ట్రెండ్
‘ఆర్కైవ్‌లు అనేవి వ్యవస్థలు, ప్రభుత్వాల పని’ అనే అభిప్రాయం ఉంది. అయితే ఇటీవలి కాలంలో వ్యక్తిగత స్థాయిలో ఆన్‌లైన్ ఆర్కైవ్‌లు ప్రజాదరణ పొందుతున్నాయి. ‘నా రాష్ట్ర చరిత్రను మహిళల కోణం నుంచి చూడాలి’ అనే లక్ష్యంతో ఒక ఇంజినీర్ ఆన్‌లైన్ ఆర్కైవ్ మొదలు పెట్టాడు. హిట్!
‘పాత వస్తువులు చరిత్రకు అద్దాలు. మీ ఇంట్లోని పా...త వస్తువుల గురించి మీ జ్ఞాపకాలను పంచుకోండి’ అంటూ ప్రారంభమైన ఆర్కైవ్ సూపర్ హిట్!!
దిల్లీలో పుట్టి టొరంటోలో స్థిరపడ్డాడు హర్లిన్ సింగ్. కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చిన ఈ ఇంజినీర్ దేశవిభజన రోజుల నాటి ఎన్నో విషయాలను పెద్దల నోటి నుంచి విన్నాడు. అయితే తాను విన్న వాటిలో మహిళలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఉన్న విషయాన్ని గ్రహించాడు. ఈ నేపథ్యంలో తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ ‘ది సింగింగ్‌సింగ్’లో పంజాబ్ చరిత్రను మహిళల కోణం నుంచి చూసే ఆర్కైవ్‌కు శ్రీకారం చుట్టాడు. అదే...ది లాస్ట్ హీర్.
పంజాబీ జానపద కథల్లోని సాహసవంతురాలైన వీర వనిత హీర్. కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతి వీర వనితకు ప్రతీకగా నిలుస్తుంది హీర్. ఆ వీరవనితను గుర్తుకు తెచ్చేలా తన ఆర్కైవ్‌కు ‘ది లాస్ట్ హీర్’ అని పేరు పెట్టాడు హర్లిన్ సింగ్.
వెలుగులోకి...
1936లోనే పైలట్ లైసెన్స్ పొందిన మొట్ట మొదటి పంజాబీ మహిళ సర్లా థక్రాల్. ఎప్పుడూ వినని ఇలాంటి అరుదైన మహిళల గురించి సమాచారాన్ని సేకరించి ‘ది లాస్ట్ హీర్ ప్రాజెక్ట్: విమెన్ ఇన్ కలోనియల్ పంజాబ్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చాడు హర్లిన్‌సింగ్. ప్రసిద్ధ పెంగ్విన్ సంస్థ ద్వారా ఈ పుస్తకాన్ని విడుదల చేశాడు.
లాహోర్‌లో నిరసనల హోరు
భగత్‌సింగ్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆనాటి లాహోర్ రాజకీయ ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఆసియా నలుమూలల నుంచి వచ్చిన మహిళా కార్యకర్తలు, నాయకులతో ఒక సమావేశం ఏర్పాటైంది.
ఈ సమావేశంలో పురుషాధిపత్య భావజాలానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు.
...ఇలాంటి ఆసక్తికరమైన విషయాలెన్నో ఎన్నో ‘ది లాస్ట్ హీర్’ ఆర్కైవ్‌లో కనిపిస్తాయి.
బ్రౌన్ హిస్టరీ
టొరంటోకు చెందిన ఇంజినీర్ అహ్సున్ జాఫర్ తమ కుటుంబ మూలాలను అన్వేషించే క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బ్రౌన్ హిస్టరీ’ పేరుతో పేజీ క్రియేట్ చేశాడు. తన కుటుంబ ఆర్కైవ్‌గా ప్రారంభమైన ‘బ్రౌన్ హిస్టరీ’ తన పరిధిని విస్తృతం చేసుకొంది. తమ బంధువులకు మాత్రమే కాదు ఎంతో మంది ప్రజలకు ఈ ఆర్కైవ్ చేరువైంది. ‘బ్రౌన్ హిస్టరీ’కి వేలాదిమంది ఫాలోవర్‌లు ఉన్నారు.
