
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ నేతల నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌పై చేస్తున్న కుట్రలపై వైఎస్సార్‌సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులు ధ్వజమెత్తారు. కూటమి కత్తీ బురదను జోగి రమేష్‌కు పూయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 14వ తేదీ) జోగి రమేష్‌ను వెల్లంపల్లి, మల్లాది విష్ణులు కలిశారు.
అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ.. ‘ రాష్ట్రప్రభుత్వం ప్రజలను కల్తీ మద్యంతో వేధిస్తోంది. 16 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది. చిత్తూరు నుంచి వెస్ట్ గోదావరి వరకూ ఎక్కడ చూసినా కల్తీ మద్యమే. టిడిపి అవినీతిని ప్రశ్నిస్తున్నారని తప్పుడు కేసులు పెడుతున్నారు. జోగి రమేష్‌ను ఇరికించాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కల్తీ మద్యంలో టిడిపి నేతల పాత్ర ఉంది. అఫిడవిట్‌లోనే డిస్టిలరీలు ఉన్నాయని జయచంద్రారెడ్డి చెప్పినప్పుడు మీ కళ్లు మూసుకుపోయాయా?’ అని ప్రశ్నించారు.
మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘ కూటమి నేతల అసత్యాలను ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. బీసీ నేత పైన కావాలని కక్ష సాధిస్తున్నారు. కల్తీ మద్యానికి జోగి రమేష్‌కు ఏం సంబంధం?, జనార్ధన్ రావుతో వీడియో చేయించి జోగిరమేష్ పైన తోసేశారు. జోగి రమేష్ పై కక్షసాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కచ్చితంగా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది’ అని విమర్శించారు.