వందల అస్థిపంజరాల వెనుక అసలు కథేంటి? | Funday Special Story On Roopkund Skeleton Lake Mystery Dna Hailstorm | Sakshi
Sakshi News home page

మంచు కొండల్లో.. మరణమృదంగం!

Aug 16 2026 9:53 AM | Updated on Aug 16 2026 9:53 AM

Funday Special Story On Roopkund Skeleton Lake Mystery Dna Hailstorm

మిస్టిక్‌ వరల్డ్‌

అది 1942 సంవత్సరం... రెండో ప్రపంచ యుద్ధ సమయం...
సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఉన్న అవిభాజ్య ఉత్తరప్రదేశ్‌లోని రూప్‌కుండ్‌ ప్రాంతం. గడ్డకట్టే చలి– చుట్టూ తెల్లటి మంచు పర్వతాలు– ఆ కొండల నడుమ ఒక చిన్న సరస్సు– ప్రకృతి అందం అంతా అక్కడే ఉందా అని పరవశించేంత సోయగం ఆ ప్రాంతం సొంతం. ‘నందాదేవి అభయారణ్యం’ ఫారెస్ట్‌ రేంజర్‌ హరికిషన్‌ మధ్వాల్‌ రోజువారీ విధుల్లో భాగంగా పరిసరాలను పరిశీలిస్తున్నారు. వేసవి కాలం కావడం వల్ల సరస్సులోని మంచు కొద్దికొద్దిగా కరుగుతోంది.

అలా చూస్తూ వెళ్తున్న హరికిషన్‌కు సరస్సులో నుంచి తెల్లగా మెరుస్తున్న వస్తువు ఒకటి బాగా ఆకర్షించింది. దగ్గరకు వెళ్లి పరిశీలనగా చూశారు. అక్కడి దృశ్యం చూడగానే కాళ్లూ చేతులూ వణికిపోయి, అంతటి చలిలోనూ ముచ్చెమటలు పట్టేశాయ్‌. సరస్సు అంచున, నీటి లోపల వందలాది మానవ కంకాళాలు, కపాలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మంచు వాతావరణం వల్ల కొన్ని శవాలకు ఇంకా మాంసం, జుట్టు కూడా అలాగే ఉండిపోయాయి.

సరస్సులో కేవలం అస్థిపంజరాలే కాదు, మంచు తీవ్రత వల్ల వందల ఏళ్లు గడిచినా చెడిపోకుండా భద్రంగా ఉన్న కొన్ని అద్భుతమైన పురాతన వస్తువులను కూడా గుర్తించారు. చనిపోయిన వారు ధరించిన తోలు చెప్పులు, బూట్లు, ఉన్ని దుస్తుల ముక్కలు గడ్డకట్టిన మంచు వల్ల అలాగే ఉండిపోయాయి. మహిళలు ధరించిన గాజులు, వెండి, రాగి నగలు లభించాయి. రక్షణ లేదా వేట కోసం ఉపయోగించిన ఇనుప ఈటెలు, కత్తుల ముక్కలు, బాణాలు కూడా దొరికాయి.

కొండలు ఎక్కడానికి వారు ఉపయోగించిన గట్టి వెదురు కర్రల ముక్కలు కూడా బయటపడ్డాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ వార్త వినగానే ఉలిక్కిపడింది. ఆ సమయంలో భారతదేశంపై దాడి చేయడానికి రహస్యంగా వస్తున్న జపాన్‌ సైనికుల బృందం ఏమైనా ఇక్కడ చనిపోయిందా? అని అనుమానించింది. వెంటనే సైనిక నిపుణులు రంగంలోకి దిగి ఆ ఎముకలను పరీక్షించారు. అవి దాదాపు 600 నుంచి 800 మందివి అయి ఉండొచ్చని అంచనాకు వచ్చారు. కానీ, అవి ఇటీవలివి కావని, శతాబ్దాల క్రితం నాటివని పరీక్షల్లో తేలడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టుల దృష్టి ఈ ‘అస్థిపంజరాల సరస్సు’పై పడింది.

ఈ అస్థిపంజరాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీతోపాటు అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అత్యాధునిక డీఎన్‌ఏ, కార్బన్‌ డేటింగ్‌ పరీక్షలు నిర్వహించారు. అందులో తేలిన విషయాలు పరిశోధకులను నివ్వెరపరచాయి. వారంతా ఒకేసారి చనిపోలేదని, ఎక్కువ శాతం మంది క్రీ.శ. 800 ప్రాంతంలో (1200 ఏళ్ల క్రితం) చనిపోగా.. కొంతమంది క్రీ.శ. 1800 (226 ఏళ్ల క్రితం) ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయారని గుర్తించారు.

