ఫ్లైదుబాయ్ ఘటనలో పూటకో విస్తుపోయే విషయం బయటపడుతోంది. ఇప్పటికే దీనిని ఉగ్రదాడి కేసుగా దర్యాప్తు జరుపుతున్నారు. విమానంలో భారత కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేసిన ఒమన్ కో–పైలట్ హమామ్ అల్–హమామీ అసలు ఉద్దేశం ఏంటన్న దానిపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కెప్టెన్‌ను హతమార్చి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడం అతని ప్రధాన ఉద్దేశంగా తేలింది. విచారణలోనూ తన లక్ష్యం విమానాన్ని కూల్చేయడమేనని హమామీ అంగీకరించినట్లు సమాచారం.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. విమానం సుమారు 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. హమామీ క్రాష్ యాక్స్‌తో కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేసి కాక్‌పిట్‌ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. కెప్టెన్‌ను చంపేసిన తర్వాత విమానాన్ని సాధారణంగానే నడుపుతూ.. ల్యాండింగ్ క్లియరెన్స్ తీసుకుని.. టెల్ అవీవ్(ఇజ్రాయెల్ రాజధాని)లోని ఓ భవనాన్ని ఢీ కొట్టాలని అనుకున్నాడు. ఒకవేళ అది కుదరకుంటే..బెన్ గురియన్ విమానాశ్రయంలో మరో విమానాన్ని ఢీకొట్టడం అతడి ప్లాన్‌గా దర్యాప్తులో తేలింది. అంటే.. ఈ ప్రణాళిక 9/11 తరహా దాడి తరహాలోనే ఉందని అధికారులు అంటున్నారు.
జోర్డాన్ గగనతలంలోనే..
విమానాన్ని స్వాధీనం చేసుకునేందుకు జోర్డాన్ గగనతలంలోకి ప్రవేశించే వరకు వేచి ఉండాలని హమామీ భావించినట్లు సమాచారం. అక్కడ దాడి చేస్తే.. తన ప్రయత్నాన్ని గుర్తించి అడ్డుకునేందుకు ఇతరులకు తక్కువ సమయం ఉంటుందని అతడు అనుకున్నాడట. జూలైలోనే ఇలాంటి దాడికి ప్రయత్నించాలని భావించినా.. అప్పట్లో ఓ సిబ్బంది తనకు స్నేహితుడు కావడంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
జస్ట్ రెండే నిమిషాల్లో..
తన ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో హమామీ మరో ప్లాన్‌కు దిగాడు. కాక్‌పిట్‌లో జరిగిన పెనుగులాట తర్వాత.. ఆటోపైలట్, ఇంజిన్ స్విచ్చ్‌లు ఆప్ చేశాడు. దీంతో బోయింగ్ 737 మ్యాక్స్–8 విమానం కేవలం రెండు నిమిషాల్లో సుమారు 36 వేల అడుగుల నుంచి 17 వేల అడుగులకు పడిపోయింది. ఈ సమయంలో విమానంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో రడ్డర్‌లోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. అప్పటికే హమామీ చేతిలో తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చార్ కాక్‌పిట్ తలుపు తెరవగలిగాడు. దీంతో సిబ్బంది, ప్రయాణికులు లోపలికి వెళ్లి హమామీని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న మరో ఇద్దరు ఆఫ్–డ్యూటీ పైలట్లు బాధ్యతలు చేపట్టి సౌదీ అరేబియాలోని తబూక్‌లో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
3 వేలకుపైగా పోస్టులపై ఆరా..
హమామీ సోషల్ మీడియా కార్యకలాపాలపైనా దర్యాప్తు సాగుతోంది. ఒమన్ తండ్రి, సిరియా తల్లికి జన్మించిన అతడు చాలా కాలం దుబాయ్‌లో నివసించినట్లు సమాచారం. సిరియా అంతర్యుద్ధ సమయంలో కొంతకాలం అక్కడ ఉన్నాడని.. ఆ సమయంలో ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడైనట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అతడి డిలీట్ చేసిన ‘ఎక్స్’ ఖాతాకు సంబంధించిన 3,000కుపైగా పోస్టుల స్క్రీన్‌షాట్లు ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో ఉన్నట్లు సమాచారం. వాటిలో అనేక పోస్టులు ఇస్లామిక్ భావజాలానికి సంబంధించినవిగా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.
