సాక్షి, తాడేపల్లి: రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఆయన జీవితకాలంలో ఏనాడూ రాయలసీమ అభివృద్ధికి కృషి చేయలేదని దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాయలసీమకు చెందాల్సిన రాజధాని, హైకోర్టు, ఎయిమ్స్ అన్నీ తరలించుకుపోయారని.. మాకు రావాల్సిన నీళ్లు, నిధులను కూడా కోల్పోయాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘శ్రీబాగ్ ఒప్పందం జరిగి నేటికి 87 ఏళ్లయినా రాయలసీమలో ఎలాంటి మార్పులూ జరగలేదు. 2020లో వైఎస్ జగన్ శ్రీబాగ్ ఒప్పందం గురించి అసెంబ్లీలో మాట్లాడారు. దివంగత వైఎస్సార్ రాయలసీమ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. వైఎస్ జగన్ తాగు, సాగు నీటి ప్రాజెక్టులు తెచ్చారు. రాయలసీమకు చేయాల్సినవి చంద్రబాబు ఏమీ చేయలేదు. హైకోర్టు బెంబ్ చాలంటూ మాట్లాడుతున్నారు. దానికి సంబంధిన ప్రతిపాదనలను కూడా ఇంకా పంపలేదు.
..సాగు నీరు లేక రాయలసీమ కరువుతో ఉంటే చంద్రబాబుకు కనపడటం లేదు. కృష్ణా నీరు వృధాగా పోతున్నా రాయలసీమకు తరలించే పని చేయటం లేదు. రాయలసీమ మీద చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి పనులను జగన్ చేపడితే చంద్రబాబు ఆపేశారు. ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పనీ చంద్రబాబు చేయలేదు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటం ద్వారా రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. మా రాజధాని, హైకోర్టు, ఎయిమ్స్‌ని చంద్రబాబు లాక్కెళ్లారు
..చంద్రబాబు వలన సాంస్కృతిక వైభవాన్నే రాయలసీమ కోల్పోయింది. ఇప్పటికైనా శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలి. రాయలసీమ అభివృద్ధికి జగన్ చేపట్టిన ప్రాజెక్టులను కొనసాగించాలి. చంద్రబాబు ఒక ప్రాంతంపైనే ప్రేమను చూపిస్తే కుదరదు. సిద్దేశ్వర అలుగు నిర్మాణం చేపట్టాలి. నీళ్లు, నిధుల విషయంలో రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని శైలజానాథ్ డిమాండ్ చేశారు.


