రాజకీయాల్లో నిర్ణయాలు ప్రజావసరాలకు తగ్గట్టుగా ఉండాలి కానీ ద్వేషంతోనో... ప్రత్యర్థికి ప్రయోజనం కలుగుతుందన్న సంశయంతోనో చేయకూడదు. చేస్తున్నది మంచి పనా? కాదా? అన్నది ఆలోచిస్తే రాజకీయాలలో పెడధోరణులు తగ్గుతాయి. అయితే సమకాలీన రాజకీయాలలో ప్రజోపయోగాల కంటే ద్వేషానికే పెద్దపీట పడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ జనసేన, బీజేపీల కూటమి సర్కార్, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఈర్ష్యా, అక్కసులతో చేస్తున్న కొన్ని పనులు వారికే చేటు తెచ్చిపెడుతున్నాయి. కూటమి ప్రభుత్వం జగన్ తీసుకువచ్చిన వ్యవస్థలతోపాటు ఆయన చేసిన అభివృద్దిని కూడా విధ్వంసం చేసే రీతిలో సాగుతోంది.
నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి, సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉన్న చంద్రబాబు నాయుడు సంకుచిత ధోరణితో ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు అందరిని విస్మయపరుస్తోంది. విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టించింది. నగరం నడిబొడ్డున పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ గా పేరొందిన స్వరాజ్ మైదానంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే ఒక పెద్ద లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్, స్వాతంత్ర చరిత్రకు సంబంధించిన విజ్ఞాన వేదిక, రిక్రియేషన్ సెంటర్.. వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటుకు సంకల్పించింది. కొన్నిటి నిర్మాణం దాదాపు పూర్తి అయింది. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది. దీంతో అంబేద్కర్ మహా శిల్ప కేంద్రానికి గ్రహణం పట్టింది. అధికారంలోకి రావడంతోనే కూటమి పార్టీ నేతలు కొందరు ఈ కేంద్రంపై దాడి చేసి, జగన్, అంబేద్కర్ పేర్లను తొలగించారు.
విమర్శలు రావడంతో అంబేద్కర్ పేరును మాత్రం తిరిగి పెట్టారట. ఆ తర్వాత ప్రభుత్వం ఈ కేంద్రాన్ని పూర్తిగా విస్మరించింది. చివరికి అక్కడ పనిచేసే పనివారికి జీతాలు ఇవ్వడం లేదు. దాంతో వారు పనులు చేయకపోవడంతో ఆ ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా తయారైంది. ప్రజా సంఘాలు, దళిత సంఘాలవారు నిరసన తెలిపారు. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ అక్కడకు వెళ్లి పరిస్థితి చూసి ఒక ప్రశ్న వేశారు. ‘‘నెలకు రూ.పది లక్షలు ఖర్చు చేసి ఒక అద్భుతమైన ప్రదేశాన్ని పరిరక్షించలేని చంద్రబాబు ప్రభుత్వం రెండు లక్షల కోట్లు వెచ్చించి రాజధానిని ఎలా నిర్మించగలుగుతుంది?’’ అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.
టీడీపీ అంబేద్కర్‌ను అగౌరవ పరిచిందంటూ నెటిజన్లు చంద్రబాబు గతంలో చేసిన కొన్ని ప్రసంగాల వీడియోలను బయటకు తీసి ఏకి పారేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం అంతంతమాత్రంగానే ఉంది. 2014 టర్మ్‌లో టీడీపీ ప్రభుత్వం ఈ మైదానాన్ని చైనా మాల్‌కు ఇవ్వడానికి ప్రయత్నించిందని, సృ‍్మతివనం పేరుతో అమరావతిలో ఓ మారుమూల ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్లాన్ చేసినా జనాగ్రహం కారణంగా వెనక్కు తగ్గాల్సి వచ్చిందని అంటారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ మహాశిల్పాన్ని, కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీని నిర్వహణ, పర్యవేక్షణలపై చేతులెత్తేసింది. ఈ తప్పును తొందరగా దిద్దుకోకపోతే ఫలితం అనుభవించాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వంపై విమర్శల నేపథ్యంలో ఏదో తూతూ మంత్రంగా చేసి, ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారట. అంబేద్కర్ కేంద్రమే కాదు... విశాఖలో రిషికొండ మీద జగన్ నిర్మించిన భవనాలను కూడా కూటమి సర్కారు ఏడాదిన్నరగా పాడు పెడుతోంది. బహుశా వీటిని కూడా ప్రైవేటు రంగానికి అప్పగించవచ్చని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి భవనాల నిర్మాణానికి పూనుకుని, కొన్నిటిని పూర్తి చేసి, మిగిలిన వాటిని కొనసాగిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం పది కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంది. ప్రైవేటీకరణలో భాగంగా ఇంకా మొదలుకాని కొన్ని కాలేజీల టీచింగ్ ఆస్పత్రులకు సంబంధించి విలువైన యంత్ర పరికరాలను ఇతర చోట్లకు తరలిస్తున్నారు. అందులో పులివెందుల కాలేజీ ఎక్విప్ మెంట్ కూడా ఉంది. పులివెందుల అంటే చంద్రబాబు అండ్ కో కి ఉన్న ద్వేషం అలాంటిదని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది.
వైఎస్ జగన్ గతంలో కుప్పంలో ప్రభుత్వ స్కూల్‌ను నాడు-నేడు కింద బాగు చేయించడం, కుప్పానికి హంద్రీ-నీవా నీళ్లు ఇవ్వడానికి కృషి చేయడం, తదితర కార్యక్రమాలు చేపట్టారు. అదే చంద్రబాబు మాత్రం జగన్ నియోజకవర్గమైన పులివెందుల పట్ల వివక్ష చూపుతున్నారన్న విమర్శలను ఎదుర్కుంటున్నారు. పులివెందులతోపాటు రాయలసీమలోని మదనపల్లె, ఆదోని, ప్రకాశం జిల్లా మార్కుపురం కాలేజీల నుంచి కూడా పరికరాలను తరలించారని వార్తలు వచ్చాయి. ఇది ఆ ప్రాంత ప్రజలలో ఆవేదన మిగుల్చుతుందని చెప్పాలి.
టూరిజం రంగానికి చెందిన హోటళ్లు, భవనాలను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి వీలుగా ఆసక్తి కలిగిన కంపెనీలను ఆహ్వానించారు.ఇలా ఒక్కొక్క రంగాన్ని ప్రైవేటువారికి అప్పగించేస్తే ప్రభుత్వం ఇక చేసేది ఏముంటుందని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవస్థలతో పాటు, ఆయా నిర్మాణాలను నిర్లక్ష్యం చేయడం, ప్రైవేటువారిపరం చేయడం వంటి చర్యల ద్వారా కూటమి సర్కార్ విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందన్న అభిప్రాయం కలుగుతోంది.దీనికంతటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న ద్వేషమే కారణంగా కనిపించడం లేదా!

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


