ఉత్సాహంగా కరాటే పోటీలు
మచిలీపట్నంఅర్బన్: స్థానిక పోలీస్ కల్యాణ మండపంలో ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కరాటే క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర హాకీ అసోసియేషన్ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి, జిల్లా సీనియర్ హాకీ అసోసియేషన్ నాయకులు ఆర్. నాగభూషణం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు దేహ దారుఢ్యంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందజేసి అభినందించారు. హాకీ కృష్ణా అసోసియేషన్ అధ్యక్షుడు నాగ సాయి శ్రీనివాస్, కార్యదర్శి హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


