నైజీరియాలో కల్తీ మద్యంగా అనుమానిస్తున్న ఓ ద్రవాన్ని తాగి 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది వరకు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. ఈ ఘటన దక్షిణ నైజీరియాలోని ఒండో రాష్ట్రంలో చోటుచేసుకుంది. మొత్తం 182 మంది ఈ ఘటనతో ప్రభావితమైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బాంజీ అజాకా తెలిపారు. కేసులు ఒడిగ్బో, ఇరెలె స్థానిక ప్రభుత్వ ప్రాంతాల్లో నమోదయ్యాయి.
ఈ ద్రవంలో ప్రాణాంతకమైన మెథనాల్ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బాధితుల్లో కొందరు చికిత్స అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అజాకా చెప్పారు. “ఇది చాలా వేగంగా జరిగింది. వారు సేవించిన పరిమాణాన్ని బట్టి ప్రభావం ఉంటుంది. మూత్రపిండాలు పనిచేయకుండా పోవచ్చు, కంటి చూపు దెబ్బతినొచ్చు, మెదడు దెబ్బతినొచ్చు” అని ఆయన అసోసియేటెడ్ ప్రెస్‌తో అన్నారు.
15 మంది అరెస్టు
ఈ ఘటనకు సంబంధించి 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు మెథనాల్ ఉన్నట్లు అనుమానిస్తున్న పానీయాన్ని తయారు చేసినట్లు ఒండో రాష్ట్ర పోలీసు ప్రతినిధి అబయోమి జిమోహ్ తెలిపారు. ప్రస్తుతం అతడు పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తున్నట్లు చెప్పారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటనలో తొలి మరణం దాదాపు రెండు వారాల క్రితం నమోదైంది.
నైజీరియాలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా తయారయ్యే మద్యం తక్కువ ధరకు లభించడంతో విస్తృతంగా వినియోగిస్తుంటారు. ఇదే సమయంలో పిల్లలు, యువతకు సులభంగా అందుబాటులో ఉంటాయన్న కారణంతో చిన్న ప్లాస్టిక్ కంటైనర్లు, సాచెట్లలో విక్రయించే మద్యంపై దేశవ్యాప్తంగా నిషేధాన్ని నైజీరియా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ అమలు చేస్తోంది.
మెథనాల్ కలిసిన పానీయం సేవించినట్లు అనుమానిస్తున్న బాధితుల సంఖ్య, మరణాల సంఖ్యపై అధికారులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు కారణమైన పానీయం తయారీ, సరఫరా వెనుక ఉన్న వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


