
సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అజిత్‌సింగ్ నగర్‌లో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీ రాహుల్లా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఐదేళ్లలో సామాన్యుల పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు మెడికల్ విద్య చదవాలని కాలేజీలు తీసుకువచ్చారు. ప్రైవేట్ కాలేజీలు ఇచ్చిన ప్యాకేజి తీసుకోవాలని చంద్రబాబు, లోకేష్, పవన్ ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. డబ్బు మీద ప్రేమతో సామాన్యుల కలను చిదిమేస్తున్నాడు మెడికల్ కాలేజీల పరిశీలనకు వెళ్తే పోలీసులతో అడ్డుకున్నారు.. కేసులు పెట్టారు. నిర్బంధంతో పోరాటం ఆపలేరు. మెడికల్ కాలేజీల ప్రవేటికరణ ఆపకపోతే పోరాటం తీవ్రతరం చేస్తాం’ అని హెచ్చరించారు.

విశాఖ: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దంటూ వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కుటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కూటమి సర్కార్ అంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చంద్రబాబు పెడుతున్నారు. పేదల పక్షపాతి వైఎస్ జగన్. దళితుల జోలికి వస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం’’ అంటూ గొల్ల బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ జిల్లా: కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అనంతపురం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై దళిత సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేస్తూ.. నల్లబ్యాడ్జీలు, బెలూన్లతో నిరసన తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తిరుపతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం పేద వర్గాల పిల్లలకు వైద్య విద్యను దూరం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజేంద్ర మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. పునరాలోచన చేయాలంటూ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.
గుంటూరు: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గెడ్డేటి సురేంద్ర ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ వనమా బాల వజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు.