సాక్షి, అన్నమయ్య జిల్లా: జిల్లాను నిలబెట్టలేకపోతే మీసం తీసుకుంటా అంటూ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గతంలో తొడగొట్టి మరీ చెప్పిన మాటలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాయచోటిలో ఆయన తీరుపై అసంతృప్తి.. క్రమక్రమంగా ఆగ్రహ జ్వాలలుగా మారుతోంది.
తాజాగా రాయచోటిని మదనపల్లిలో కలపడంపై కేబినెట్‌లో సంతకం చేసిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. బయటకు వచ్చి కంటతడి పెట్టారు. అయితే ఆయనది డ్రామా అంటూ రాయచోటి ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నాడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకుని రాయచోటికి జిల్లాను తెచ్చారు. దానిని నిలబెడతానని.. లేకుంటే మీసం తీసేస్తానంటూ రాంప్రసాద్‌రెడ్డి శపథం చేశారు.
ఈ క్రమంలో.. ఇప్పుడు మీసం తీసేస్తారంటూ అంటూ రాజకీయ ప్రత్యర్థులు సెటైరలు సంధిస్తున్నారు. శ్రీకాంత్‌రెడ్డి పదవీ త్యాగంతో జిల్లాను తీసుకొస్తే..రాంప్రసాద్‌రెడ్డి మంత్రి పదవి కోసం జిల్లాను ముక్కలు చేశాడంటున్న రాయచోటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో..
జిల్లా కేంద్రంలో రాయచోటిని తొలగించి మదనపల్లికి మార్చడంపై ఇటు ముస్లిం మత పెద్దల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. శుక్రవారం జిల్లా కేంద్రం మార్పునకు నిరసగా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించాయి.
ప్రభుత్వ పెద్దలు పునరాలోచన చేయాలని.. అన్నమయ్య జిల్లాలోనే యధావిధిగా కొనసాగించాలని మత పెద్ద సర్కాజి షర్ఫుద్దీన్ హుస్సేని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించలేని పక్షంలో రాయచోటిని కడప జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారాయన. ‘‘జిల్లా కేంద్రం లేనప్పుడు పన్నుల భారం కూడ తోలగించి రాయచోటిను వైఎస్ఆర్ జిల్లాలో విలీనం చేయండి అని కోరుతున్నారాయన.


