మద్యం సిండికేట్‌ దోపిడీకి పచ్చజెండా | Chandrababu govt liquor scam in Andhra pradesh | Sakshi
Sakshi News home page

మద్యం సిండికేట్‌ దోపిడీకి పచ్చజెండా

Jan 9 2026 3:27 AM | Updated on Jan 9 2026 9:28 AM

Chandrababu govt liquor scam in Andhra pradesh
  • అప్పట్లో బార్లపై ప్రివిలేజ్‌ ఫీజు రద్దు.. ఇప్పుడు ఏఆర్‌ఈటీ తొలగింపు
  • తద్వారా సిండికేట్‌కు ఏటా రూ.500 కోట్ల అదనపు లాభం
  • మద్యం ధరలకూ రెక్కలు
  • దీంతో మద్యం ప్రియులపై ఏటా రూ.3 వేల కోట్ల బాదుడు
  • టీడీపీ కూటమి బ్యాచ్‌ దోపిడీకి కొమ్ముకాయడమే లక్ష్యంగా సర్కారు అడుగులు
  • కేబినెట్‌ సమావేశం వేదికగా చంద్రబాబు ప్రభుత్వ తాజా మద్యం కుంభకోణం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బార్లు, మద్యం షాపులను ఇప్పటికే తమ తాబేదర్లకు ఇష్టారాజ్యంగా కేటాయించుకున్న చంద్రబాబు ప్రభుత్వం దానికి కొన­సాగింపుగా మరో అంకానికి తెరలేపింది. వారికి మరింత లబ్ధిచేకూర్చేలా అడ్డగోలు నిర్ణయాలకు శ్రీకారం చు­ట్టింది. 2014–19 మధ్య మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును యథేచ్ఛగా రద్దుచేసి ఖజానాకు గండికొట్టినట్లుగానే ఇప్పుడు బార్లపై ‘అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను (ఏఆర్‌ఈటీ)ని చంద్రబాబు సర్కారు తాజాగా తొలగిస్తూ వారికి బంపర్‌ ఆఫర్‌ ఇస్తూ నాటి మద్యం కుంభకోణానికి అవలంబించిన విధానాన్నే తిరిగి లిఖిస్తోంది.

అలాగే, టీడీపీ మద్యం సిండికేట్‌ దోపిడీకి కొమ్ముకాయడమే లక్ష్యంగా మద్యం ప్రియులకు షాక్‌ ఇస్తూ వాటి ధరలను బాటిల్‌పై రూ.10 చొప్పున పెంచింది. ఇలా.. మద్యం సిండికేట్‌కి ఏటా రూ.500 కోట్ల వరకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగిస్తూ.. మరోవైపు ధరల దరువుతో మద్యం ప్రియు­లపై ఏటా రూ.3 వేల కోట్ల మోత మోగిస్తోంది. మంత్రి మండలి సమావేశం వేదికగా చంద్రబాబు ప్రభుత్వ తాజా మద్యం కుంభకోణం కథాకమామిషు ఇది.

రూ.2 వేల కోట్ల సిండికేట్‌ దోపిడీకి పచ్చజెండా..
ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ ఎల్లో సిండికేట్‌ అడ్డగోలు లాభాలు సాధించేందుకు చంద్రబాబు సర్కారు మార్గం సుగమం చేసింది. బార్లకు సరఫరా చేసే మద్యంపై ప్రస్తుతమున్న 15 శాతం ఏఆర్‌ఈటీని రద్దుచేసింది. దీంతో.. ప్రభుత్వ ఖజానా ఆదాయానికి ఏటా రూ.340 కోట్లు గండిపడుతుందని ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. కానీ, వాస్తవానికి రూ.500 కోట్ల వరకు గండిపడుతుందని ఎక్సైజ్‌ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆ ప్రకారం రానున్న నాలుగేళ్లలో రూ.2 వేల కోట్లు మేర ప్రభుత్వం నష్టపోనుంది. అంటే.. టీడీపీ సిండికేట్‌ గల్లా పెట్టే మరో రూ.2 వేల కోట్లతో కళకళలాడనుంది. 

అప్పట్లో ప్రివిలేజ్‌ ఫీజు రద్దు దందా..
2014–19లో కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇదే రీతిలో మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దుచేసి టీడీపీ మద్యం సిండికేట్‌ దోపిడీకి కొమ్ముకాసింది. ఆర్థిక శాఖ అనుమతిగానీ కేబినెట్‌ ఆమోదంగానీ లేకుండానే 2015లో మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును రద్దుచేస్తూ 216, 217 పేరుతో రెండు చీకటి జీఓలు జారీచేసింది. తద్వారా 2015 నుంచి 2019 వరకు ఏడాదికి రూ.1,300 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.5,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టింది. తద్వారా టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీగా కమీషన్లు కొల్లగొట్టారు.

ఆ తర్వాత ఈ కుంభకోణాన్ని సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. ప్రధాన నిందితులుగా అప్పటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతోపాటు పలువురిపై ఐపీసీ, సెక్షన్లు–166, 167, 409, 120 (బి) రెడ్‌విత్‌ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు–13(1), (డి), రెడ్‌విత్‌ 13 (2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు బెయిల్‌పై దాదాపు మూడేళ్లు బయట ఉన్నారు. ఆ కేసును ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఇటీవల అడ్డగోలుగా క్లోజ్‌ చేయడం గమనార్హం.

 

 

ఇక 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా ఆ కేసును అటకెక్కించింది. చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసు­దేవరెడ్డిని వేధించి బెంబేలెత్తించింది. ఆయనపై కేసులు నమోదుచేసి లొంగదీసుకుంది.మరోవైపు.. ఈ కేసులో ఆధారాల్లేవని సీఐడీ న్యా­య­స్థానానికి నివేదించింది. ప్రభుత్వ వేధింపులతో వాసు­దేవ­రెడ్డి అందుకు వంతపాడారు. దాంతో ఆ కేసును మూసివేశారు. ప్రసుతం అదే రీతిలో ఏఆర్‌ఈటీని రద్దుచేసి మరోసారి మద్యం సిండికేట్‌ దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌కార్పెట్‌ వేసింది.

మద్యం ప్రియులకు ధరల షాక్‌..
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచి ప్రభు­త్వం మద్యం ప్రియులకు షాక్‌ ఇచ్చింది. రూ.99 మద్యం తప్ప మిగిలిన అన్ని రకాల మద్యంపై ధరల మోత మోగించింది. సీసాపై రూ.10 చొప్పున పెంచింది. తద్వారా మద్యం ప్రియులపై ఏడాదికి రూ.1,391 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. కానీ, ఈ బాదుడు రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని ఎక్సైజ్‌ శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

రాష్ట్రంలో నెలకు సగటున రూ.3 వేల కోట్ల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. వాటిలో బీరు విక్రయాలు రూ.వె­య్యి కోట్లు కాగా.. మద్యం విక్రయాలు రూ.2 వేల కోట్లు. మద్యం విక్రయాల్లో రూ.99 మద్యం సీసాల వాటా 30 శాతం ఉంది. మిగిలిన 70 శాతం విక్రయాలు అంటే రూ.1,200 కోట్ల మేర మద్యం విక్రయాలపై ధరల పెరుగుదల ప్రభావం పడనుంది. ఆ ప్రకారం నెలకు రూ.250 కోట్ల వరకు మద్యం ప్రియులకు షాక్‌ తగలనుంది. అంటే.. ఏడాదికి రూ.3 వేల కోట్ల భారం పడనుందన్నది సుస్పష్టం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement