నేటి ర్యాలీని జయప్రదం చేయండి
పట్నంబజారు: పేద ప్రజల పక్షాన.. వారి గొంతుకై పేద విద్యార్థుల కోసం చేపట్టిన పోరాటంలో భాగంగా సోమవారం కోటి సంతకాలకు సంబంధించి పార్టీ జిల్లా కార్యాలయం నుంచి జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నేతలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ కాకుండా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసిందన్నారు. జిల్లాలో సుమారుగా నాలుగు లక్షల 80 వేల సంతకాల సేకరణ జరిగిందని తెలిపారు. ఇందులో కార్యకర్తలు, పార్టీ నేతలు చేసిన శ్రమ ఎనలేనిదని కొనియాడారు. ఇప్పటికే ఈ నెల 10వ తేదీన గుంటూరు పశ్చిమం, తూర్పు, పొన్నూరు, తెనాలి, మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల నుండి సంతకాలు జిల్లా కార్యాలయానికి చేరుకున్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే అన్నారు. సంతకాల సేకరణలో భాగంగా నేడు బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయం నుండి లాడ్జి సెంటర్‌లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ, ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో భాగస్వామ్యులు కావాలని ఆయన తెలిపారు. లాడ్జి సెంటర్ నుంచి తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్లి సంతకాలను అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ ర్యాలీలో భాగంగా అనుబంధ విభాగాలు, పార్టీ శ్రేణులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ప్రదర్శనను జయప్రదం చేయాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, వంగల వల వీరారెడ్డి, కార్పొరేటర్లు ఆచారి, అచ్చల వెంకటరెడ్డి, వంశి, సుబ్బారెడ్డి, ఆబిద్, మెహమూద్, కిషోర్, అనుబంధ విభాగాల అధ్యక్షులు సిడి భగవాన్, పఠాన్ సైరా ఖాన్, కోరిటిపాటి ప్రేమ్ కుమార్, పార్టీ ముఖ్య నేతలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
అంబటి రాంబాబు


