కొన్ని ప్రయాణాలకు మ్యాప్ కంటే, మలుపులే ఎక్కువ! నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జీవిత ప్రయాణం కూడా అలాంటిదే. ఎన్నో ట్విస్టులు, మలుపులు దాటుకుంటూ, సీరియస్ విషయాల్నీ సరదాగా తీసుకోవడం నేర్చుకున్న ఆమె– తన నవ్వుల మధ్యే దాగున్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు.
ఎటు తీసుకెళ్తే .. అటు..
చిన్నప్పటి నుంచి రకరకాల సంస్కృతుల మధ్య పెరిగాను. బహ్రెయిన్ లో పుట్టి, శ్రీలంకలో మాస్ కమ్యూనికేషన్స్ చదివి, టీవీ రిపోర్టర్‌గా పనిచేశాను. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటం గెలిచిన, తర్వాత ముంబై వచ్చి సినిమాల్లోకి అడుగుపెట్టాను. ఇలా జీవితం ఎటు తీసుకెళ్తుంటే అటు వెళ్తూ హ్యాపీగా ఉంటున్నా.
అమ్మకి నేనొక ‘బటర్‌ఫ్లై’!
నా కెరీర్‌లో ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా మా అమ్మానాన్నలు మాత్రం ఎప్పుడూ నా పక్కనే ఉన్నారు. అమ్మ నన్ను ప్రేమగా ‘బటర్‌ఫ్లై’ అని పిలుస్తుంది. ఆ మాట వింటే చాలు, నేనింకా చిన్న పాపనే అనిపిస్తుంది.
భయపెట్టాలని ఉంది
నన్ను ఎక్కువగా కమర్షియల్, కామెడీ సినిమాల్లో చూసి ఉంటారు. అయితే, లాస్ ఏంజెలెస్‌లో ఇవానా చబ్బక్ దగ్గర యాక్టింగ్ మాస్టర్ క్లాసెస్ చేసినప్పటి నుంచే నా స్క్రిప్ట్ సెలెక్షనే మారిపోయింది. నటిగా భిన్నమైన జానర్స్ చేయాలని ఉంది. భయపెట్టే పాత్రలు చేయాలని ఉంది.
నా శరీరమే నాకు థ్యాంక్స్ చెప్పింది!
శాకాహారిగా మారిన తర్వాత నా శరీరంలో చాలా మార్పులు గమనించాను. మొటిమలు తగ్గిపోయాయి. బరువు కంట్రోల్‌లో ఉంటోంది. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోయాయి. నాకు మాత్రం మొక్కల ఆధారిత ఆహారం చాలా బాగా పనిచేసింది. అయితే ఇలా అందరికీ సరిపోవాలని లేదు కదా!
ముంబైకి వచ్చాక... మళ్లీ మొదటి నుంచి!
ముంబైకి వచ్చాక హిందీ నేర్చుకోవడం దగ్గర్నుంచి ప్రతి అడుగూ ఒక సవాలే. ‘అలాదిన్ ’ నుంచి ‘కిక్’, ‘హౌస్‌ఫుల్’, ‘రేస్ 3’ వరకు వచ్చిన ప్రతి సినిమా ఎన్నో నేర్పించింది. ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీతో పాటు స్పానిష్, ఫ్రెంచ్, అరబిక్ కూడా మాట్లాడగలను.
నా రెస్టరెంట్‌లో అమ్మమ్మ వంటకాలు!
ఇప్పుడు కాస్త ఆహారంపై శ్రద్ధ చూపిస్తున్నా. కానీ, నేనొక ఫుడీని. అందుకే శ్రీలంకలో రెస్టరెంట్ కూడా పెట్టాను. అక్కడి మెనూలో మా అమ్మమ్మ పాత రెసిపీ పుస్తకంలో ఉన్న కొన్ని వంటకాలనే పెట్టా. అమ్మమ్మ చేతి రుచిని ఇలా అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా
ఉంటుంది.
రహస్యంగా వీడియో తీశారు!
ఒకసారి ఢిల్లీలో రెస్టరెంట్‌లో స్నేహితుడితో మాట్లాడుతున్న నన్ను ఎవరో రహస్యంగా వీడియో తీశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. నేను కోపం తెచ్చుకోకుండా, ఆ వీడియో కింద ‘ఔను... అది నేనే’ అని కామెంట్ చేశాను. ఇలాంటి విషయాలను హాస్యంగా తీసుకుంటేనే మంచిది.
నా కొత్త మోజు!
నా బ్యాగ్‌లో ఎప్పుడూ చాలా లిప్‌స్టిక్స్ ఉంటాయి! లిప్‌స్టిక్స్ ఎన్ని ఉన్నా ఇంకా కొత్తవి కావాలనిపిస్తూనే ఉంటుంది. ఇటీవల చెస్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఖాళీ సమయం దొరికితే చాలు చెస్ బోర్డు ముందు కూర్చుంటాను.


