
విజయవాడ: శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు ఎదురుదాడి లేదా తప్పించుకుని తిరిగే తప్పా, ప్రభుత్వం నుంచి బాధ్యతాయుతమైన సమాధానం రాలేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు(శనివారం, సెప్టెంబర్ 27వ తేదీ) శాసనమండలి సమావేశాల అనంతరం బొత్స మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘ రైతులు ఇబ్బందులు పడుతున్నా యూరియా పై చర్చించడానికి ఒప్పుకోలేదు.
మేము ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉన్నాం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు. 10 చెప్పి 3 అమలు చేస్తే సూపర్ హిట్ అవుతుందా?, కార్మికుల పని గంటలు పెంచే బిల్లు వ్యతిరేకించాం.. ఆ బిల్లులో భాగస్వామ్యం కామని చెప్పాం. క్రిడాల్లో దేశానికి, రాష్టానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యక్తికి జాబ్ ఇవ్వడానికి బిల్లు పెడితే మేము సమర్ధించాం.
కానీ రాజకీయ గొడవలతో చనిపోయిన కుటుంబంలో వ్యక్తికి జాబ్ ఇస్తామని బిల్లు పెడితే వ్యతిరేకించాం. ఈ బిల్లు పాస్ అయితే రాష్ట్రంలో కక్షలు-కార్పణ్యాలు పెరిగిపోతాయి. ప్రభుత్వానికి రాజకీయ ఆలోచన తప్ప ప్రజలు వారి అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి లేదు. ఒంటెద్దు పోకడలతో ప్రభుత్వం పోతుంది. చైర్మన్‌కి జరిగిన అవమానంపై కూడా సభలో చర్చించాం.. ఇక ముందు జరగదని చెప్పారు’ అని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో టీడీపీ కార్యక ర్త రామాంజనేయులు ఉద్యోగం బిల్లు ఆమోదం పొందలేదు. దాంతో ఆ బిల్లు ఆమోదం పొందకుండానే శానస మండలి నిరవధిక వాయిదా పడింది.
