ఆంధ్రా అంటే అమరావతి ఒక్కటే కాదు: సాకే శైలజానాథ్‌ | Ysrcp Sake Sailajanath Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

ఆంధ్రా అంటే అమరావతి ఒక్కటే కాదు: సాకే శైలజానాథ్‌

May 3 2025 3:05 PM | Updated on May 3 2025 3:55 PM

Ysrcp Sake Sailajanath Fires On Chandrababu

సాక్షి, అనంతపురం: ఆంధ్రా అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా రాష్ట్రంలో భాగమని, ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ స్పష్టం చేశారు. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న ఆయన, ఇది కచ్చితంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఫణంగా పెట్టడమే అని తేల్చి చెప్పారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ ఇంకా ఏమన్నారంటే..

రాజధాని ప్రాంతమైన అమరావతికి కృష్ణా నది ముంపు ప్రమాదం ఉంది. నిజంగా ఆ భయం లేకపోతే దాదాపు రూ.1100 కోట్లతో ఐదు ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిర్మిస్తున్నారు? ఆ 5 లిప్టు స్కీమ్‌లు చేపట్టకపోతే, అమరావతి నిర్మాణానికి రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు హెచ్చరించాయి.  ఇంకా దేశంలో జాతీయ రహదారులను కిలోమీటరుకు రూ.20 కోట్ల వ్యయంతో నిర్మిస్తుంటే, రాజధాని అమరావతిలో మాత్రం కిలోమీటర్‌ రోడ్డుకు ఏకంగా రూ.59 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పైగా ఆ పనుల కాంట్రాక్టులన్నీ టెండర్లు లేకుండా నామినేషన్‌ పద్ధతిలో తమ వారికే కట్టబెడుతున్నాడు. మరోవైపు ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి విశాఖలో దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కట్టబెడుతున్నారు.

ఏడేళ్ల కిందట అమరావతిలో ఐకానిక్‌ టవర్లు, ఆకాశహర్మ్యాలు, సీ ప్లేన్, నది మీద హ్యాంగింగ్‌ బ్రిడ్జి అంటూ గ్రాఫిక్స్‌తో ప్రచారం చేసి ఊదరగొట్టారు. ఐదేళ్లు గడిచాక చూస్తే అమరావతిలో తాత్కాలిక హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ తప్ప వేరే నిర్మాణాలు కనిపించలేదు. అమరావతి కోసం రైతుల నుంచి సేకరించిన 34 వేల ఎకరాల భూమిని బీడు పెట్టేశారు. ఇప్పుడు మళ్లీ మరో 44 వేల ఎకరాలు సేకరిస్తానని మంత్రి పి.నారాయణ చెబుతున్నారు. ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం.. కష్టంగా ఇస్తే కష్టంగానే తీసుకుంటామని ఆయన రైతులను ముందే హెచ్చరిస్తున్నారు.

వరదలు వస్తే చేపలు పట్టుకునే ప్రాంతంలో రాజధానా

ఒక పక్క  బస్టాండ్‌ కట్టడానికే నిధులు లేవని చెప్పే చంద్రబాబు, విజయవాడలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పెట్టుకుని మళ్లీ అమరాతిలో విమానాశ్రయం కడతామని డాబు మాటలు చెబుతున్నాడు. 11 నెలల్లో రూ.1.50 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదు. ఇదిచాలదన్నట్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా నిధులు డ్రా చేసుకునే హక్కును ప్రైవేటు సంస్థలకు అప్పగించారు.

కమీషన్ల కోసం, తమ వారి జేబులు నింపేందుకు అమరావతి అంచనా వ్యయాన్ని ఏకంగారూ. 44 వేల కోట్ల నుంచి రూ.77 వేల కోట్లకు పెంచేశారు. కమీషన్లు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని నాడు వైయస్‌ జగన్‌ తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్, జ్యుడీషియల్‌ ప్రివ్యూ విధానాలను చంద్రబాబు రద్దు చేశారు. కొత్తగా మొబిలైజేషన్‌ విధానం తీసుకొచ్చి, కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌ కిందకు 10 శాతం నిధులు ఇచ్చి, అందులో నుంచి 8 శాతం కమిషన్ల కింద వసూలు చేసుకుంటున్నారు. ఒకవేళ ఇదంతా నిజం కాకపోతే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధిని ఫణంగా పెడుతూ, అప్పులన్నీ చేసి మొత్తం అమరావతిలోనే ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని సాకే శైలజానాథ్‌ నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement