
కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్భం ఏదైనా రాజకీయం మాట్లాడకుండా మాత్రం ఉండలేరు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను విమర్శించకుండానూ ఉండలేరు. ఎందుకీ మాట అనాల్సి వస్తోందంటే.. వినాయక చవితి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూజలు జరిగాయి. సంప్రదాయబద్ధంగా భక్తి పూర్వకంగా నేతలు పూజలు నిర్వహించారు.
చంద్రబాబు నాయుడు విషయానికొస్తే.. ఆయన ఇంట్లో పూజలు చేశారో లేదో తెలియదు కానీ.. విజయవాడలో ఏర్పాటైన ఒక మండపం వద్ద వినాయకుడిని దర్శించుకుని దండం పెట్టుకున్నారు. తప్పేమీ లేదు కానీ.. ‘దొంగ దండాలు పెట్టిన వారిని వినాయకుడు క్షమించడు. వాళ్ల సంగతి చూస్తాడు’ అన్నారట. ఎవరు దొంగ దండాలు పెడతారు?. జనాన్ని మోసం చేసేవారు కదా!. చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ వాటిని నేరవేర్చకుండా ప్రజలను ఆయన మోసం చేస్తుంటారని జగన్ తరచుగా చెబుతుంటారు.
కొద్ది రోజుల క్రితం దివ్యాంగుల పెన్షన్ల కోతపై ఒక కామెంట్ చేస్తూ చంద్రబాబు జీవితం అంతా మోసాల మయం అని, మాట మీద నిలబడని వ్యక్తి అని ధ్వజమెత్తారు. బహుశా వాటిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఇలా విమర్శించి ఉండవచ్చు. ఎల్లో మీడియా ఈ కథనాన్ని కాస్తా చాలా ప్రముఖంగా ప్రచురించింది. వెళ్లిందేమో దైవ దర్శనానికి.. మాట్లాడిందేమో ఇలాంటి మాటలు! ఆయన ధోరణే అంత. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా కాకుండా వ్యక్తిత్వ హననం కోసం ప్రయత్నిస్తూంటారు. అందుకే సమయం, సందర్భం ఏదీ లేకుండా ఎక్కడపడితే అక్కడ జగన్ నామ జపం చేస్తుంటారు. అవి అభ్యంతరకరమైన పదాలతో ఉండకపోతే ఆయనకు తృప్తిగా అనిపించదేమో మరి. పారిశ్రామికవేత్తల వద్ద కూడా జగన్‌ను భూతం అనడం చూస్తుంటే ఆయన మళ్లీ అధికారంలోకి వస్తాడేమో అన్న భయం చంద్రబాబును పీడిస్తున్నట్లు ఉంది. చిత్రమైన విషయం ఏమిటంటే.. సీఎం హోదాలో ఆయన చేసే వ్యాఖ్యలు రాష్ట్రానికి నష్టమని తెలిసినా ఆయన పట్టించుకోకపోవడం!.
గత ఏడాది ఎన్నికల్లో ఏదో రకంగా గెలిచినప్పటికీ.. చంద్రబాబు ఆ మరుసటి రోజు నుంచే జగన్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఏదో మాయ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. పోలైన ఓట్ల కంటే ఏకంగా 49 లక్షల ఓట్లను అదనంగా లెక్కించారన్న విషయం బయటపడింది. ఈవీఎంలతో జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాల గురించి చంద్రబాబు అస్సలు మాట్లాడకుండా.. కేవలం జగన్‌పై విమర్శలకు మాత్రమే పరిమితం కావడాన్ని చూస్తే.. ఆ వ్యవహారాలన్నీ నిజమే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా అలా చేసే అవకాశం ఉండదేమో అన్న ఆందోళనతో జగన్‌ను బద్నాం చేయడానికి యత్నిస్తున్నారా అన్న సందేహం ఎవరికైనా రావచ్చు.
