాలు, కార్టూన్లు సజీవంగా ఉంటాయని చెప్పారు. తెలుగు అమ్మ ఒడి భాష కావాలన్నారు. తెలుగును అధికార భాషకంటే ముందు మన మమకార భాషగా గుర్తించాలని పేర్కొన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాపు– రమణ – బాలు కళాపీఠం వ్యవస్థాపకులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి మాట్లాడుతూ బాపును స్మరించుకోవడం మన అదృష్టంగా భావించాలని తెలిపారు. బాపు సినిమాల్లోని ముఖ్య సన్నివేశాల్ని, పాటల్ని ఆత్మీయ అతిథి, సుప్రసిద్ధ రచయిత డాక్టర్ ఎం.ప్రభాకర్ గుర్తు చేశారు. సాహితీ సమాఖ్య గుంటూరు కార్యదర్శి ఎస్‌వీఎస్.లక్ష్మీనారాయణ బాపు ప్రతిభను తెలిపే సంగతుల్ని వివరించారు. మల్లెతీగ కలిమిశ్రీ మాట్లాడుతూ బాపు దర్శకునిగా, చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా సేవలందించారని పేర్కొన్నారు. అనంతరం సుప్రసిద్ధ సినీ దర్శకులు వర ముళ్లపూడి, చిత్రకారుడు అరసవల్లి గిరిధర్, కార్టూనిస్టు హరి వెంకటరమణలకు బాపు స్మారక పురస్కారాలను అందించారు. బాపుతో ఉన్న అనుబంధాన్ని పురస్కార గ్రహీతలు గుర్తు చేసుకున్నారు.
కార్టూనిస్టు హరి వెంకటరమణకు సత్కారం
చిత్రకారుడు అరసవల్లి గిరిధర్‌కు సన్మానం
ముగ్గురికి స్మారక పురస్కారాల ప్రదానం
కుంచెతో తెలుగును వెలిగించిన బాపు
కుంచెతో తెలుగును వెలిగించిన బాపు


