విజయవాడ: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రభుత్వ రంగానికి వ్యతిరేకమనే విషయం మరోసారి రుజువైందన్నారు. ఆయన కేవలం ప్రైవేటు రంగానికి మాత్రమే అనుకూలమనేది ఆయన విశాఖ కార్మికులపై చేసిన వ్యాఖ్యలతో బయటపడిందన్నారు. ‘స్టీల్ ప్లాంట్ కార్మికులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
చంద్రబాబు తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలి. విశాఖ ఉక్కు అంటే భారతదేశానికి ఒక బ్రాండ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో అవార్డులను సాధించింది. విశాఖ నగర అభివృద్ధిలో స్టీల్ ప్లాంట్ పాత్ర ఎంతో ఉంది. నిన్నటి వ్యాఖ్యలతో చంద్రబాబుకు పబ్లిక్ రంగం పై ఉన్న వ్యతిరేకత తేటతెల్లమైంది
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు ఇవ్వాలని అందరూ కోరుతున్నారు. సొంత గనులు ఇవ్వలేకపోతే సెయిల్ లో విలీనం చేయాలిటిడిపి ఎంపీలకు సిగ్గులేదు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు ఇవ్వాలని అడగడం చేతకాదు. మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కుసొంత గనులు ఇవ్వాలని కేంద్రమంత్రిని టిడిపి ఎంపీలు అడుగుతున్నారు.
విద్యా, వైద్యం , టూరిజాన్ని ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారు. అన్నీ ప్రైవేట్ పరం చేసి ఎవరిని పరిపాలన చేయాలనుకుంటున్నావ్ చంద్రబాబు. సంపద సృష్టి అంటే కార్పొరేట్లకు ఊడిగం చేయడమేనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం చంద్రబాబు నైజం. చంద్రబాబు వ్యాఖ్యలు తెలుగుజాతిని అవమానించినట్లే. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అయితే చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోవడం ఖాయం. స్టీల్ ప్లాంట్ కోసం త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతాం’ అని హెచ్చరించారు.