ఆస్ట్రేలియా లింక్‌పైనా ఆరా..
హమామీకి ఆస్ట్రేలియాతో ఉన్న సంబంధాలపైనా దర్యాప్తు మొదలైంది. ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్‌కు చెందిన కౌంటర్ టెర్రరిజం బృందం అతడి పరిచయాలు, సంబంధాలను పరిశీలిస్తోంది. ఫ్లైదుబాయ్ సిబ్బందిలో అతడు ఎలా చేరాడు? టెల్ అవీవ్‌కు వెళ్లే విమాన సిబ్బందిలో అతడికి అవకాశం ఎలా లభించింది? అనే అంశాలపైనా ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ అధికారులు ఆరా తీస్తున్నారు.
‘టెర్రరిస్ట్ యాక్ట్’గా తేల్చేశారు
ఈ ఘటనను యూఏఈ అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అల్ షమ్సీ ‘టెర్రరిస్ట్ యాక్ట్’గా అభివర్ణించారు. క్రాష్ యాక్స్‌తో కెప్టెన్‌పై దాడి చేసి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు హమామీ ప్రయత్నించాడని తెలిపారు. ఈ ఘటన వెనుక మరింత విస్తృత కుట్ర ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం హమామీని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.
ఒమన్‌లో నిషేధం.. అయినా ఎలా?
హమామీపై అతడి సొంత దేశం ఒమన్‌లోనే విమానాలు నడపడంపై నిషేధం ఉన్నట్లు సమాచారం. తీవ్రవాద భావజాలం కారణంగానే ఈ నిషేధం విధించినట్లు తెలుస్తోంది. అలాంటి వ్యక్తి ఫ్లైదుబాయ్ కో–పైలట్‌గా ఎలా కొనసాగాడు? ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానాన్ని నడిపే అవకాశం ఎలా దక్కింది? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఘటనకు ముందు ప్రయాణికులు, సిబ్బంది వివరాలను యూఏఈ అధికారులు ఇజ్రాయెల్‌తో పంచుకున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో స్క్రీనింగ్, నియామక ప్రక్రియ, భద్రతా సమాచార మార్పిడిపై కూడా దర్యాప్తు జరుగుతోంది.
ఫెయిల్ అయినా మెచ్చుకున్న అల్‌ఖైదా!
హమామీ ప్రయత్నాన్ని ఉగ్రసంస్థ ‘అల్‌ఖైదా’ ప్రశంసించడం ఇప్పుడు మరో సంచలనంగా మారింది. యెమెన్‌లోని ‘అల్–బయాన్’ వారపత్రికలో ‘సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 30 మధ్య’ పేరుతో ప్రచురించిన సంపాదకీయంలో.. అమెరికా, ఇజ్రాయెల్ విమానాలపై ఇలాంటి మరిన్ని దాడులకు పిలుపునిచ్చింది. 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడితోపాటు సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ FZ1073 ఘటనను ప్రస్తావించింది. ‘యుద్ధం ఇంకా ముగియలేదు’ అంటూ వ్యాఖ్యానించింది. హమామీ హైజాక్ విజయవంతమై ఉంటే ప్రాంతీయ శక్తి సమీకరణాలు మారిపోయేవని పేర్కొంది. అంటే.. విమానాన్ని కూల్చేయాలన్న హమామీ ప్రయత్నం విఫలమైనా.. దాన్ని అల్‌ఖైదా మాత్రం మెచ్చుకుంది. అంతేకాదు.. 9/11 తరహా దాడులతో పోలుస్తూ, అమెరికా–ఇజ్రాయెల్ విమానాలపై మరిన్ని దాడులకు పిలుపునిచ్చింది. ఫ్లైదుబాయ్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే.. హమామీ ప్రయత్నాన్ని అల్‌ఖైదా సమర్థించడం, భవిష్యత్తులో ఇలాంటి దాడులకు ప్రోత్సాహం ఇచ్చేలా పిలుపునివ్వడం భద్రతా వర్గాల్లో మరింత ఆందోళనకు కారణమవుతోంది.
ఇదీ చదవండి: ట్రంప్ స్థాపించిన ఈ కొత్త ఫోర్స్.. చీఫ్ ఎవరో తెలుసా?



