
సాక్షి, తాడేపల్లి: సుపరిపాలన అంటే స్కాంలు, దళితుల మీద దాడులు చేయటమా? అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి, సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్యం, ఇసుకలో దోపిడీ చేయటమే సుపరిపాలనా? సాక్షాత్తు ఎమ్మెల్యేలే అధికారులను కిడ్నాప్ చేస్తుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. మహిళలను వేధిస్తున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు’’ అంటూ శైలజానాథ్ దుయ్యబట్టారు.
‘‘జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దారుణంగా దూషించిన ఎమ్మెల్యేకి చంద్రబాబు వత్తాసు పలికారు. ఇదేనా సుపరిపాలన అంటే?. ప్రణాళికాబద్దంగా చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ఆయన పాలనలో ప్రజలకు ఒరగిందేమీ లేదు. టీడీపీ ఎమ్మెల్యే అటవీశాఖ అధికారుల మీద దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు? జూనియర్ ఎన్టీఆర్ తల్లిని టీడీపీ ఎమ్మెల్యే దారుణంగా దూషిస్తే కనీస చర్యల్లేవు. కూన రవికుమార్ ఒక మహిళా ప్రొఫెసర్‌ని వేధిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.
‘‘మంత్రి అచ్చెన్నాయుడు వేధింపులకు ఆగ్రోస్ అధికారి సెలవుపై వెళ్లిపోతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?. ఎమ్మెల్యేలు, మంత్రుల నీతి మాలిన చర్యల వెనుక చంద్రబాబు ఆమోదం ఉంది. భూ కుంభకోణాల గురించి జనం చర్చించుకుంటున్నారని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రాయలసీమకు తాగునీరు రాకపోతున్నా పట్టించుకోరా?. దెందులూరులో మా పార్టీ నేత పామాయిల్ తోటలోకి టీడీపీ గూండాలు చొరపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ వికృత క్రీడలను ఇకనైనా ఆపండి’’ అంటూ శైలజానాథ్ హెచ్చరించారు.
‘‘రౌడీషీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వటం వెనుక హోంశాఖ ఉండటం దుర్మార్గం. ప్రజలకు ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాలి. అరుణ సెల్ఫీ వీడియోకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు సర్వ నాశనం అవుతున్నాయి. అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?. దౌర్జన్యాలు చేసే ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్ ఇస్తారా? ఇంతకంటే దారుణం ఉంటుందా?’’ అంటూ శైలజానాథ్ మండిపడ్డారు.