వైఎస్ జగన్ ఎప్పుడూ తను ఇచ్చిన మాట మీద నిలబడాలనుకునే మనిషి. ఆ క్రమంలో కొన్నిసార్లు నష్టపోయినా అలాగే ముందుకు సాగారు. ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్‌తో సహా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు 150 హామీలు ఇచ్చినప్పుడు వాటి అమలు సాధ్యం కాదని జగన్ కుండబద్ధలు కొట్టారు. అలాంటి హామీలు తాను ఇవ్వలేనని కూడా స్పష్టం చేశారు. దీనివల్ల కూడా ఆయనకు నష్టం జరిగింది. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో దాదాపు వంద శాతం నెరవేర్చిన ఘనత జగన్‌ది. అందువల్ల ఆయన ధైర్యంగా మేనిఫెస్టో గురించి మాట్లాడేవారు. కానీ చంద్రబాబు, పవన్‌లు ఎప్పుడూ మేనిఫెస్టో ఊసే తీసుకురారు. పైగా హామీలు నెరవేర్చుతున్నామంటూ జనాన్ని మోసం చేస్తున్నారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. ఉచిత బస్ ప్రయాణం అంటూ మహిళలను ఊరించారు. తీరా చూస్తే కేవలం ఐదు రకాల సర్వీసులకే పరిమితం చేశారు.
అదే టైమ్‌లో ఈ స్కీమ్ వల్ల నష్టపోతున్న ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదు. దాంతో వారంతా ఆందోళనలకు దిగుతున్నారు. దివ్యాంగుల పెన్షన్ పెంచుతామని చెప్పారు. అలాగే చేసినట్లు చేసి, దివ్యాంగుల వైకల్య శాతం అంటూ కండీషన్లు పెట్టి లక్షల మంది పెన్షన్లు కట్ చేయడంతో వారంతా వీధులలోకి వచ్చి పోరాడారు. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబును మోసకారిగా అభివర్ణించారు. వీటిని ఖండించలేకపోయిన చంద్రబాబు పరోక్షంగా దొంగ దండాలు అంటూ విమర్శించినట్లు కనిపిస్తుంది. జగన్‌కు దొంగ దండాలు పెట్టవలసిన అవసరం ఏముంది?. ఆయన ఏ మతం అన్న దానితో నిమిత్తం లేకుండా ఎక్కడకు వెళ్లినా పవిత్ర భావంతోనే ఉంటారు. చివరికి ఎవరి నుంచైనా ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా చెప్పులు విడిచి తీసుకుంటారు.
అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఏకంగా తిరుపతి ప్రసాదమైన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దారుణమైన ఆరోపణ చేసి హిందూ మతం ఆచరించే వారి విశ్వాసాన్ని దెబ్బతీశారు. అందువల్ల దైవ దర్శనానికి ఎవరు వెళ్లినప్పుడు చిత్తశుద్దితో నమస్కారాలు చేస్తారు? ఎవరు దొంగ దండాలు పెడతారన్నది అర్థం చేసుకోవడం కష్టం కాదు. చర్చికి వెళ్లినా, మసీదుకు వెళ్లినా జగన్ ప్రార్థనలకు మాత్రమే పరిమితం అవుతారు. రాజకీయ వ్యాఖ్యలు చేయరు.
చంద్రబాబు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు హిందూయేతర మతాల వారిని అవమానించేలా మాట్లాడిన ఘట్టాలు ఉన్నాయి. పోనీ హిందూ మతాన్ని పూర్తిగా గౌరవిస్తారా అంటే అదీ అంతంత మాత్రమే. కొన్నిసార్లు బూట్లు తీయకుండానే పూజలు చేసిన వీడియోలు, ఫోటోలు కనిపిస్తుంటాయి. చర్చికి వెళ్లి ఏసును నమ్మితే విజయమే అని అనగలరు. మళ్లీ ఆ మతాచారాలను పాటించే వారిలో కొంతమందిని ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, మతం పేరు పెట్టి విమర్శించగలరు. గతంలో ఒక డీజీపీని క్రిస్టియన్ అని కామెంట్ చేశారు. ఇక జగన్ పై మతపరంగా ఎన్ని అరాచకపు విమర్శలు చేశారో చెప్పనవసరం లేదు. జగన్ టైమ్‌లో టీడీపీ వారు కొందరు దేవాలయాలపై దాడులు జరిపి పట్టుబడ్డారు. అలాంటివారిలో కొందరికి ఈ మధ్య చంద్రబాబు ఆర్థిక సాయం చేశారని వార్తలు వచ్చాయి. అంటే రాజకీయం కోసం దేవుళ్లను, మతాలను కూడా నిర్మొహమాటంగా వాడుకోగల నేర్పరితనం ఆయన సొంతమనే కదా!.
-కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత..