
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధమైన చట్ట సభలను ప్రభుత్వం గౌరవించి తీరాల్సిందేనని ఏపీ శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) అన్నారు. మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజుకు జరిగిన అవమానంపై నల్లకండువాలతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శనివారం సమావేశాలకు హాజరయ్యారు. ఈ అంశంపై చర్చకు బొత్స పట్టుబడడంతో శనివారం మండలి హీటెక్కింది.
‘‘రాజ్యాంగబద్ధమైన చట్ట సభలను గౌరవించాలనేది మా డిమాండ్. రాజ్యాంగం ప్రకారం సభను, ప్రభుత్వాన్ని నడపాలి. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో చట్టాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. ప్రభుత్వం సభ్యులకు ఇచ్చే గౌరవాన్ని ఇచ్చి తీరాలి. సభాపతికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. కానీ, ఇంతవరకు వాళ్ళ వైపు నుంచి స్పందన కూడా రాలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ జరగలేదు. ఇది రాజ్యాంగబద్ధమైన అంశం అన్నట్లు కాకుండా వ్యక్తిగత విషయంలా చూడటం ఆక్షేపనీయం..
.. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం చైర్‌లో కూర్చున్న వారికే కాదు ఎవరికి కులాలు ఆపాదించకూడదు. శాసనసభలో నందమూరి బాలకృష్ణ ప్రవర్తన సభలో అందరూ చూశారు(Balayya Comments). ఒక మాజీ ముఖ్యమంత్రిని, మాజీ కేంద్ర మంత్రిని ఎలా మాట్లాడారో అందరూ చూశారు. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలు, సభాపతి స్పందించి ఇప్పటికే మాట్లాడాలి. కానీ..
మొన్న ఘటన జరిగితే ఇప్పటిదాకా స్పీకర్(Assembly Speaker Silence On Balayya Comments) స్పందించలేదు. ఆయన తనకేం సంబంధం లేని విషయం అన్నట్లుగా ఉన్నారు. ఇటు సంబంధిత అధికారులను పిలిచి మండలి చైర్మన్ అవమానం విషయంలో ఏ జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేయాలి. సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్లాలనేదే మా ఉద్దేశ్యం. నిబంధనల ప్రకారం సభ్యులంతా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి’’ అని బొత్స అన్నారు.
తప్పు ఒప్పుకున్న పయ్యావుల!
శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు(Koyye Moshenu Raju)కు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాల్సిందేనని వైఎస్సార్‌సీపీ ఇవాళ కూడా ఆందోళన కొనసాగించింది. దీనికి సభా నాయకుడు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసింది. ‘‘మండలి చైర్మన్ అవమానం పై ముందు తేల్చండి. ప్రభుత్వం ఎందుకు జరిగిన తప్పు పై స్పందించడం లేదు’’ అని బొత్స ప్రశ్నించారు.
దీనికి మంత్రి పయ్యావుల సమాధానమిస్తూ.. ప్రభుత్వానికి ఎక్కడ చైర్మన్‌ను చిన్నచూపు చూడాలనే ఉద్దేశం లేదన్నారు. ‘‘మొదటి నుంచి పార్టీలో క్రమశిక్షణ నేర్పుతారు. చైర్ గౌరవానికి తగ్గట్లుగా నడుచుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం. ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి.. మండలి నిర్వహణకు సహకరించాలని’’ అని వైఎస్సార్‌సీపీ సభ్యులను కోరారు. అయితే..
ప్రభుత్వ కార్యక్రమాలకు చైర్మన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. రిపీట్‌డెడ్‌గా ఇలా జరుగుతోందని బొత్స అన్నారు. ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం కలిగించే బిల్లులకు మేం వ్యతిరేకం కాదు. మండలి చైర్మన్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. మండలి సభ్యులంటేనే మరీ చిన్నతనంగా చూస్తున్నారు’’ అని బొత్స అన్నారు. ఈ ఆందోళల నడుమ మండలి కాసేపు వాయిదా పడింది.
ఏం జరిగిందంటే..
అసెంబ్లీ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండలి చైర్మన్ మోషేన్ రాజుకు ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు. ఈ పరిణామంపై వైఎస్సార్‌సీపీ ఆందోళనకు దిగింది. ‘‘మండలి చైర్మన్‌గా దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారు. అలాంటి వ్యక్తిని వరుసగా అవమానించడం దారుణం. గతంలో స్పోర్ట్స్ మీట్ సందర్భంలో కూడా చైర్మన్‌ను అవమానించారు. దీనిపై సీఎం, మంత్రి క్షమాపణ చెప్పాలి” అని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. అయితే.. తిరుపతి సదస్సుకు చైర్మన్ రానని అధికారులు తెలిపారని మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇవ్వగా.. తాను అలా చెప్పలేదంటూ మండలి చైర్మన్ మోషేన్ రాజు చెప్పడంతో మండలి ఒక్కసారిగా వేడెక్కింది.
ఇదీ చదవండి: చైర్మన్‌కు అవమానం..తీవ్ర రాజ్యాంగ ఉల్లంఘనే!