
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కూటమి సర్కార్ వెన్నుపోటు పొడిచింది. ఉక్కు పరిశ్రమలో మరో కీలక విభాగం ప్రైవేటీకరణకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే పలు కీలక విభాగాలు ప్రైవేటుకు అప్పగించిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో కార్మిక సంఘాలు భగ్గుమంటున్నారు. దశల వారీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రైవేటీకరణ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
స్టీల్‌ప్లాంట్ ఆసక్తి వ్యక్తీకరణ జాబితాలోకి మరో విభాగం చేరింది. శనివారం విడుదల చేసిన నోటీసులో స్టీల్‌ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్ (టీపీపీ)–1కు సంబంధించి యాజమాన్యం ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) జారీ చేసింది. ‘కాంప్రహెన్సివ్ టెక్నికల్ మేనేజ్ మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కేప్టివ్ పవర్ ప్లాంట్–1 అండ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్’ పనులకు సంబంధించి ఈవోఐ దాఖలుకు సెప్టెంబర్ 9న ఆఖరు తేదీగా నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం బిడ్లు తెరవనున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వైజాగ్ స్టీల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.