
ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా సంబరాలలో (Mysore Dasara Festival) పాల్గొనడానికి అడవుల్లోని శిబిరాల నుంచి వచ్చిన గజరాజులు భారమైన హృదయాలతో మైసూరువాసులకు, పర్యాటకులకు వీడ్కోలు పలికాయి.

ఇక వెళ్లొస్తాం.. అంటూ అడవులకు నిష్క్రమించాయి. దసరా ఉత్సవాలలో గజరాజుల (Elephants) సేవలను తలచుకుంటూ అందరూ ఆవేదన చెందారు, కొందరైతే కన్నీరు కార్చారు.

జంబూసవారీ వేడుకల్లో ఏనుగులు విజయవంతంగా పాల్గొని ఉత్సవాలను సంపూర్ణం చేయడం తెలిసిందే. జంబూసవారీ కోసం గజరాజులకు చేసిన రంగురంగుల బొమ్మల అలంకారం ఇంకా తడి ఆరకముందే నగరాన్ని వీడాయి.

ఆదివారం ఉదయమే కెప్టెన్ అభిమన్యు సహా 14 ఏనుగులకు స్నానాలు చేయించి అర్చకులు వివిధ రకాల పూజలు చేశారు. వాటికి పండ్లు, చెరుకులను తినిపించారు.

ఏనుగులు తొండాలు ఎత్తి దండాలు పెట్టాయి. వీడ్కోలు వేడుకను చూడడానికి వేలాది మంది తరలివచ్చారు.

అటవీ సిబ్బంది ఒక్కో ఏనుగును ఒక్కో లారీలోకి ఎక్కించారు. లారీలు కదిలిపోతుంటే, అధికారులు, ప్రజలు అందరూ బాధగా చూస్తుండిపోయారు.















