కొందరిలో ఒక్కోసారి తమ కాళ్లలో లేదా చేతుల్లో గడ్డ కనిపించవచ్చు. అది నొప్పి లేని గడ్డ కావడంతో పాటు క్రమంగా పెరుగుతూపోవచ్చు. కారణం లేకుండా ఎముకల్లో నొప్పి కనిపించడంతో రాత్రివేళల్లో ఆ నొప్పి పెరుగుతూ పోవచ్చు. ఆటల్లో గాయపడటమో లేదా తమకు తెలియకుండా ఏదైనా చిన్నపాటి దెబ్బతగలడం వల్లనో ఇలా జరుగుతుండవచ్చని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ లక్షణాలు కొన్నిసార్లు ‘సార్కోమా’ అనే క్యాన్సర్‌కు సూచనలు కావచ్చు. ఈ సార్కోమా తరహా క్యాన్సర్‌పై అవగాహన కోసం ఈ కథనం.
సార్కోమా అనేది అరుదైన క్యాన్సర్లలో ఒకటి. సార్కోమా అంటే ఏమిటో చూద్దాం...
మన దేశంలో సార్కోమా విస్తృతి... భారతదేశంలో ప్రతి ఏడాది సుమారు 20 వేల కొత్త సార్కోమా కేసులు నమోదవుతున్నట్లు అంచనా. అయితే అవగాహన లోపం, లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల చాలామంది వ్యాధి ముదిరిన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారు. తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందిస్తే మంచి ఫలితాలు కనిపించడంతో పాటు బాధితుల్లో మంచి మెరుగుదల కనిపిస్తుందని గుర్తుంచుకోవడం ముఖ్యం.
సార్కోమా అంటే..? సార్కోమా అనేది దేహంలోని ఎముకలు, కండరాలు, కొవ్వు, రక్తనాళాలు, నరాలు, కార్టిలేజ్, టెండన్లు వంటి మృదుకణజాలా (సాఫ్ట్ టిష్యూస్)లో వచ్చే అరుదైన క్యాన్సర్. సాధారంగా కనిపించే మిగతా క్యాన్సర్లతో పోలిస్తే ఇది కాస్త అరుదుగా కనిపించినప్పటికీ, చిన్నపిల్లలు, యువత, మధ్యవయస్కుల్లోనూ ఇటీవల కొంత ఎక్కువగానే కనిపిస్తోంది. ఇది శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ముఖ్యంగా చేతులు, కాళ్లు, తొడలు, భుజాలు, పొత్తికడుపు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
లక్షణాలు... తొలి దశల్లో ‘సార్కోమా’లో పెద్దగా నొప్పి ఉండకపోవడంతో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. సార్కోమాలో కనిపించే సాధారణ లక్షణాలవి... ∙నొప్పి లేకుండా క్రమంగా పెరుగుతున్న గడ్డ ∙చేతులు లేదా కాళ్లలో అసాధారణ వాపు ∙రాత్రివేళల్లో ఎక్కువయ్యే ఎముకల నొప్పి ∙కారణం లేకుండా నెలల తరబడి నొప్పి కొనసాగడం ∙గడ్డ పరిమాణం వేగంగా పెరుగుతుండటం ∙కదలికల్లో ఇబ్బంది లేదా గడ్డ వచ్చిన అవయవం పనితీరు తగ్గడం ∙ఐదు సెంటీమీటర్లకు మించిన గడ్డలు రావడం, కొన్ని వారాలుగా ఆ గడ్డల్లో వాపు తగ్గకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయడం సరికాదు. పైన పేర్కొన్న లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది.
నిర్ధారణ ఇలా... సార్కోమా నిర్ధారణ కోసం చేసే పరీక్షల్లో కొన్ని... ∙ఎంఆర్‌ఐ స్కాన్ ∙పీఈటీ–సీటీ స్కాన్ ∙బయాప్సీ. ఈ పరీక్షలతో కణితి రకం, సైజు, వ్యాప్తితో పాటు అది ఏ దశలో ఉందన్న విషయాలను నిర్ధారణ చేశాక... దాన్ని బట్టి చికిత్సను ΄్లాన్ చేస్తారు.
చికిత్స ... బాధితుల పరిస్థితిని బట్టి శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీనిలలో పేషెంట్‌కు అవసరమైనదాన్ని నిర్ణయిస్తారు. ఒక్కోసారి ఈ చికిత్సలన్నింటినీ సమన్వయంతో అందించాల్సి రావచ్చు. అయితే తొలిదశల్లోనే చికిత్స మొదలుపెట్టడం వల్ల చాలా మంది జీవితం తిరిగి సాధారణంగా అయ్యేందకు అవకాశాలెక్కువ.
ఆధునిక చికిత్సలతో అవయవాన్ని కాపాడే అవకాశం... గతంలో సార్కోమా చికిత్సలో చాలాసార్లు చెయ్యి లేదా కాలిని తొలగించాల్సి వచ్చేది. కానీ ఇటీవల వైద్యరంగంలోని అధునాత సాంకేతిక పురోగతితో లింబ్ సాల్వేజ్ సర్జరీలు, అత్యాధునిక ఇం΄్లాంట్లు, రీకన్ స్ట్రక్షన్ పద్ధతుల ద్వారా గడ్డను పూర్తిగా తొలగించడంతో పాటు అవయవాన్ని కాపాడే అవకాశాలూ గణనీయంగా పెరిగాయి.
చికిత్స తర్వాత కూడా జాగ్రత్తలు అవసరం... శస్త్రచికిత్సతో లేదా ఇతరత్రా అవసరమైన చికిత్సల తర్వాత పరిస్థితి అంతా తిరిగి సాధారణ స్థితి చేరుకుందని అనుకోవడం సరికాదు. నిజానికి పేషెంట్లు తమ చికిత్స తర్వాత కూడా ఫిజియోథెరపీ, పునరావాస చికిత్స (రీ–హ్యాబిలిటేషన్ థెరపీ) వంటివి చేస్తూ ఉండటంతో పాటు క్రమం తప్పకుండా ఫాలోఅప్‌కు రావడమూ తప్పనిసరి. అలాగే కుటుంబ సభ్యుల సహకారమూ పేషెంట్లు పూర్తిగా కోలుకోవడంలో కీలక భూమిక పోషిస్తుందని గుర్తుంచుకోవాలి. 
డాక్టర్ రాజీవ్ రెడ్డి
ఆర్థోపెడిక్ ఆంకోసర్జన్
– సార్కోమా స్పెషలిస్ట్


