ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మార్పులకు సన్నద్ధం కావాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా సన్నద్ధం కావాలని ఆర్‌ఐవో జి. సునీత పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో జరగనున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలపై సోమవారం గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులకు సాంబశివపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భగా ఆర్‌ఐవో విద్యార్థులకు సంబంధించిన అకడమిక్ సంస్కరణలు, సబ్జెక్టుల వారీగా సిలబస్, మార్కుల విభజనపై వివరించారు. ఆర్జేడీ జె.పద్మ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల విధానంతో పాటు సిలబస్‌లో చోటు చేసుకున్న మార్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి.ఉమాదేవి, ఇంటర్మీడియెట్ బోర్డు పరిశీలకురాలు పి.రేఖావాణి పాల్గొన్నారు.
ఆర్‌ఐఓ జి. సునీత


