సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో దేవుడికి కూడా వేధింపులు తప్పటం లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడు, ఆలయాల మీద కూడా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సింహాచలం ఆలయ ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా?. ఇంతకంటే నీచమైన పని ఇంకోటి ఉంటుందా? అంటూ నాగార్జున యాదవ్ నిలదీశారు.
‘‘ఇలాంటి నీచ రాజకీయాలను దేవుడు కూడా క్షమించడు. ఆలయాల పవిత్రతను దెబ్బ తీయవద్దు. సింహాచలం అప్పన్న ఆలయ ప్రసాదంలో నత్త రావటం ఆందోళనకు గురి చేసింది. ఇదే ఆలయంలో గోడ కూలి భక్తులు మరణించారు. ఇప్పుడు ప్రసాదంలో నత్త వచ్చింది. దీనిపై ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యమైన సమాధానం చెప్పి, బెదిరించారు. ఆ దంపతులు ఒక వీడియో పోస్టు చేస్తే వారిని టార్గెట్ చేశారు. ఆ జంటపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం
..ప్రసాదంలో నత్త రావటానికి కారణాలపై విచారణ జరపకుండా భక్తులపై కేసులు పెడతారా?. చివరికి దేవుడి మీద కూడా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. దీనిని దేవుడు కూడా క్షమించరు. నీచ రాజకీయాలకు దేవుడ్ని వాడుకోవద్దు. చంద్రబాబుకు దైవ భక్తి ఉంటే భక్తులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని నాగార్జున యాదవ్ డిమాండ్ చేశారు.


