‘ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్ (అజ్ఞాతం)లోకి వెళ్లాడు’ అంటూ ఉంటారు. అర్జున్ మాత్రం... అందరికీ కనిపిస్తూనే అండర్‌గ్రౌండ్‌లో ఉంటున్నాడు. అర్థం కాలేదా! ఇప్పుడు టాపిక్‌లోకి వద్దాం...
మధ్యప్రదేశ్‌లోని ఝుబువాకు చెందిన అర్జున్ ఇంటిపై అలిగి బయటికి వచ్చాడు. ఇది విశేషమేమీ కాదు. అసలు సిసలు విశేషం... భూగర్భ గృహాన్ని నిర్మించుకోవడం. తన వెరైటీ ఇంటి విషయాల గురించి ఎప్పటికప్పుడు అర్జున్ షేర్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ఇంతకీ ఆ భూగర్భగృహం ఎలా ఉంటుంది?
భూమి అడుగున నిర్మించిన చిన్నటి ఆవాసంలో మట్టితో చేసిన వేదిక ఉంది. దీనిపై చాప, దుప్పటి పరిచి పడుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసుకున్నాడు. లోపల చేతితో చెక్కిన అరలు, వండుకోవడానికి చిన్న పొయ్యి ఉన్నాయి. పైకప్పుపై ఉండే టార్పాలిన్ వర్షం నుంచి రక్షణగా పనిచేస్తుంది.
అలా అని సమస్యలు లేవని కాదు. ఒక వర్షానికి పై కప్పు పై కప్పిన టార్పాలిన్ చిరిగిపోయింది. వర్షం నీళ్లు ఇంట్లోకి రావడంతో అర్జున్ ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనా ‘డోన్ట్ కేర్’ అంటున్నాడు. ఈ భూగర్భగృహం పుణ్యమా అని సదరు అర్జున్ సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యాడు!


