‘ఫిఫా’ ప్రపంచకప్‌కు బ్రెజిల్‌ క్వాలిఫై | Brazil qualifies for the FIFA World Cup | Sakshi
Sakshi News home page

‘ఫిఫా’ ప్రపంచకప్‌కు బ్రెజిల్‌ క్వాలిఫై

Jun 12 2025 1:47 AM | Updated on Jun 13 2025 9:47 AM

Brazil qualifies for the FIFA World Cup

సావో పాలో: వచ్చే ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్‌నకు బ్రెజిల్, ఈక్వెడార్, ఆ్రస్టేలియా జట్లు అర్హత సాధించాయి. దక్షిణ అమెరికా అర్హత టోర్నీలో భాగంగా బ్రెజిల్‌ జట్టు మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో 1–0 గోల్‌ తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. తద్వారా ‘ఫిఫా’ వరల్డ్‌కప్‌ బెర్తు దక్కించుకుంది. ఇప్పటి వరకు ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002లో) చాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌ 2022 ప్రపంచకప్‌లో క్వార్టర్‌ఫైనల్లో ఓడింది. 

మరోవైపు పెరూతో జరిగిన మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోవడం ద్వారా ఈక్వెడార్‌ ముందంజ వేసింది. ఇప్పటికే వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించిన డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా, కొలంబియాతో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. 2026లో మూడు దేశాలు ఆతిథ్యమిస్తున్న ఫిఫా ప్రపంచకప్‌లో 48 జట్లు పాల్గొననున్నాయి. దక్షిణ అమెరికా అర్హత టోర్నీలో అర్జెంటీనా 35 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా... ఈక్వెడార్, బ్రెజిల్‌ చెరో 25 పాయింట్లతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. 

దక్షిణ అమెరికా నుంచి వరల్డ్‌కప్‌నకు ఆరు జట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. బొలీవియాతో మ్యాచ్‌లో 0–2తో పరాజయం పాలైన చిలీ జట్టు... వరుసగా మూడోసారి విశ్వ సమరానికి దూరమైంది. మరోవైపు ఆ్రస్టేలియా వరుసగా ఆరో సారి ఫిఫా ప్రపంచకప్‌ బెర్తు దక్కించుకుంది. 2–1 గోల్స్‌ తేడాతో సౌదీ అరేబియాపై గెలవడం ద్వారా ఆసీస్‌ ముందంజ వేసింది.    

Advertisement
 
Advertisement
Advertisement