
విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సదస్సులో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల నేతలు
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే అధికారంలో ఉన్న పాలకులు చరిత్రహీనులవుతారు
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత సీఎందే అన్నారు
పవన్‌కళ్యాణ్ విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు
మాపై ఎన్ని కేసులు పెట్టినా వెనుకాడేది లేదు
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 26 జిల్లాల్లో ఉద్యమానికి సన్నద్ధం
అఖిలపక్ష రాజకీయ, ప్రజా సంఘాల సదస్సులో వక్తలు
సీతంపేట: ‘విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే అధికారంలో ఉన్న పాలకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.’ అని అఖిలపక్ష రాజకీయ, ప్రజా సంఘాల నేతలు స్పష్టంచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి, ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గురువారం విశాఖపట్నం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో అఖిలపక్ష రాజకీయ, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ ‘చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత ముఖ్యమంత్రిదే అని చెప్పారు. ఇప్పుడు ప్రైవేటీకరణను ఆపాల్సిన బాధ్యత చంద్రబాబుదే.
ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒకేమాటపై నిలబడ్డాయి. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు మోదీ ముందు సాగిలపడ్డారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వారిపై ఆధారపడి ఉంది. కేంద్రాన్ని విశాఖ ఉక్కు విషయంలో గట్టిగా నిలదీసి తెలుగు ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాలి. ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులు, 1,400 మంది శాశ్వత ఉద్యోగులను తొలగించినా, 44 విభాగాల ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచినా కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కాపాడామని పాలకులు చెప్పడం హాస్యాస్పదం.
విశాఖ ఉక్కు కర్మాగారం గురించి దు్రష్పచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అనడం సరికాదు. ప్రధాని మోదీని ఒప్పించి ప్రైవేటీకణ ఆపే దమ్ము మాధవ్‌కు ఉందా?. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పోరాటానికి సిద్ధమవుతున్నాం. ఈ నెల 12న విజయవాడలో సమావేశం పెట్టాం. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు’ అని పేర్కొన్నారు.
పవన్‌కళ్యాణ్ జవాబు చెప్పాలి
‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉప్పు, కారం తినడం లేదా? అని పవణ్‌కళ్యాణ్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ఆయన ఉప్పు కారం తింటున్నారో.. లేదో జవాబు చెప్పాలి. పవన్‌కళ్యాణ్ విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు. ఆయన రుషికొండ భవనంలో పెచ్చులు ఊడిపోతున్నాయని మీడియాను తీసుకెళ్లి డ్రామాలాడటం హాస్యాస్పదం. స్టీల్‌ప్లాంట్ కార్మికులను తొలగిస్తే అడ్డుకోవాల్సిన టీడీపీ ప్రజాప్రతినిధులు.. రూ.రెండు లక్షలు, రూ.మూడు లక్షలు డబ్బులిచ్చి చాలామంది ఉద్యోగాల్లోకి వచ్చారని చెప్పడం దుర్మార్గం’ అని అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జీవీఎంసీలో వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర ప్రజాసంస్థ కన్వినర్ వీవీ రమణమూర్తి, సీపీఐ జిల్లా కార్యదర్శి రెహమాన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఏవీ వర్మరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్‌కేఎస్‌వీ కుమార్, సీపీఐ ఎంఎల్, ఏఐటీయూసీ, స్లీట్ ప్లాంట్ గుర్తింపు సంఘం, వివిధ ప్రజా, కార్మిక సంఘాల నాయకులు వై.కొండయ్య, గణేష్ పాండా, కె.దేవా, డి.ఆదినారాయణ, ఆర్.రవీంద్రనాథ్, ఏజే స్టాలిన్, ఎం.పైడిరాజు మాట్లాడారు.