
అమరావతి రాజధాని రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందమైపోయింది. కూటమి అధికారంలోకి వస్తే భూముల విలువలు ఆకాశాన్నంటి లాభపడవచ్చు అనుకున్న వారి ఆశలు కళ్లముందే కరిగిపోతున్నాయి. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా ఇప్పుడు కొత్తగా భూ సమీకరణ, బలవంతపు సేకరణ ప్రతిపాదనలు వస్తూండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. రైతుల నుంచి సేకరించింది, ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి కలిపి 53 వేల ఎకరాల వరకూ ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మరిన్ని భూములు కావాల్సిందేనని భీష్మించారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
తొలి దశలో స్వచ్చందంగా భూములివ్వని వారిపై 2013 భూసేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఇలా సుమారు 3500 ఎకరాలు తీసుకోబోతున్నారట. తద్వారా తొలిదశ అసలు లక్ష్యమైన 38 వేల ఎకరాలు సేకరించినట్లు అవుతుందని ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది. రెండో దశ భూ సమీకరణపై చర్చ జరగలేదని చెబుతూ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం, రోప్ వే, రివర్ ఫ్రంట్, స్పోర్ట్స్ సిటీ వంటి వాటికి ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనర్థం... రెండో దశకు సుమారు 44 వేల ఎకరాలు తీసుకోబోతున్నామని తెలివిగా చెప్పడమే. ఇది రైతులకు అర్థం కాదన్నది వారి ఉద్దేశం. మొత్తమ్మీద ఈ వ్యవహారమంతా అమరావతి రైతులను సంక్షోభంలోకి నెట్టేదే.
రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిస్తున్నారని, బలవంతపు సేకరణ అస్సలు ఉండదని చంద్రబాబు ప్రభుత్వం గతంలో నమ్మబలికింది. కొంతమంది స్వచ్ఛందంగా ఇస్తే చాలామందికి ఇష్టం లేకపోయినా ప్రభుత్వ ఒత్తిడితో వదలుకోవడానికి సిద్దపడ్డారు. ఇంకొందరు ప్రభుత్వాన్ని ఎదిరించారు. బెదిరింపులకు లొంగకుండా సేద్యం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని బెదిరించేందుకు పంటలను దగ్దం చేశారన్న ఆరోపణలూ అప్పట్లో వచ్చాయి. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా.. చంద్రబాబు, మరికొందరు నేతలు అమరావతి రైతులను తీవ్రంగా రెచ్చగొట్టారు. వాస్తవానికి జగన్ వాస్తవిక దృక్పథంతో ఆలోచించి అమరావతితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెయాలని సంకల్పించారు.
కానీ ఈ విషయంపై అప్పటి ప్రతిపక్షం రకరకాలుగా దుష్ప్రచారం చేయించింది. ఉద్యమం పేరుతో హడావుడి చేయించారు. ఆ తరువాత 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన తరువాత తమకు లాభం చేకూరుతుందని, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, మంచినీరు తదితర సదుపాయాలతో ప్లాట్లు వచ్చేస్తాయని అమరావతి రైతులు భావించారు. కానీ.. జరిగింది వేరు. చేతిలో ఉన్న భూమిని అభివృద్ధి చేయకపోగా అదనపు భూముల కోసం ఎత్తులేస్తున్నారు. పైగా తొలిదశలో భూములిచ్చిన కొందరు రైతులకు.. పూలింగ్‌కు ఇవ్వని వారి భూమిలో ప్లాట్లు కేటాయించారట. ఆ భూములను ఇప్పుడు బలవంతంగా సేకరించి ప్లాట్లు ఇస్తారట. ఇది ఏ ధర్మం? ఇంకో సంగతి చెప్పాలి. ఇక్కడ ఎకరా రూ.నాలుగు కోట్ల వరకు అమ్ముడుపోతోందని, చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పలు మార్లు చెప్పారు. ఆ ప్రకారం వీరికి 2013 చట్టం కింద మూడు రెట్లు ఎక్కువ ధర ఇస్తారా? అలా కాకుండా రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే పరిహారంగా ఇచ్చే యత్నం చేస్తే రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మరో వైపు అప్పట్లో పూలింగ్‌కు భూములు ఇవ్వని 3500 ఎకరాల రైతులకు ఎంత పరిహారం దక్కుతుందో తెలియదు.
ప్లాట్ల కేటాయింపు కేవలం పేపర్లపైనే ఉండడం వల్ల భూములు అమ్ముడుపోవడం లేదని రైతులు చెబుతున్నారు.ఇక రెండో దశ భూ పూలింగ్‌కు భూములివ్వడం చాలామందికి ఇష్టం లేదు. పెదపరిమి వంటి గ్రామాలలో కొందరు టముకు వేసి మరీ పూలింగ్‌కు భూములు ఇవ్వవద్దని చెబుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగానూ తొలిదశ రైతులకు న్యాయం చేయకుండా తమ వద్దకు ఎలా వస్తారని చాలామంది ప్రశ్నించారు. అయినప్పటికీ ప్రభుత్వం వెనుకాడడం లేదు. కాకపోతే ఒకసారి భూమి తీసుకోవడం లేదని చెబుతారు. ఇంకోసారి ఆ భూములు ఇవ్వకపోతే, ఈ ప్రాంతం ఒక మున్సిపాల్టీగా మిగిలిపోతుందని బెదిరిస్తున్నారు. రైతుల నిరసనలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కొత్త వ్యూహం అమలు చేస్తోంది. రెండో దశ భూ సమీకరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించలేదని ఎల్లోమీడియాలో ప్రచారం చేయించారు. కాని అదే సమావేశంలో ఒక ప్రత్యేక కంపెనీని ఏర్పాటుకు తీర్మానించారు.
ఆ కంపెనీ విమానాశ్రయం, ఎన్టీఆర్ విగ్రహం, స్పోర్ట్స్ సిటీ వంటివి చేపడుతుందని చెబుతున్నారు. పైగా వీటి నిర్మాణ పనులు నేరుగా కాంట్రాక్టర్లకే భూములు కేటాయించి అప్పగిస్తారట. ఆ కాంట్రాక్టర్లు భూములు తనఖా పెట్టి అప్పులు తీసుకుని వాటిని కడితే యూజర్ ఫీజుల రూపంలో ప్రజలు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నష్టమొస్తే వయబిలిటి గ్యాప్ ఫండింగ్ పేరుతో ప్రభుత్వం మళ్లీ ప్రజాధనాన్ని ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తుంది. ఈ ప్రత్యేక కంపెనీకి భూములు గతంలో ప్రతిపాదించిన ప్రకారం రెండో దశ గ్రామాల నుంచే రావాలి. ఆ రకంగా 44 వేల ఎకరాల భూమి తీసుకుంటారని నేరుగా కాకుండా ప్రాజెక్టుల మిష పెడుతున్నారన్నమాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వాస్తవ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు చేసి, రైతులకు న్యాయం చేయకపోతే అమరావతిలోనే తీవ్ర నిరసన ఎదుర్కోక తప్పదు. కొందరు రైతులు ప్రభుత్వం తమను ఏ రకంగా వేధిస్తుందో ఇప్పటికే ఏడీబీ, ప్రపంచ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం గమనార్హం.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత