జాంబియాలోని కఫ్యూ జాతీయ ఉద్యానవనం నుంచి 2025 జూలైలో విడిపోయిన మూడు ఆఫ్రికన్ అడవి సోదర కుక్కలు కేవలం ఎనిమిది నెలల్లో 4,126 కిలోమీటర్లు ప్రయాణించాయి. ఆఫ్రికా ఖండంలోని ఓ క్షీరదం నమోదు చేసిన అత్యంత సుదీర్ఘ విస్తరణ ప్రయాణంగా పరిశోధకులు దీనిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కుక్కలకు అమర్చిన జీపీఎస్ కాలర్ల ద్వారా వాటి కదలికలను పరిశీలించారు.
ఈ మూడు మగ కుక్కలు మయుకుయుకుయు గ్రూపునకు చెందినవి. యుక్తవయస్సుకు చేరుకున్న 19 పిల్లల్లో ఇవి ఉన్నాయి. దాదాపు 3 ఏళ్ల వయసులో అవి తమ గుంపును విడిచి కొత్త ప్రాంతంలో ఇతర సంబంధం లేని కుక్కలతో కొత్త సంతానోత్పత్తి గుంపును ఏర్పాటు చేసుకునే సహజ ప్రక్రియలో భాగంగా ప్రయాణం ప్రారంభించాయి. ఇదే గుంపుకు చెందిన నాలుగు ఆడ కుక్కలు వీటి కంటే సుమారు రెండు వారాల ముందే విడిపోయాయి.
దిశ మార్చుకుని మరీ..
మూడు సోదర కుక్కలు తూర్పు దిశగా ప్రయాణిస్తూ కాబ్వే, కిట్వే, న్డోలా ప్రాంతాల వైపు వెళ్లాయి. పట్టణ ప్రాంతాలు ఎదురైనప్పుడు వాటిని దాటకుండా దిశ మార్చుకున్నాయి. ఓ సందర్భంలో న్డోలా వైపు వెళ్లి తిరిగి దాదాపు 200 కిలోమీటర్ల మేర అదే మార్గంలో వెనక్కి వచ్చాయి.
పెద్ద జలాశయాలు ఎదురైనప్పుడు వాటిని దాటకుండా చుట్టూ తిరిగి ముందుకు సాగాయి. అనంతరం లువాంగ్వా లోయ ప్రాంతానికి చేరుకున్నాయి. 2025 నవంబర్ నాటికి అవి తమ మొదటి నివాస ప్రాంతం నుంచి 2,300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి. చివరకు లువానో గేమ్ మేనేజ్‌మెంట్ ఏరియాలో కొత్త పరిధిని ఏర్పాటు చేసుకున్నాయి. 2026 ఏప్రిల్ 1 నాటికి జీపీఎస్ నమోదు ప్రకారం మొత్తం 4,126 కిలోమీటర్లు ప్రయాణించాయి. ఇది ప్రారంభ, ముగింపు ప్రాంతాల మధ్య నేరుగా ఉన్న దూరం కాదు.. అవి అనుసరించిన మొత్తం మార్గం. నేరుగా కొలిచిన గరిష్ఠ దూరం 419 కిలోమీటర్లు.
ఈ పరిశోధన ఎకాలజీ పత్రికలో ప్రచురితమైంది. రహదారులు, మానవ నివాసాలు, జలాశయాలు, రక్షిత ప్రాంతాల వెలుపలి ప్రాంతాల గుండా కూడా అడవి కుక్కలు ప్రయాణించగలవని అధ్యయనం చూపించింది. రహదారి ప్రమాదాలు, పశువులతో ఘర్షణలు, వేట కోసం ఏర్పాటు చేసే వైర్ ఉచ్చులు వాటికి ముప్పుగా ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. అందువల్ల జాతీయ ఉద్యానవనాల మధ్య ఉన్న వన్యప్రాణి మార్గాలను కాపాడటం వాటి దీర్ఘకాలిక సంరక్షణకు కీలకంగా మారుతోంది.


