సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారింది. అటు ప్రభుత్వ, ఇటు అధికార వర్గాలనే విస్మయానికి గురి చేస్తూ ఈ ఉదయం ఆయన లండన్ వెళ్లినట్లు సమాచారం. అయితే.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసమే ఆయన వెళ్లి ఉంటారని అటు టీడీపీ వర్గాలు జోరుగా కూడా చర్చించుకోవడం కొసమెరుపు.
ఉండవల్లి నుంచి హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి అటే లండన్‌కు అత్యంత రహస్యంగా సాగింది ఆయన పర్యటన. అయితే.. పదేపదే విదేశీ పర్యటల వెనుక మతలబు ఏంటనే చర్చ జోరందుకుంది ఇప్పుడు. ఈ ఏడాదిలో ఇప్పటికే చంద్రబాబు ఆరుసార్లు విదేశాలకు వెళ్లారు. సీఎం హోదాలో పెట్టుబడుల సాధన పేరు చెప్పి.. కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా పర్యటించిన సందర్భాలే ఉన్నాయి. అయితే..
సీఎం హోదాలో ఉండి కూడా అంత రహస్యంగా పర్యటనలు చేయడం ఎందుకు? అనే చర్చ మొదలైంది ఇప్పుడు. అటు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా తరచూ రహస్య పర్యటనలు చేస్తుండడం.. కనీస సమాచారం లేకపోవడం తెలుగు దేశం పార్టీలోనూ తీవ్రచర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం లోకేష్ విదేశీ పర్యటనలోనే ఉన్నాడు. అందుకే నిన్నటి ఏపీ కేబినెట్ భేటీకి కూడా హాజరు కాలేదు.
రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా కూటమి నేతలు చంద్రబాబు, పవన్, నారా లోకేష్‌లు మాత్రం విలాసాల విషయంలో ‘తగ్గేదే లే’ అంటున్నారు. ఒకవైపు అడ్డగోలుగా అప్పులు చేస్తూనే.. ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ల ఖర్చుతో రాష్ట్ర ఖాజనాకు చిల్లు పెడుతుండడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.


