
సాక్షి, అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్ట్ గురించి మాట్లాడే అర్హత సీఎం చంద్రబాబుకు లేదని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హంద్రీనీవాను కేవలం 5 టీఎంసీల తాగునీటి ప్రాజెక్ట్ స్థాయికి కుదించిన ఘనుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ ఆనాడు రాయలసీమ కష్టాలను తీర్చడానికి 3850 క్యూసెక్కుల నీటిని తీసుకువచ్చే ప్రాజెక్ట్‌గా హంద్రీనీవాకు రూపకల్పన చేశారని వెల్లడించారు. సిగ్గులేకుండా చంద్రబాబు హంద్రీనీవాను తానే పూర్తి చేశానంటూ అబద్దాలు మాట్లాడటాన్ని చూసి రాయలసీమ వాసులు నవ్వకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..
తాజాగా నంద్యాల జిల్లా మల్యాల వద్ద హంద్రీనీవా వద్ద జలాలను విడుదల చేసే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గతంలోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగింది. అలాంటి ప్రాజెక్ట్ వద్దకు మళ్లీ సీఎం స్థాయిలో వెళ్లి జలాలను విడుదల చేయడం కొంత ఆశ్చర్యం కలిగించింది. ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. రాయలసీమ గురించి ఏనాడు పట్టించుకోని చంద్రబాబు హంద్రీనీవా గురించి మాట్లాడటం, తన ఘనతగా చాటుకోవడం హాస్యాస్పదంగా ఉంది. 1983లో ఇప్పటి సత్యసాయిజిల్లాలో ఆనాటి సీఎంగా ఎన్టీఆర్ హంద్రినీవాకు శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు దానిని పూర్తి చేశానని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారు
సీఎంగా చంద్రబాబు 9 ఏళ్ళలో హంద్రీనీవా కోసం చేసిన ఖర్చు ఎంత?
1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉరవకొండలో హంద్రీనీవాకు చంద్రబాబు శంకుస్థాపన చేసే ప్రయత్నం చేశారు. 1999లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆత్మకూరు సమీపం లోని ఒడ్డుపల్లి వద్ద మరో శంకుస్థాపన రాయి వేశారు. 40 టీఎంసీల సాగునీటి ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన హంద్రీనీవా ప్రతిపాదనలు ఒడ్డుపల్లి వద్దకు వచ్చేలోగా దానిని అయిదు టీఎంసీల తాగునీటి ప్రాజెక్ట్‌గా మార్చేశారు. అనంతపురం జిల్లా వారికి వ్యవసాయం చేతకాదని సాగునీటి ప్రాజెక్ట్‌ను, తాగునీటి ప్రాజెక్ట్‌గా మార్చేసిన ఘనుడు చంద్రబాబు.
చంద్రబాబు 1995-2004 వరకు చంద్రబాబే సీఎంగా ఉన్నారు. ఈ సమయంలో హంద్రీనీవా కోసం ఆయన చేసిన ఖర్చు రూ.13.75 కోట్లు మాత్రమే. శ్రీశైలంలో 834 అడుగుల స్థాయి నుంచి నీటిని తీసుకోవచ్చని వైఎస్సార్ ఆలోచించి హంద్రీనీవాను సాగునీటి ప్రాజెక్ట్‌గా మార్చి 3850 క్యూసెక్కుల నీటిని తెచ్చుకునేలా ప్రణాళికలను మార్పు చేశారు. మొత్తం ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు, ముప్పై లక్షల మందికి తాగునీటిని అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ.7000 కోట్ల వరకు ఖర్చు చేసి తొలి దశను పూర్తి చేశారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జీడిపల్లికి నీటిని తీసుకువచ్చాం. శ్రీశైలంలో 843 అడుగులకు తగ్గితే ముచ్చుమర్రి వద్ద 790 అడుగులకు తగ్గినా కూడా హంద్రీనీవా కాలువలకు ఎత్తిపోతల ద్వారా నీటిని అందించాలనే ప్రణాళికను కూడా వైఎస్సారే చేశారు.
హంద్రీనీవా మట్టిపనుల్లో ఎంత మింగారు చెప్పాలి
హంద్రీనీవా ప్రాజెక్ట్ చంద్రబాబుకు ఏటీఎంలా మారింది. రాష్ట్ర విభజన తరువాత సీఎంగా చంద్రబాబు రెట్టింపు రేట్లకు టెండర్లు కూడా లేకుండా తనకు అనుకూలమైన కాంట్రాక్టర్‌లకు హంద్రీనీవా పనులను కట్టబెట్టారు. ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ నిబంధనలతో సంబంధం లేకుండా ధరల సర్ధుబాటు కోసం జీఓ 22, పనుల పరిమాణం ఆధారంగా బిల్లులు ఇచ్చేందుకు జీఓ 63 లను జారీ చేసింది చంద్రబాబే. మా హయాంలో పూర్తి చేసిన హంద్రీనీవా పనులను చంద్రబాబు సీఎంగా ముందుకు తీసుకువెళ్ళడంలో విఫలమయ్యారు.
సిగ్గు లేకుండా 2014-19 మధ్య పనులను పరుగులు పెట్టించామంటూ చంద్రబాబు చెప్పుకోవడం దారుణం. ఈ ప్రాజెక్ట్‌ను అడ్డం పెట్టకుని ఎలా అవినీతికి పాల్పడ్డారో కాగ్ రిపోర్ట్‌ల్లోనే తేటతెల్లం అయ్యింది. చంద్రబాబు హయాంలోనే 1.22 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని హంద్రీనీవా నుంచి తరలించారు. ఈ మట్టి ఎక్కడకు వెళ్ళిందో చెప్పాలి. ఇందు కోసం రూ.695 కోట్లు ఖర్చు చేశారు. 6 లక్షల టిప్పర్లను తోలారు. దీనిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది.