అంకెల గారడీనే నమ్ముకున్న చంద్రబాబు ప్రభుత్వం
‘ఆడబిడ్డ నిధి’ ఊసే ఎత్తకుండా బడ్జెట్ కేటాయింపులు
కీలక పథకాలకు కేంద్ర నిధులపైనే ఆధారపడిన బాబు సర్కార్
పోషకాహారం, బాల కార్మికులు, బాల్య వివాహాలను విస్మరించిన ప్రభుత్వం
2021 – 22లో జండర్ బడ్జెట్‌తో మహిళా సాధికారతకు వైఎస్ జగన్ కృషి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం జండర్ (లింగ ఆధారిత) బడ్జెట్ కేటాయింపుల్లోనూ దగా చేసింది. మహిళల సాధికారతకు దోహదం చేసే పటిష్టమైన పథకాలు, కార్యక్రమాల అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించింది. ప్రధానంగా ఎన్నికల హామీల అమలులో చిత్తశుద్ధి కొరవడిందని జండర్ బడ్జెట్‌తో తేలిపోయింది. మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టకుండానే అంకెల్లో గారడీ చేసి మభ్యపెట్టారు.
నూరు శాతం మహిళలు, బాలికలు లబ్ధి పొందే పథకాలకు (పార్ట్ – ఏ) రూ.19,496.47 కోట్లు కేటాయించగా, 30 నుంచి 99 శాతం వరకు మహిళలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.71,363.07 కోట్లు కేటాయించారు. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ల పంపిణీని గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అమలును మాత్రం పట్టించుకోలేదు. బాలికల విద్య, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, పోషణ పథకాలు, గర్భిణులకు ఆర్థిక సహాయం వంటి పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వ నిధులపైనే ఆధారపడి కేటాయింపులు జరపడం గమనార్హం.
డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీ, గ్రామీణ మహిళల స్వయం ఉపాధి ప్రోత్సాహం, మహిళా రైతులకు ప్రత్యేక పథకాలు, స్వయం సహాయక సంఘాలకు కేటాయింపులు సైతం నామమాత్రమే. మహిళల సాధికారత, లింగ సమానత్వం, భద్రత, ఆరోగ్యం, ఉపాధి లక్ష్యాలుగా జండర్ బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినట్టు గొప్పలు చెప్పుకున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు అనుగుణంగా లేదన్నది స్పష్టమవుతోంది.
నామమాత్రంగానే పిల్లల బడ్జెట్..
రాష్ట్రంలో బాలల కేంద్రీకృత విధానాలు, వారి భరోసా కోసం ఉద్దేశించిన పథకాలకు (ఛైల్డ్) బడ్జెట్ కేటాయింపులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. నూరు శాతం పిల్లలే లబ్దిదారులుగా అమలు చేసే కార్యక్రమాలకు రూ.16,168.33 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్‌తో పోల్చితే కేవలం రూ.2,400 కోట్లు మాత్రమే అధికం.
మరోవైపు 30 నుంచి 99 శాతం వరకు పిల్లలే లబ్ధి పొందే కార్యక్రమాలకు ఈ ఏడాది రూ.8,517.34 కోట్లు కేటాయించారు. వీటిలోనూ కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులపైనే ఆధారపడడం గమనార్హం. బాలల్లో పోషకాహార లోపం, బాల కార్మికులు, బాలల అక్రమ రవాణా, స్కూల్ డ్రాపౌట్స్, బాల్య వివాహాలు, లింగ వివక్ష నిర్మూలనకు చైల్డ్ బడ్జెట్‌లో దృష్టి సారించలేదు.
జండర్ బడ్జెట్‌కు శ్రీకారం చుట్టిన ఘనత వైఎస్ జగన్‌దే
వాస్తవానికి జండర్ బడ్జెట్‌ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2021 – 22 నుంచి ప్రారంభించింది. ప్రత్యేకంగా మహిళల కోసం జండర్ బడ్జెట్ పెట్టి వారిని ఆర్థిక, రాజకీయ, సామాజికంగా సాధికారతవైపు నడిపిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. రాష్ట్రంలో కోవిడ్ కష్టకాలాన్ని తట్టుకుని మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌కు శ్రీకారం చుట్టారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయింపుల తరహాలో మహిళలు, బాలికల (జండర్ బేస్డ్) బడ్జెట్‌కు ప్రత్యేకంగా శ్రీకారం చుట్టడం గమనార్హం. మహిళలు, బాలికల ఆరోగ్యం, విద్య, ఆర్థిక భాగస్వామ్యం, రక్షణ, సామాజిక భద్రత వంటి కీలక రంగాల్లో ప్రాధాన్యమిచ్చేలా జండర్ బడ్జెట్ రూపొందించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారతలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.
వైఎస్ జగన్ దార్శనికతతో చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో 90 శాతం మహిళలకు సంక్షేమ ఫలాలు అందాయి. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), పరోక్ష లబ్ధి (నాన్ డీబీటీ) పద్ధతిలో రాష్ట్రంలోని దాదాపు 31 పథకాల ద్వారా లబ్ధి చేకూర్చిన వైఎస్ జగన్ పాలన మహిళలకు స్వర్ణయుగమని వారు గుర్తు చేసుకుంటున్నారు.


