
కొల్లేరుకు ప్రధాన డ్రెయిన్‌గా ఉప్పుటేరు
ఆక్రమణలు, పూడికతో నీటి ప్రవాహానికి ఆటంకం
ఈ ఏడాది క్లోజర్ ప్రతిపాదనల్లో ఉప్పుటేరుకు దక్కని చోటు
ఏటా వేధిస్తున్న ముంపు బెడద
దివంగత వైఎస్ హయాంలో డ్రెడ్జింగ్ పనులకు శ్రీకారం
మూడుచోట్ల రెగ్యులేటర్ల నిర్మాణానికి జగన్ సర్కారు రూ.412 కోట్ల కేటాయింపులు
ఉప్పుటేరు ..కొల్లేరుకు ప్రధాన డ్రెయిన్. కానీ దీని నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పర్యవసానం.. ఆక్రమణలు, పూడిక పేరుకుపోవడం. నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఈ ఏడాదైనా ఉప్పుటేరు ప్రక్షాళన జరుగుతుందనుకుంటే క్లోజర్ పనుల్లో దాని ఊసే విస్మరించారు. జిల్లాలోని డ్రెయిన్లలో పూడిక తీత, గుర్రపు డెక్క తొలగింపునకు రూ.14 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, వాటిలో ఉప్పుటేరు ప్రస్తావనే లేదు. దీంతో ఉప్పుటేరుకు ఊపిరిపోసే ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుందో అని కర్షకులు కలత చెందుతున్నారు. – సాక్షి, భీమవరం
వ్యర్థాల మేటకు చిరునామా.. ఉప్పుటేరు
ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల మధ్య ఉప్పుటేరు మేజర్ డ్రెయిన్. కొల్లేరు నుంచి మొదలై పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, కాళ్ల, భీమవరం మండలాల మీదుగా 62 కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని గొల్లపాలెం వద్ద సముద్రంలో కలుస్తుంది.
కొల్లేరుతో పాటు రెండు జిల్లాల పరిధిలోని మొగదిండి, న్యూ యనమదుర్రు, బొండాడ, పొలిమేర తిప్ప, పాత యనమదుర్రు మొదలైన ప్రాంతాల్లో 120 వరకు మేజర్, మైనర్ డ్రెయిన్లు, పంట కాలువలు ఉప్పుటేరులో కలుస్తాయి. వీటి ద్వారా గుర్రపు డెక్క, తూడు, వ్యర్థాలు ఉప్పుటేరులోకి చేరి పూడికతో నిండిపోతోంది. ఆకివీడు, లోసరి, దొంగపిండి, పాతపాడు, మాలవానితిప్ప, మోరి గ్రామాల్లో డ్రెయిన్ పూడుకుపోయి మేటలు వేసింది.
వైఎస్సార్ హయాంలో శ్రీకారం
ఉప్పుటేరును అభివృద్ధి చేయాలన్న రైతుల విజ్ఞప్తికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ చూపారు. పూడిక తొలగింపునకు ఆకివీడు వద్ద డ్రెడ్జింగ్ పనులు చేపట్టారు. జువ్వ కనుమ నుంచి ఆర్‌అండ్‌బీ వంతెన సమీపం వరకు కొంతమేర పనులు పూర్తి చేశారు. అనంతరం పనులు వాయిదా పడ్డాయి.
జగన్ హయాంలో రూ.412 కోట్ల కేటాయింపులు
స్వచ్ఛ కొల్లేరు దిశగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. అందులో భాగంగా ఆకివీడు మండలం దుంపగడప, మొగల్తూరు మండలం పడతడిక, మోళ్లపర్రు వద్ద మూడు రెగ్యులేటర్ల నిర్మాణానికి నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.412 కోట్ల కేటాయించారు. నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలిచారు. అయితే ప్రభుత్వం మారాక ఆ పనులు నెమ్మదించాయి.
బాబు హామీ ఇచ్చారు.. అమలులో విస్మరించారు
గతేడాది కొల్లేరు ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.దీంతో ఈ ఏడాది క్లోజర్ పనుల్లో ఉప్పుటేరు ప్రక్షాళన మొదలవుతుందని ఆశించారు. మేజర్, మైనర్, మీడియం డ్రెయిన్లలో గుర్రపుడెక్క, పూడిక తొలగింపునకు రూ.14 కోట్ల విలువైన 275 పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. కాగా ఉప్పుటేరు ముంపు సమస్యను పరిష్కరించే విషయాన్ని విస్మరించారు.
క్లోజర్ పనుల్లో ఉప్పుటేరు లేదు
క్లోజర్ పనులకు పంపిన ప్రతిపాదనల్లో ఉప్పుటేరు లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉప్పుటేరును అభివృద్ధి చేసేందుకు డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు డీపీఆర్‌ను సిద్ధం చేసి పంపాల్సి ఉంది. – సత్యనారాయణ, డ్రెయిన్ల శాఖ ఈఈ, భీమవరం
ఆక్వా మాఫియా ఆక్రమణలు
డ్రెయిన్ గట్టును ఆక్వా మాఫియా ఆక్రమించి చెరువులుగా మార్చేయడంతో కుంచించుకు పోయింది. 80 వేలకు పైగా ఎకరాల్లో ఆక్వా చెరువులు సాగవుతుండగా, వీటిలో మూడు వేల ఎకరాలు ఆక్రమణలుంటాయని అంచనా.
ఉప్పుటేరు వాస్తవ లోతు - ఆరు మీటర్లు. కానీ ఇప్పుడున్న లోతు ఒకటి నుంచిృరెండుమీటర్లు.
వాస్తవ సామర్థ్యం: 25 వేల క్యూసెక్కులు
ప్రస్తుత సామర్థ్యం: 12 వేల క్యూసెక్కులు