‘మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలనే ఆసక్తితోనే ఈ ఆర్కైవ్ మొదలు పెట్టాను’ అంటున్న జాఫర్ ఒక న్యూస్‌లెటర్‌ను నిర్వహిస్తున్నాడు. రచయితలు, మేధావులతో పాడ్‌కాస్ట్ షోలు చేస్తున్నాడు.
ఒక వ్యక్తి తన సొంత చరిత్ర కోసం చేసిన అన్వేషణ, వేలాది మంది వ్యక్తులు తమ సొంత చరిత్రను అన్వేషించుకునే వేదికగా రూపుదిద్దుకుంది.
చీరకట్టుతో...
బ్రిటిష్ చెస్ పోటీల్లో (1930 ప్రారంభంలో) పాల్గొన్న అతికొద్దిమంది భారతీయ మహిళల్లో పెరిన్ ముర్సా ఒకరు. 1932లో లండన్‌లో జరిగిన బ్రిటిష్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె చీర కట్టుకొని పోటీలో పాల్గొనడం విశేషంగా నిలిచింది. ఇది అప్పుడెప్పుడో తీసిన ఫొటో అయినప్పటికీ ఇప్పటికీ చెస్ అభిమానులు, చరిత్రకారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
చెస్ ఆటలో యూరోపియన్‌లు, పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఆ కాలంలో ప్రతిష్ఠాత్మకమైన ఒక టోర్నమెంట్‌లో భారతీయ మహిళ పాల్గొనడం అరుదైన విశేషంగా నిలిచింది. విషాదం ఏమిటంటే, ఆమె గురించి పెద్దగా వివరాలు తెలియవు. పెరిన్ ముర్సా ఏ ప్రాంతానికి చెందిన వారు, ఆమె కుటుంబ నేపథ్యం ఏమిటి? ఈ టోర్నమెంట్ తరువాత కూడా చెస్ ఆడడం కొనసాగించారా లేదా... మొదలైన వివరాలు తెలియవు. అయితే ఈ ఆర్కైవ్‌కు ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తుంటుంది కాబట్టి ఏదో ఒకరోజు ఆమె గురించి చాలా సమాచారం తెలిసే అవకాశం ఉంది. మనం ఎప్పుడూ వినని పెరిన్ ముర్సాలాంటి ఎంతోమంది ప్రతిభావంతులు ‘బ్రౌన్ హిస్టరీ’లో కనిపిస్తారు.
వస్తువుల్లో చరిత్ర!
‘చరిత్ర అనేది మాటల్లో మాత్రమే జీవించదు. కొన్నిసార్లు అది ఒక వస్తువు రూపంలో, మసకబారిన ఛాయాచిత్రంలో కూడా జీవించవచ్చు. వస్తువులు, ఫొటోలు వాటి సొంతదారుల కంటే ఎక్కువ కాలం జీవించి చారిత్రక ఆనవాళ్లుగా మిగిలిపోతాయి’... ఈ మాటలే ‘మ్యూజియం ఆఫ్ మెటీరియల్ మెమొరీ’ ఆవిర్భావానికి కారణం అయ్యాయి. వారసత్వ సంపద, కుటుంబ చరిత్రలను అన్వేషించడానికి ప్రజల సహకారంతో ఆంచల్ మల్హోత్రా, నవధా మల్హోత్రా డిజిటల్ ఆర్కైవ్ ‘మ్యూజియం ఆఫ్ మెటీరియల్ మెమొరీ’ని ప్రారంభించారు. వివిధ కుటుంబాలకు సంబంధించిన వస్తువులతో ముడిపడిన జ్ఞాపకాలను వారి మాటల్లో రాసుకునే అవకాశం కల్పిస్తోంది ఈ ఆర్కైవ్.
....ఈ స్టోరీ చదివిన తరువాత మీకు కూడా సరికొత్త ఆర్కైవ్ ఆలోచన వస్తే సంతోషమే కదా!


