
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుది బ్రెయిన్ లెస్ గవర్నమెంట్ అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. పేద, మధ్య తరగతి ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వం అంటూ దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వారి కష్టాలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఎగ్గొట్టి సింగపూర్ ట్రిప్పులు తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘చంద్రబాబు సింగపూర్‌ని మరిచిపోలేకపోతున్నారు. ఆయనకు, అసెండాస్‌తో ఉన్న సంబంధం ఏంటో బయట పెట్టాలి?. నారా లోకేష్ విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నారు. గత ఆరు త్రైమాసికాలుగా రూ.4,200 కోట్లు బకాయిపడ్డారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్నారు. పేద విద్యార్థులు గొప్ప చదువులు చదవడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు. వసతి దీవెన కింద ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా రంగానికి వేల కోట్లు ఖర్చు చేసి సంస్కరణలు తెచ్చారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వాటిని సర్వనాశనం చేసింది.
‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎగ్గొట్టటానికి రకరకాల కొర్రీలు పెట్టారు. లోకల్, నాన్ లోకల్ అంటూ కొత్త కొర్రీలు పెట్టారు. చదువుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్తే నాన్‌లోకల్ అంటారా?. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?. జులై 10 నాటికి విద్యాదీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు’’ అంటూ శైలజానాథ్ దుయ్యబట్టారు.
