నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. వాయువ్య నైజీరియాలోని సోకోటో రాష్ట్రంలో గురువారం పడవ నదిలో మునిగింది. ఈ ప్రమాదంలో 50 మంది మృతిచెందగా అందులో 40 మంది చిన్నారులు కావడం అత్యంత బాధాకర విషయం. గోరోన్యో జిల్లాలోని గోరౌ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద వివరాలు తెలుసుకున్న అధికారులు వెనువెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
స్థానికుల వివరాల ప్రకారం.. పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించారు. ప్రయాణం ప్రారంభించిన కేవలం ఒక్క నిమిషానికే పడవ మునిగిపోయింది. నదికి అవతలి వైపున ఉన్న పొలాలకు వెళ్లేందుకు ప్రయాణికులు పడవ ఎక్కారని, వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని ఆయన తెలిపారు.
నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (NEMA) ప్రతినిధి దాహిర్ కురే మాట్లాడుతూ.. అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక, గాలింపు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే మృతుల సంఖ్యపై వెంటనే అధికారికంగా స్పష్టత ఇవ్వలేమని, ఘటనకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని ఇంకా సేకరిస్తున్నామని చెప్పారు.
నైజీరియాలోని రద్దీగా ఉండే నదులు, జలమార్గాల్లో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించడం, పడవల నిర్వహణ సరిగా లేకపోవడం, భద్రతా నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి.
కాగా నైజీరియాలో ఇటీవల తరచుగా పడవ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల జిగావా రాష్ట్రంలో కూడా పడవ బోల్తా పడి కనీసం ఐదుగురు మృతి చెందారు. ఈ ఏడాది జనవరిలో జిగావా నుంచి యోబే రాష్ట్రానికి రైతులు, మత్స్యకారులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో కనీసం 26 మంది మృతి చెందారు.
సోకోటోలో జరిగిన తాజా ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య, గల్లంతైన వారి వివరాలపై అధికారులు మరింత సమాచారం సేకరిస్తున్నారు.


