ఉపకార వేతనాలతో ఉన్నతస్థాయికి ఎదగాలి
తెనాలి: విద్యార్థులు ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పారిశ్రామికవేత్త, తులసీ సీడ్స్ అధినేత తులసీ రామచంద్రప్రభు పేర్కొన్నారు. ఒక స్థాయికి చేరుకున్నాక తిరిగి సమాజానికి సేవ చేయాలని అన్నారు. పట్టణానికి చెందిన కృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ ప్రొగ్రెసివ్ అసోసియేషన్ (కెపా) 21వ ప్రతిభా స్కాలర్‌షిప్‌ల ప్రదానోత్సవం ఆదివారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో నిర్వహించారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చింతల శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన సభలో 2024–25 విద్యా సంవత్సరానికి 430 మంది విద్యార్థులకు రూ.14.53 లక్షల స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేశారు. రామచంద్రప్రభు మాట్లాడుతూ తాను ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్ష ఫీజు రూ.16 కోసం నాలుగిళ్లు తిరగాల్సి వచ్చిందని, పీయూసీ, బీటెక్‌ను మెరిట్ స్కాలర్‌షిప్‌తోనే చదువుకున్నట్టు గుర్తుచేసుకున్నారు. స్కాలర్‌షిప్ ప్రాముఖ్యతను విద్యార్థులు గుర్తెరగాలని చెప్పారు. రంగిశెట్టి ఫౌండేషన్ అధినేత డాక్టర్ రంగిశెట్టి జగదీష్‌బాబు మాట్లాడుతూ ఇరవైఏళ్లుగా విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. నారాయణ గ్రూప్ స్కూల్స్, గుంటూరు ఏజీఎం దాసం శివనాగరాజు, శింగులూరి వీరన్న, విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి బళ్లా నరేంద్రకుమార్, భావనా పవన్‌కుమార్, రంగిశెట్టి రమేష్ ప్రసంగించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జవ్వాజి కోటినాగయ్య, కార్యదర్శి తాడికొండ చిన్నబ్బాయి, సభ్యులు బొల్లిముంత అమరేశ్వరరావు, వెంకటపున్నారావు, బొల్లిముంత శివరామకృష్ణ, సాయికృష్ణ, సాంబశివరావు, బర్మా కోటేశ్వరరావు, జగన్మోహనరావు, సోమరౌతు సాంబశివరావు, తన్నీరు కళ్యాణ్‌కుమార్ తదితరులు పర్యవేక్షించారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్, తెనాలి యూనిట్ కార్యదర్శిగా ఎన్నికై న ముళ్లపూడి సాయికృష్ణను అతిథుల చేతులమీదుగా సత్కరించారు.
పారిశ్రామికవేత్త తులసీ రామచంద్రప్రభు
430 మందికి రూ.14.53లక్షల
ఉపకార వేతనాల పంపిణీ


