సాక్షి,అమరావతి: టీడీపీలో కొలికపూడి వర్సెస్ చిన్ని రచ్చ కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి,చిన్ని హాజరయ్యారు. నివేదికను క్రమశిక్షణ కమిటీకి కొలికపూడి అందించారు. పార్టీ పదవుల అమ్మకాలపై కొలికపూడి ఫిర్యాదు చేశారు.
తిరువూరు సీటు కోసం చిన్నికి ఇచ్చిన రూ.5 కోట్ల వివరాలను అందించారు. చిన్ని పీఏ అక్రమాలపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మంత్రి నారా లోకేష్‌ను కలిసేందుకు కొలికపూడి ప్రయత్నించారు. అందుకు లోకేష్ టైం ఇవ్వకపోవడంతో కొలికపూడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

గత నెల అక్టోబర్‌లో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఆ పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా గురువారం పోస్టు పెట్టారు. 2024 ఎన్నికల్లో చిన్ని తనను రూ.5 కోట్లు అడిగారని, తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఈ సొమ్మును ఆయనకు ఇచ్చానని ప్రకటించారు.
2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, మరుసటి రోజు మరో రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు తదుపరి చిన్ని పీఏ మోహన్‌కు రూ.50 లక్షలు, గొల్లపూడిలో తన మిత్రుల ద్వారా రూ.3.50 కోట్లు ఇచ్చానని వివరించారు. ‘ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం.. నిజం గెలవాలి. నిజమే గెలవాలి’ అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు నియోజకవర్గంలో తీవ్ర సంచలనం రేపింది. ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాల నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది.
టీడీపీలో కోవర్టులున్నారు: టీడీపీలో కోవర్టులు ఉన్నారని..ఆ కోవర్టులు ఎవరో, ఎక్కడున్నారో అందరికీ తెలుసని ఎంపీ చిన్ని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల జన్మదినాల స్టేటస్‌లు పెట్టుకుంటూ.. పార్టీకి విధేయుడినంటే కార్యకర్తలు ఒప్పుకుంటారా అంటూ ఎంపీ రెచ్చి పోయారు. నాయకుల కోసం పార్టీ శ్రేణులు దెబ్బలు తినాలి గానీ నేతలు మాత్రం ఇతర పార్టీలతో అంటకాగితే ఎవరైనా ఊరుకుంటారా అంటూ ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టారు.
‘తిరువూరు నియోజకవర్గంలో విలేకరులకే వార్నింగ్‌లు ఇచ్చారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస విషయాలు తెలియకుండా అన్ని వివాదాలకూ కారణమవుతున్నారు’ అంటూ కొలికపూడిపై ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లిందని ఎంపీ వ్యాఖ్యానించారు.
ఇలా ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ కామెంట్స్‌తో టీడీపీలో పాలిటిక్స్ రచ్చ పీక్ స్టేజీకి చేరింది. ఈ క్రమంలో కొలికపూడి,కేశినేని చిన్న ఇద్దరూ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో కొలికపూడి నారాలోకేష్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో తదుపురి భవిష్యత్ కార్యచరణపై కొలికపూడి దృష్టిసారించినట్లు తిరువూరు పొలిటికల్ సర్కిళ్ల చర్చ కొనసాగుతోంది.


