పెరూలోని ఆండీస్ పర్వత ప్రాంతం శక్తివంతమైన భూకంపంతో ఒక్కసారిగా వణికిపోయింది. ప్రకంపనల ధాటికి దక్షిణ భాగంలోని ఇకా, అరెక్విపా ప్రాంతాలు వణికిపోయాయి. జనాలు ఇళ్లలోంచి పరుగులు తీసి.. బయటే గడిపారు. సునామీ ముప్పు లేదని అధికారులు ప్రటించారు. ప్రాణ, ఆస్తి నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది.
దక్షిణ పెరూలో గురువారం మధ్యాహ్నం రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భూమి కంపించింది. భూకంప కేంద్రం అయాకుచో ప్రాంతంలోని పరినకోచాస్ ప్రావిన్స్‌లోని ఉపాహుచో పట్టణానికి వాయువ్యంగా సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది. భూకంపం 66.7 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
ఒక్కసారిగా బలమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పెరూ పౌర రక్షణ విభాగం అధికారి లూయిస్ వాస్కెజ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని తెలిపారు. పరినకోచాస్ ప్రావిన్స్ మేయర్ యోనీ రేయెస్ కూడా ప్రావిన్స్ రాజధానిలో ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని వెల్లడించారు.
సునామీ ముప్పు లేదన్న నేవీ
భూకంపం తర్వాత పెరూ అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో నష్టం ఏమైనా జరిగిందా? అనే దానిపై అంచనా వేస్తున్నారు. మరోవైపు భూకంపం కారణంగా సునామీ ముప్పు లేదని పెరూ నేవీ స్పష్టం చేసింది.
‘రింగ్ ఆఫ్ ఫైర్’లో పెరూ
పెరూ తరచూ భూకంపాలకు గురవుతుంది. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న అత్యంత చురుకైన భూకంప మండలమైన ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఆ దేశం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. భూకంప కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా తరచూ ప్రకంపనలు సంభవిస్తుంటాయి.
పెరూలో గతంలోనూ భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఇదే ఆండీస్ రీజియన్‌లో జులైలో సంభవించిన భూకంపంలో ఐదుగురు మరణించగా.. 21 మందికి గాయాలు అయ్యాయి. అంతకు ముందు 2007 ఆగస్టులో మధ్య పెరూ తీరానికి సమీపంలో 8.0 తీవ్రతతో సంభవించిన భూకంపం.. పిస్కో, చించా ఆల్టా, ఇకా ప్రాంతాల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది. ఆ ఘటనలో 519 మంది ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.
తాజాగా సంభవించిన భూకంపం తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఇది లోతైన ప్రాంతంలో సంభవించడంతో ఇప్పటివరకు పెద్దగా నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయినప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పరిశీలిస్తున్నారు.


