
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కుమ్మక్కు అయినట్లేనా? రాహుల్ గాంధీ ఒకవైపు కేంద్రంలో బీజేపీతో పోరాడుతున్నట్లు హడావుడి చేస్తూ.. ఇంకోపక్క అదే ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నించడం లేదు ఎందుకన్న ప్రశ్న కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాహుల్ గాంధీకి మధ్య ఉన్న హాట్ లైన్ సంబంధాల గుట్టు రట్టు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఈ కథ నడుస్తోందని ఆయన వెల్లడించారు. అంటే చంద్రబాబు వ్యూహాత్మకంగా అటు బీజేపీతో పొత్తు, ఇటు కాంగ్రెస్‌తో రహస్య బంధం పెట్టుకున్నారన్న మాట.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది కాని పెద్దగా ఫీల్ కాలేదనిపిస్తుంది. అందువల్లే ఇప్పుడు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. జగన్‌పై కొద్దిమంది కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, ఓట్ల చోరీ జరిగిందని, బీజేపీకి మేలు చేసేందుకు ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడుతోందని ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ, ఇతర ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు ఏపీ, ఒడిశాలల్లో జరిగిన ఎన్నికల తీరుపై ఎందుకు మాట మాత్రం కూడా ప్రస్తావించడం లేదన్నదానికి జవాబు దొరకడం లేదు. ఏపీలో పోలింగ్ నాటితో పోలిస్తే కౌంటింగ్ రోజు 12.5 శాతం ఓట్లు అధికంగా లెక్కవేశారని... అంటే సుమారు 49 లక్షల ఓట్ల మాయాజాలం జరిగిందని ఎన్నికల సంస్కరణల సంస్థ (ఎడిఆర్) ఒక నివేదికలో తెలిపింది.
అయినా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈ విషయం తెలియనట్లు నటిస్తోంది. అదే జగన్ మాత్రం హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపాలై, బీజేపీ గెలిచిన రోజే ఎన్నికల అక్రమాలపై తన నిరసన తెలిపారు. ఈవీఎంలు మానిప్యులేషన్‌కు గురవుతున్నాయిని, బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు జరపాలని సూచించారు. జగన్ అలా వ్యాఖ్యానించినా, ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఆయనకు థ్యాంక్స్ చెప్పలేదు. ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన పత్రంలో ఈవీఎంల మాయ, ఓట్ల రిగ్గింగ్ తదితర కారణాలతో వైఎస్సార్‌సీపీ 88 సీట్లు కోల్పోయిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మోడీ అంటే వెరచేవారైతే జగన్ ఈ విషయాన్ని ఇంత ధైర్యంగా చెప్పగలిగేవారా? వైఎస్సార్‌సీపీ నేతలు కొందరు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలంటూ హైకోర్టుకు కూడా వెళ్లారు. కానీ ఎన్నికల అధికారులు వాటిని పది రోజులలోనే దగ్ధం చేయించిన విషయాన్ని వైఎస్సార్‌సీపీ ప్రపంచానికి చాటి చెప్పింది.
ఇన్ని జరిగినా కాంగ్రెస్ మాత్రం పెదవి విప్పలేదు. ఈ ఆధారాలను రాహుల్ వాడుకోగలిగి ఉంటే ఆయన వాదనకు మరింత బలం చేకూరేది. ఈ విషయాలన్నిటిని కప్పిపుచ్చి రాహుల్ గాంధీకి జగన్ మద్దతు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాకూర్, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఇప్పటికీ జగన్‌ను విమర్శించడానికి ప్రాధాన్యత ఇచ్చారే కాని, ఏపీలో ఎన్నికల అవకతవకలు జరిగాయా?లేదా? అన్నదానిపై తమ అభిప్రాయం చెప్పలేదు. మోడీ,అమిత్ షాలపై జగన్ విమర్శలు చేయడం లేదట. హర్యానాలో ఎన్నికల ఫలితాలపై జగన్ ఎవరిపై విమర్శలు చేసినట్లో తెలియడం లేదా? పైగా షర్మిల ఆధ్వరంలో జరిగే ర్యాలీలో జగన్ పాల్గొనాలని ఒక పిచ్చి సలహా పారేసి చంద్రబాబు పట్ల, బీజేపీ కూడా భాగస్వామి అయిన కూటమి పట్ల ఎంత విధేయత ఉందో ఈ కాంగ్రెస్ నేతలు మరోసారి చెప్పకనే చెప్పారనిపిస్తుంది.
