ఆంగ్లం... అనుసంధాన భాష
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఆంగ్లం అనుసంధాన భాష అని.. అందులో పట్టు సాధించటం ద్వారా మరింత మెరుగైన బోధన చేయటానికి అవకాశం ఉంటుందని విల్ టూ కెన్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ రామేశ్వర్‌గౌడ్ అన్నారు. జిల్లా ఎస్‌సీఈ ఆర్‌టీ సహకారంతో విల్ టూ కెన్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్లంలో 40 రోజుల ఉచిత ఆన్‌లైన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఒక రోజు ఒరియెంటేషన్ కార్యక్రమాన్ని స్థానిక బిషప్ అజరయ్య హైస్కూల్ ఆవరణలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 250 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరయ్యారు.
తెలుగులా ఇంగ్లిష్ మాట్లాడాలి..
ఈ సందర్భంగా నిర్వాహకులు, ట్రైనర్ రామేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లిష్ మాట్లాడేలా చేయటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 33 జిల్లాల్లో 53వేల మంది ఉపాధ్యాయులకు ఈ తరగతులు పూర్తి చేశామన్నారు. ఏపీలో ఇప్పటివరకు 16 జిల్లాలో 25 వేల మంది ఉపాధ్యాయులకు ఉచితంగా శిక్షణ ఇచ్చామన్నారు. ప్రభుత్వ సహకారంతో మిగతా జిల్లాల ప్రభుత్వ ఉపాధ్యాయులకు సైతం ఈ శిక్షణ అందిస్తామన్నారు. అవకాశమిచ్చిన డీఈవో చంద్రకళకు కృతజ్ఞతలు తెలిపారు. సమగ్ర శిక్షా అకడమిక్ మోనటిరింగ్ ఆఫీసర్ ఎస్. అశోక్‌బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏఏఎంఓ శిరీషరాణి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుల
ప్రత్యేక శిక్షణలో రామేశ్వర్ గౌడ్