మరింత విచిత్రం ఏమిటంటే, అక్కడ దొరికిన పుర్రెలు, ఎముకలపై ఎలాంటి కత్తుల గాయాలు కానీ, బుల్లెట్‌ గుర్తులు కానీ లేవు. అంటే అక్కడ ఎలాంటి యుద్ధం జరగలేదు. మరి అంతమంది ఒకేసారి ఎలా చనిపోయారు? ఎముకల తీరును పరిశీలించిన నిపుణులు ఒక సంచలన విషయాన్ని కనుగొన్నారు. ఆ పుర్రెల పైభాగంలో లోతైన ఫ్రాక్చర్లు ఉన్నాయి. అంటే తలపై గట్టి వస్తువు ఏదో బలంగా తాకడం వల్లే వారు చనిపోయినట్టు నిర్ధారించారు.

ఆ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన నందాదేవి యాత్రకు వెళ్తున్న బృందంలోని వారివే ఆ మృతదేహాలు అయి ఉంటాయని అంచనా వేశారు. అకస్మాత్తుగా వచ్చిన భయంకరమైన తుఫానులో భారీ వడగళ్లు ఆకాశం నుంచి బాంబుల్లా కురిసి ఉండొచ్చని, తల దాచుకోవడానికి చెట్లు కూడా లేని ఆ గుట్టలపై, ఆ వడగళ్ల దెబ్బలకు తాళలేక వారంతా అక్కడికక్కడే ప్రాణాలు విడిచి ఉండొచ్చని భావించారు.

డీఎన్‌ఏ పరీక్షల్లో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. అక్కడ చనిపోయిన వారిలో మన భారతీయులతో పాటు వేల మైళ్ల దూరంలో ఉన్న తూర్పు మధ్యధరా ప్రాంతానికి (గ్రీస్, క్రేట్‌ దీవుల పరిసరాలు) చెందిన ప్రజల డీఎన్‌ఏ కూడా ఉండటంతో శాస్త్రవేత్తలు అవాక్కయ్యారు. అసలు 1800ల కాలంలో అక్కడి ప్రజలు అంత ఎత్తైన హిమాలయ పర్వతాల పైకి ఎందుకు వచ్చారు? ఎలా చనిపోయారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు.

రూప్‌కుండ్‌ చుట్టుపక్కల గ్రామాల్లో శతాబ్దాలుగా ఒక జానపద కథ ప్రచారంలో ఉంది. కన్నౌజ్‌ దేశానికి చెందిన రాజా జస్ధవాల్, తన గర్భిణి భార్య రాణి బాలాంపాతో కలిసి నందాదేవి యాత్రకు వెళ్లారు. అయితే యాత్ర నియమాలను ఉల్లంఘించి.. వారు సంగీత నృత్యాలతో, ఆడంబరాలతో ఆ పవిత్ర పర్వతాలపై ప్రయాణించారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన నందాదేవి... ఇనుప గుండ్ల లాంటి వడగళ్ల వానను కురిపించి రాజును, అతని సైన్యాన్ని సర్వనాశనం చేసిందని స్థానికులు నమ్ముతారు.

రూప్‌కుండ్‌ సరస్సు కేవలం ఒక మిస్టరీ మాత్రమే కాదు, అదొక ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతం కూడా. ట్రెక్కర్లు ఇప్పటికీ అక్కడికి వెళ్లినప్పుడు సరస్సు చుట్టూ ఎముకలు కనిపిస్తుంటాయి. అయితే, చాలామంది పర్యాటకులు ఆ పురాతన అస్థిపంజరాలను నాశనం చేయడం లేదా లగేజీల్లో దొంగిలించుకుపోతుండటం వల్ల ఈ చారిత్రక సంపద క్రమంగా కనుమరుగవుతోంది.

ఎముకలు కొరికే చలిలో, మంచుకొండల మధ్య పడి ఉన్న ఆ అస్థిపంజరాలు... సహజ విపత్తుకు సాక్ష్యాలా లేక ఇంకా ఛేదించని చరిత్రకు ఆనవాళ్లా? సై న్స్‌ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నా.. రూప్‌కుండ్‌ సరస్సు రహస్యం ఇప్పటికీ మానవాళికి అంతుచిక్కని మిస్టరీనే!

- సత్యకిశోర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement