కోలీవుడ్ స్టార్ హీరో సూర్య-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లాక్ అయిందంటూ అప్పట్లో చాలా స్టోరీలు వచ్చాయి. నిజానికి అవి రూమర్స్ కావు. వీరిద్దరూ కలిసి సినిమా చేయడానికి గతంలో ప్రయత్నించారు. అయితే కథ విషయంలో ఇద్దరికీ సెట్ కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. శనివారం నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌కి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, యూనిట్‌కి అభినందనలు తెలిపారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ.. నేను సూర్యతో ఇప్పటికే ఓ సినిమా చేయాలి. కానీ సూర్యకు నచ్చే కథను నేను చెప్పలేకపోయాను. అయితే త్వరలోనే ఆయనతో తప్పకుండా సినిమా చేస్తానని నిండుసభలో ప్రకటించారు. నా భార్య సూర్యకు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటినుంచో తను నన్ను కోరుతున్నారు. “అది రిక్వెస్ట్ కాదు.. డిమాండ్” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, సూర్యను కలిసేందుకు తన భార్య ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ షూటింగ్‌కి వెళ్లి, ఆయనతో ఫొటో కూడా దిగినట్లు త్రివిక్రమ్ వెల్లడించారు.
అందరూ ఒక్కటై సక్సెస్ చేశారు – సూర్య
‘‘వెంకీ అట్లూరిగారు తెలుగు. నేను తమిళ్, రవీనా టాండన్ మేడం మహారాష్ట్ర, మమిత బైజు కేరళ... ఇలా వేర్వేరు ప్రాంతాలవాళ్లం కలిసి చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాని మీరందరూ (ప్రేక్షకులు) ఒక్కటై అద్భుతంగా ఆదరించారు. మాకు సక్సెస్, గౌరవాన్ని, ప్రేమను ఇవ్వడంతో పాటు ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు మరిన్ని తీసే ప్రోత్సాహం అందించినందుకు థ్యాంక్స్’’ అని సూర్య అన్నారు. సూర్య హీరోగా నటించిన తెలుగు–తమిళ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మమిత బైజు హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న (శుక్రవారం) విడుదలైంది. 
సూర్య మాట్లాడుతూ.. ‘‘కొన్ని సినిమాలను వసూళ్లతో కొలవలేం. ప్రేక్షకులు పొందిన అనుభూతిలోనే ఈ సినిమా అసలు విజయం దాగుంది. ఇలాంటి మంచి సినిమా ఇచ్చిన వెంకీ అట్లూరికి ధన్యవాదాలు. మా మూవీకి శుక్రవారంతో పోల్చితే శనివారానికి వసూళ్లు డబుల్ అయ్యాయని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా కథ రాసినప్పుడు యాక్షన్, డార్క్ హ్యూమర్, ఘోస్ట్, దైవం నేపథ్యంలోని మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఇలాంటి ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఒక కుటుంబ కథా చిత్రంతో వస్తామన్నప్పుడు నిర్మాతలు కొంచెం నిరుత్సాహపరుస్తారు. కానీ, వంశీగారు ప్రోత్సహించారు’’ అని తెలిపారు వెంకీ అట్లూరి. ‘‘ఈ మూవీ ఊటీ షెడ్యూల్‌లో సూర్యతో పాటు నేనూ ఉన్నాను. ముంబైలోని నా ఫ్రెండ్స్ ఊటీకి వచ్చారు. అయితే వారు వచ్చింది నా కోసం కాదు... సూర్య కోసం (నవ్వుతూ)’’ అన్నారు రవీనా టాండన్.
కరుప్పు హిట్ తర్వాత సూర్య నటించిన చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌తోనే సూపర్ హిట్ అవుతుందని టాక్ వినిపించింది. అలానే రిలీజైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.


