రైల్వే పెన్షన్ అదాలత్ బహిష్కరణ
గుంటూరు మెడికల్: దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ పరిపాలన విభాగంలో సోమవారం నిర్వహించిన పెన్షన్ అదాలత్‌ను ది రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు బహిష్కరించారు. సోమవారం జరిగిన పెన్షన్ అదాలత్‌లో ఒక పెన్షనర్ల సంఘానికి అనుమతి ఇచ్చి, తమ సంఘానికి అనుమతి ఇవ్వకపోవడంతో బహిష్కరించామని అసోసియేషన్ డివిజనల్ ప్రెసిడెంట్ కె.నారాయణరెడ్డి, సెక్రటరీ ఎల్.రాఘవబాబు తెలిపారు. గుంటూరు డివిజన్‌లో పనిచేస్తున్న ప్రధాన పెన్షన్‌ల సంఘాల్లో తమ సంఘం ఒకటని పేర్కొన్నారు. 300 మంది కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. భవిష్యత్తు పెన్షన్ అదాలత్‌లలో అన్ని గుర్తింపు పొందిన పెన్షనర్ల సంఘాలు పాల్గొనేందుకు, అభిప్రాయాలు తెలియజేసేందుకు సమాన అవకాశాలు ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా తమ సంఘం పాల్గొనకుండా ఉండేందుకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరండల్‌పేటలో జరిగిన సమావేశంలో సుధాకర్, కోశాధికారి ఆదినారాయణరెడ్డి, చెన్నయ్య, కోటేశ్వరరావు, శివరామ్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.