రాహుల్ గాంధీ చెప్పుడు మాటలు వింటారని గతంలో అనుకునేవారు. తల్లి సోనియాగాంధీ కూడా అదే తరహాలో వ్యవహరించిన కారణంగానే ఏపీలో కాంగ్రెస్ నాశనమైందని కేంద్రంలో అధికారం నిలబెట్టుకోవడంలో విఫలమైందని అంతా విశ్వసిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన కుమారుడు జగన్ పట్ల కాంగ్రెస్ నాయకత్వం సరైన రీతిలో వ్యవహరించలేదు. జగన్‌ను ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తీర్మానం చేసినా, కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకుండా, మరో సీనియర్ నేత రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది. తదుపరి అది తప్పు నిర్ణయమన్న భావనకు వచ్చిన అధిష్టానం ఆయనను మార్చి అప్పట్లో స్పీకర్‌గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేశారు. ఈ ఎంపికలో రాహుల్ గాంధీ పాత్ర అధికంగా ఉందని అంటారు.
చిదంబరం వంటి నేతలను ప్రభావితం చేసి రాహుల్ తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా కిరణ్ వ్యూహం అమలు చేశారని అంటారు. ఆ పిమ్మట జగన్ తన సొంత పార్టీ పెట్టుకుని ముందుకు వెళ్లారు. దాంతో కక్షకట్టి ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇందులో చంద్రబాబు సహకారాన్ని కూడా తీసుకున్నారు. కిరణ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడడం, చంద్రబాబు కోరుకున్నట్లు జగన్‌పై అక్రమ కేసులు పెట్టడం వంటివి కూడా చేశారు. తత్పలితంగా కాంగ్రెస్ తన సమాధికి తానే రాళ్లు పేర్చుకున్నట్లయింది. ఫలితంగా ఈ 15 ఏళ్లు అధికారానికి దూరం కావల్సి వచ్చింది. అధికారం పోయిన తరువాత కూడా వారిలో పెద్దగా మార్పేమీ రాలేదు. బీజేపీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పరోక్ష స్నేహం చేస్తోందన్నది బహిరంగ రహస్యమే.
ఏపీ కాంగ్రెస్‌లో కాస్తో, కూస్తో మిగిలి ఉన్న కేడర్ కూడా ఈ విషయాన్ని బలంగా నమ్ముతోంది. 2018లో తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి ఓటమిపాలైన తర్వాత ఏపీలో ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోలేదు. 2019లో ఏపీలో పరాజయం తర్వాత చంద్రబాబు కాంగ్రెస్‌ను పూర్తిగా వదలివేశారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉన్న సమయంలో ఆ పార్టీ అగ్రనేతలతో కలిసి ప్రచారాలు కూడా నిర్వహించారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ నేతలు కొందరికి టీడీపీ నాయకత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా లభించిందని చెబుతారు. 2019 ఓటమి తర్వాత కాంగ్రెస్‌ను వదలి బీజేపీ కూటమితో సాన్నిహిత్యం కోసం నానా పాట్లు పడ్డారు. అయినా ఎన్నడూ చంద్రబాబును రాహుల్ గాంధీ తప్పు పట్టలేదు. చివరికి 2024లో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేసినా ఒకటి, అర సందర్భంలో తప్ప టీడీపీపై కాంగ్రెస్ అగ్రనేతలు విమర్శలు చేయలేదన్నది వాస్తవం.
