సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: తణుకులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్ విగ్రహం వద్ద 144 సెక్షన్ విధించారు. జనవరి 5న వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేస్తామని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రకటించగా.. వైఎస్సార్ విగ్రహం చుట్టూ రెవెన్యూ అధికారులు ఇనుక కంచె వేశారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ వైఎస్సార్ విగ్రహాన్ని ప్రారంభిస్తామన్న కారుమూరి తేల్చి చెప్పారు. ఇప్పటికే మాజీ మంత్రి కారుమూరి సహా 13 మందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. విగ్రహం వద్ద పోలీసులు పహారా కొనసాగుతుంది.
కాగా, ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే తణుకు ప్రాంతం రాష్ట్రంలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన సంఘటనలతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా తణుకు వై.జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ కట్టి టీడీపీ సానుభూతిపరులు చేసిన నిర్వాకం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
వైఎస్సార్ విగ్రహానికి చంద్రబాబు ఫ్లెక్సీ కట్టడంపై ప్రజలు దుమ్మెత్తి పోశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగడం, తమ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, ఆపై రెండు ఫ్లెక్సీలు పోలీసులు తొలగింపచేయడం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.