అలాగే సోనియాగాందీ, రాహుల్ గాంధీలతోపాటు ,కాంగ్రెస్ ముఖ్యనేతలెవరిని చంద్రబాబు కూడా విమర్శించరు. ఈ మధ్యకాలంలో ప్రధాని మోడీపై రాహుల్ ఎంత తీవ్ర ఆరోపణలు చేసినా, వాటిని ఖండించడానికి, మోడీకి అనుకూలంగా ప్రకటనలు ఇవ్వడానికి చంద్రబాబు పెద్దగా చొరవ చూపిన సందర్భాలు కనిపించవు. ఆపరేషన్ సిందూర్ వంటి కీలకమైన అంశంలో సైతం రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ పెద్ద ఎత్తున తప్పుపట్టినా చంద్రబాబు మాత్రం నోరెత్తలేదని బీజేపీ వర్గాలు చెబుతుంటాయి. మోడీతో కలిసి పాల్గొనే సభలలో మాత్రం ఆయనను చంద్రబాబు ఆకాశానికి ఎత్తుతుంటారు. మోడీ,అమిత్ షా వంటివారితో సంబంధం లేకుండా ఏపీలో నిత్యం జరిగే సభలలో మాత్రం చంద్రబాబు వారి ఊసే ఎత్తకుండా, మొత్తం తన గురించే ప్రచారం చేసుకుంటుంటారని, అయినా తమ నాయకత్వం చూసి చూడనట్లు పోతోందని బీజేపీ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు.
ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని చేయడంలో, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచాక ముఖ్యమంత్రి పదవి వచ్చేలా చేయడంలో చంద్రబాబు ప్రభావం కూడా ఉందని బీజేపీ వారికి కూడా తెలుసట. అయినా బీజేపీ వ్యూహాత్మకంగా ఏపీలో పొత్తు పెట్టుకుంది. తెలంగాణలో మాత్రం పొత్తుకు ఈ రాష్ట్ర నాయకులు అంత సుముఖంగా లేరని అంటున్నారు. అసలు ఏపీ కాంగ్రెస్లో చాలామందికి ఇష్టం లేకపోయినా వైఎస్ షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిని చేశారు. ఆమె అచ్చంగా అధికారం కోల్పోయిన జగన్ పై విమర్శలు చేస్తూ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సపోర్టుగా వ్యవహరిస్తుంటారన్న అభిప్రాయం ఉంది.
ఆమెకు మాణిక్యం ఠాకూర్ వంటి వారు వంతపాడుతున్నారు. ఏపీలో అనేక స్కామ్ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నా ఆమె కాని, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కాని వాటి గురించి కాకుండా విపక్షంలో ఉన్న జగన్ పై విమర్శలు చేస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ కొంతకాలం క్రితం ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడితే, షర్మిల తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఈవీఎంలకు బదులు బాలెట్ల వ్యవస్థను తీసుకురావాలని కోరుతుంటే ఈమె ఇలా ఎలా మాట్లాడతారో తెలియదు. ఈ కారణాలన్నిటి రీత్యానే రాహుల్ గాంధీపై జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబుకు, రేవంత్‌కు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇప్పటికీ సజావుగానే కొనసాగుతున్నాయని కాంగ్రెస్ కేడర్ సైతం చెబుతుంటుంది.
అందువల్ల రేవంత్ ద్వారా రాహుల్ గాంధీ, చంద్రబాబుల మధ్య హాట్ లైన్ నడుస్తోందని, వారి మధ్య నిత్య సంబందాలు ఉన్నాయని జగన్ అభిప్రాయపడ్డారన్నమాట. చిత్రమేమిటంటే చంద్రబాబుతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని కాంగ్రెస్ నేతలు అనడం లేదు. తాము చంద్రబాబు ఆద్వర్యంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై పోరాడతామని చెప్పడం లేదు. మళ్లీ జగన్ పైనే విమర్శలు చేసి చంద్రబాబును సంతోషపెట్టారనిపిస్తుంది. మరో వైపు ఒడిశాలో ఎన్నికల అక్రమాలపై బీజేడీ హైకోర్టుకు వెళుతోంది. అయినా రాహుల్ గాంధీ ఏపీ, ఒడిశాల గురించి మాట్లాడకుండా బీజేపీపై పోరాడుతున్నామని చెప్పడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది?
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత