మెదడుకు కావాలి ఒక సెలవు | Sakshi Funday Special Story: The Brain Needs a Break | Sakshi
Sakshi News home page

మెదడుకు కావాలి ఒక సెలవు

Aug 16 2026 12:59 AM | Updated on Aug 16 2026 12:59 AM

 Sakshi Funday Special Story: The Brain Needs a Break

ఉదయం మీరు లేవకముందే లేస్తుంది. మంచం దిగక ముందే పని మొదలుపెడుతుంది. రాత్రి నిద్రపోయాక కూడా పని చేస్తూనే ఉంటుంది. ఆఫీస్‌కు వెళ్లినా... ఇంట్లో ఉన్నా... ట్రిప్‌కు వెళ్లినా... ఒక్క సెకను కూడా విరామం తీసుకోకుండా...  ప్రతి మెసేజ్‌లు చదువుతుంది... రీల్స్‌ చూస్తుంది... పనులు ప్లాన్  చేస్తుంది... భవిష్యత్తు గురించి భయపడుతుంది... ఇంత చేసినా... జీతం అడగదు... బోనస్‌ కోరదు... అదే మన మెదడు! ఇలా 24 గంటలు... 365 రోజులు... ఓవర్‌టైమ్‌ చేసే మెదడుకు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, మనోవైజ్ఞానిక నిపుణులు ఒకటే చెబుతున్నారు. శరీరానికే కాదు... మెదడుకూ ఒక సెలవు అవసరం! అదే ఆరోగ్యమూ కూడా!


బ్రెయిన్  హాలిడే ఎలా పుట్టింది
ఇది క్యాలెండర్‌లో ఉండే పండుగ కాదు... ఎవరో ఒక్కరు కనిపెట్టిన ఆవిష్కరణా కాదు. 2000ల తర్వాత స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌ మీడియా,  24/7 వర్క్‌ కల్చర్, వర్క్‌ ఫ్రం హోమ్, డిజిటల్‌ జీవితం పెరిగేకొద్దీ... మానసిక అలసట, బర్నౌట్, స్క్రీన్‌ ఒత్తిడిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.

 అప్పుడు వైద్యులు, మనోవైజ్ఞానిక నిపుణులు, నిద్రా నిపుణులు ఒకే మాట చెప్పారు... ‘మెదడు కూడా విశ్రాంతి కోరుకుంటుంది.’ అలా అప్పటి నుంచి డిజిటల్‌ డిటాక్స్, మైండ్‌ఫుల్‌నెస్, స్లో లివింగ్‌ వంటి భావనలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. అలా ఇవన్నీ చేస్తున్నప్పటికీ మెదడు ఇంకా బ్రేక్‌ కోరుకుంటూనే ఉంది. అందుకే, ఇప్పుడు తాజాగా... పూర్తి బ్రెయిన్‌ హాలిడే ట్రెండ్‌ మొదలైంది. ఇది ఒక ట్రావెల్‌ డెస్టినేషన్‌ కాదు. మెదడుకు ఇచ్చే చిన్న విరామం.

హాలిడే... మెదడుకే ఎందుకు?
శరీరం అలసిపోతే మనకు వెంటనే తెలుస్తుంది. కాళ్లు నొప్పి, కళ్లు బరువు, నీరసం, కానీ మెదడు అలసిపోతే? అదే పనిని మళ్లీ మళ్లీ వాయిదా వేయడం; చిన్న విషయానికే చిరాకుపడటం; ఏకాగ్రత లేకపోవడం; ఏమీ చేయాలనిపించకపోవడం; ఎప్పుడూ ఫోన్  చూడాలనిపించడం– ఇలా చిన్న చిన్న సిగ్నల్స్‌ ఇస్తుంది. అప్పుడు ‘కాఫీ తాగాలి’ అనుకునే ముందు ‘ఒక్క బ్రేక్‌ తీసుకోవాలి’ అని ఆలోచించండి.

అంటే ఏంటి?
బ్రెయిన్‌ హాలిడే అంటే, చాలామంది ఏదైనా కొండెక్కి, చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయాలని అనుకుంటారేమో! కానీ, బ్రెయిన్  హాలిడే అంటే అది కాదు. మెదడుకి కాసేపు ‘ఏం చేయొద్దు బాస్‌!’ అని చెప్పడమే. అసలూ ఏ పనీ లేకుండా, కాసేపు ఏమీ ఆలోచించకుండా అలా కూర్చోవడమే అసలైన బ్రెయిన్‌ హాలిడే! అయితే ఇదే ఇప్పుడు చాలామందికి కష్టంగా మారింది.

ఎందుకంటే, ఒకప్పుడు ‘ఏమీ చేయకుండా ఉండటం’ బద్ధకం అంటుంటే, ఇప్పుడది ఒక విలాసమే! కాదు, అవసరం కూడా! ఎందుకంటే, 2025లో 36,245 మందిపై జరిగిన 54 పరిశోధనల విశ్లేషణలో బోర్‌ కొట్టే భావనకు, లేజీనెస్‌కు సంబంధం లేదని తేల్చారు. మరోవైపు, అమెరికాలో 2025లో నిర్వహించిన సర్వేలో 62 శాతం మంది ‘ఫోన్  లేకున్నా, ఏ పని చేయకుండా ఉన్నా, ఆందోళనగా అనిపిస్తుంద’ని చెప్పారు. దీంతో ఆరోగ్యం కోసం శరీరానికే కాదు, బ్రెయిన్‌కి కూడా విరామం తప్పనిసరి అయింది.

ఫోన్  పక్కన పెట్టినా సరిపోదు!
బ్రెయిన్‌ హాలిడే కోసం ‘ఫోన్  ఎక్కువగా వాడొద్దు’ అనేది కొత్త సలహా కాదు. కానీ అసలు సమస్య ఏంటంటే... ఫోన్  మన చేతిలో ఉన్నంతకాలం అది కేవలం ఫోన్ గా ఉండటం లేదు! అది ఆఫీస్, సినిమా హాల్, షాపింగ్‌ మాల్, న్యూస్‌ చానెల్స్, ఫ్రెండ్స్, బ్యాంక్, కెమెరా, మ్యాప్, ఎంటర్‌టైన్‌మెంట్‌... ఇలా ఒకేసారి అన్నీ అయిపోతోంది! ఇలా ప్రతి చిన్న ఖాళీని ఫోన్ తో నింపేస్తుండటంతో మన మెదడుకి కాసేపు ఊపిరి పీల్చుకునేంత ఖాళీ కూడా దొరకడం లేదు. అందుకే  కొన్ని దేశాల్లో ఫోన్  రహిత కార్యక్రమాలు, ఫోన్  లేకుండా గడిపే సమావేశాలు, తెరలకు దూరంగా ఉండే అనుభవాలు పెరుగుతున్నాయి.

బ్రిటన్ లో 2024 నుంచి 2025 మధ్య ఇలాంటి ఫోన్  రహిత కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్య 21 శాతం పెరిగిందని ‘ది గార్డియన్ ’ అనే సర్వే నివేదించింది. కానీ ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం! ఫోన్ కి దూరంగా ఉండటమూ కూడా మెదడుకి పూర్తి సెలవు కాదని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. ఫోన్  లేకపోయినా మన మనసు, మెదడును మరో ఆలోచనతో బిజీగానే ఉంటుంది. మరి మెదడుకి కావాల్సిన సెలవు ఏంటి? అనేదే ఇక్కడ అసలు ప్రశ్న!

ఖాళీగా ఉండటం కష్టమైపోయింది?
ఒకప్పుడు ఖాళీ దొరికితే, కాసేపు అలా కూర్చునేవాళ్లం. కిటికీలోంచి బయటకు చూస్తూ ఏవేవో ఆలోచించేవాళ్లం. ఇప్పుడు మాత్రం రెండు నిమిషాలు ఖాళీగా ఉంటే చాలు... ‘ఏదైనా చూద్దాం!’ అంటూ ఫోన్  చేతిలోకి వచ్చేస్తుంది. బోర్‌ కొట్టినా ఫోన్ ... ట్రాఫిక్‌లో వాహనాలు కదలకపోయినా ఫోన్ ... భోజనం ముందున్నా ఫోన్ ... ఎవరైనా రెండు నిమిషాలు ఆలస్యమైనా ఫోన్ ... చివరికి నిద్ర రావడం లేదని ఫోన్  తీసుకుని, ఫోన్  చూసి నిద్ర పారిపోయిందని బాధపడటం కూడా మనదే! ఇలా మన జీవితంలో దొరికే ప్రతి చిన్న ఖాళీని సందేశాలు, వార్తలు, చిన్నచిన్న వీడియోలు, ప్రకటనలు, వినోదంతో నింపేస్తున్నాం. అసలు మనకు బోర్‌ కొట్టడం లేదు... బోర్‌ కొట్టేంత ఖాళీనే ఇవ్వడం లేదు! అందుకే, ప్రస్తుతం చాలామందికి ఖాళీగా ఉండటమే అసలైన పెద్ద సమస్యగా మారింది.

ట్రిప్‌కి వెళ్లి... ట్రాప్‌లో పడొద్దు!
హాలిడే అంటే ఒత్తిడికి బ్రేక్‌ చెప్పడానికి వెళ్లేది. కానీ చాలామంది ట్రిప్‌కి వెళ్లాక కూడా అదే టెన్షన్ ను వెంట తీసుకెళ్తారు. ఎక్కడ తినాలి? ఏం చూడాలి? ఫొటోలు ఎన్ని తీయాలి? రీల్‌ ఎప్పుడు పెట్టాలి? ఆఫీస్‌ మెయిల్‌ వచ్చిందా? ఇలా ట్రిప్‌ని కూడా మరో పనిలా చేస్తుంటారు. అందుకే, ఈసారి ట్రిప్‌కు వెళ్లినప్పుడు, హాలిడే ట్రాప్‌లో పడకుండా ఉండాలంటే ఇవీ గుర్తుంచుకోండి!

ప్లాన్  మొత్తం ముందే!
చివరి నిమిషంలో టికెట్లు, హోటళ్లు, బ్యాగులు, బడ్జెట్‌ గురించి టెన్షన్  పడితే, హాలిడే మొదలయ్యేలోపే మెదడు అలసిపోతుంది. అందుకే ముందుగానే ప్లాన్  చేసుకోండి. అప్పుడే ప్రయాణం మొదలయ్యే ముందే హాలిడే ఫీలింగ్‌ మొదలవుతుంది.

కొత్త ప్రదేశం... కొత్త మెదడు!
ఎప్పుడూ చూసిన రోడ్లు, అదే రెస్టరెంట్లు, అదే రొటీన్ ... ఇవి మెదడుకు కొత్తదనం ఇవ్వవు. కొత్త ప్రదేశాలు, కొత్త రుచులు, కొత్త అనుభవాలు మాత్రం మెదడుకు చిన్న పండుగలాంటివి.

అడ్రెస్‌ మర్చిపోకండి!
కొత్తదనం బాగానే ఉంటుంది. కానీ మరీ దారి తెలియని అడవులు, భాష రాని ఊళ్లు, ప్లాన్  లేని ప్రయాణాలు– చివరికి హాలిడేను సర్వైవల్‌ చాలెంజ్‌గా మార్చొచ్చు. కొత్తదనం ఉండాలి, కానీ కంఫర్ట్‌ కూడా ఉండాలి.

సరైన వాళ్లతో వెళ్లండి!
ట్రిప్‌ను గుర్తుండిపోయేలా చేసేది ప్రదేశం కంటే... తోడున్న వాళ్లు. నవ్వించే వాళ్లతో వెళ్లండి. ప్రతి ఐదు నిమిషాలకు గొడవపడే వాళ్లతో కాదు, లేకపోతే ట్రిప్‌ ముగిసేలోపే గ్రూప్‌ కూడా ముగిసిపోతుంది!

బ్రెయిన్ కు వార్మప్‌!
రోజంతా స్క్రీన్ లో మునిగిపోయిన మెదడు– హాలిడే మొదలైందని ఒక్కసారిగా ప్రశాంతంగా మారదు. అందుకే ట్రిప్‌కు కొన్ని రోజుల ముందే రాత్రిళ్లు ఫోన్ ను కాస్త దూరంగా పెట్టడం, ప్రశాంతంగా గడపడం అలవాటు చేసుకోండి.

మొదటి రోజే మ్యాజిక్‌!
ట్రిప్‌లో మొదటి అనుభవాలే ఎక్కువకాలం గుర్తుంటాయి. అందుకే మొదటి రోజే మీకు బాగా నచ్చే పని చేయండి. మంచి సూర్యోదయం కావచ్చు, ఇష్టమైన రెస్టరెంట్‌ కావచ్చు, ఎప్పటి నుంచో చూడాలనుకున్న ప్రదేశం కావచ్చు.

ట్రిప్‌ ముగిసిందా... పరవాలేదు!
హాలిడే ముగిసిన వెంటనే రొటీన్ లోకి దూకేయకండి. సూట్‌కేస్‌ తెరిచినంత ఈజీగా మెదడు హాలిడే మూడ్‌ నుంచి బయటకు రాదు. ఇంటికి వచ్చాక నెమ్మదిగా గడపండి. ట్రిప్‌ ఫొటోలు చూడండి. జ్ఞాపకాలను గుర్తు చేసుకుని నవ్వుకోండి.  ఆఫీస్‌ పనులకు దూరంగా ఉండండి.

హాలిడే అంటే కేవలం ప్రదేశం మార్చడం కాదు, మనసును మళ్లీ ఉల్లాసపరచడం! అలా ఉల్లాసపరచాక వెంటనే, తిరిగి వెంటనే కష్టపెట్టకుండా జాగ్రత్తగా 
చూసుకోండి.

సెలవిస్తే... ఏం లాభం?
రోజంతా ఆగకుండా పరిగెత్తిన మెదడుకు కూడా కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికితే? ముందుగా ఒత్తిడి తగ్గుతుంది. మనసు తేలికగా అనిపిస్తుంది. ఏకాగ్రత మెరుగవుతుంది. చిన్న చిన్న విషయాలకే వచ్చే చిరాకు తగ్గుతుంది. నిర్ణయాలు కూడా స్పష్టంగా తీసుకోగలుగుతాం. కొన్నిసార్లు గంటల తరబడి ఆలోచించిన సమస్యకు... నిశ్శబ్దంగా కూర్చున్న పది నిమిషాల్లోనే పరిష్కారం దొరుకుతుంది.

కొత్త ఉత్సాహం మొదలవుతుంది... చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఎప్పుడూ ఏదో ఒకటి చూస్తూ, వింటూ, స్క్రోల్‌ చేస్తూ, ఆలోచిస్తూ ఉండే మెదడుకు కాసేపు విరామం దొరుకుతుంది. అక్కడే కొత్త ఆలోచనలు పుడతాయి. కొన్నిసార్లు జీవితాన్ని మార్చే ఐడియాలు కూడా అక్కడి నుంచే మొదలవుతాయి. అందుకే మెదడుకు హాలిడే అంటే సమయాన్ని వృథా చేయడం కాదు. ఆలోచనలకు కొత్త చిరునామా ఇవ్వడం కూడా!

ఆఫ్‌లో ఉన్నప్పుడే ఆన్ !
మన మెదడు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. కానీ మనం కాసేపు చేసేపనిని ఆపేసినప్పుడు, మెదడు కూడా పూర్తిగా ఆగిపోదు. బదులుగా ‘డిఫాల్ట్‌ మోడ్‌ నెట్‌వర్క్‌’ (డీఎమ్‌ఎన్‌) అనే సిస్టమ్‌ యాక్టివ్‌ అయి, ఆ రోజంతా దొరికిన సమాచారాన్ని మెదడు సర్దుకుంటుంది. పాత జ్ఞాపకాలను కొత్త సమాచారంతో కలుపుతుంది. సంబంధం లేని రెండు ఆలోచనల మధ్య కొత్త లింక్‌ కూడా కనిపెడుతుంది. అందుకే, షవర్‌లో ఉన్నప్పుడు సూపర్‌ ఐడియా రావడం; వాకింగ్‌ చేస్తుంటే సమస్యకు సొల్యూషన్  దొరకడం; నిద్రకు ముందు ఒక్కసారిగా ‘అరే... ఇదే కదా!’ అనిపించడం; ఇవన్నీ అంత యాదృచ్ఛికం కాకపోవచ్చు! అందుకే, మీరు పూర్తిగా బ్రెయిన్‌కి సెలవు ఇవ్వాలంటే ఈ చిన్న చిన్న పనులను తప్పకుండా చేయాలి.

అన్నింటికీ దూరంగా.. 
మెదడుకు హాలిడే ఇవ్వాలంటే ముందుగా దానికి వచ్చే సమాచార ప్రవాహాన్ని తగ్గించాలి. వారానికి ఒకరోజు డిజిట్‌ డిటాక్స్‌: ఒంటరిగా ఉండటం, ఎక్కడికీ వెళ్లకుండా ఉండటం, ఇంటి పనులకు కూడా దూరంగా ఉండడం లాంటి చిన్న మార్పులు ఉపయోగపడొచ్చు.

కళ్లకు 20 –20 బ్రేక్‌! 
మొదడకు హాలిడే ఇచ్చేటప్పుడు ప్రకృతితో 20 నిమిషాల డీల్‌ని తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే, పచ్చని చెట్లు, ఓపెన్  స్పేస్, నిశ్శబ్దమైన వాతావరణాన్ని అలా ఒక ఇరవై నిమిషాలు చూస్తే, అదే మెదడుకు మంచి బ్రేక్‌! అయితే, హాలిడేకి వెళ్లేంత బడ్జెట్, టైమ్‌ లేనివాళ్లు, ప్రతి 20 నిమిషాలకు... 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును అసలు ఏమీ ఆలోచించకుండా కనీసం 20 సెకన్లు చూస్తే చాలు.

డూ నథింగ్‌!
ఇది చాలా కష్టం! ఎందుకంటే, మనకు చిన్నప్పటి నుంచి ‘ఖాళీగా కూర్చోకు!’, ‘ఏదో ఒకటి చేయి!’, ‘టైమ్‌ వేస్ట్‌ చేయకు!’ అంటూనే పెంచుతారు. కానీ, మెదడు ఎప్పుడూ పనిలోనే ఉండాల్సిన అవసరం లేదు కాసేపు ఖాళీగా కూర్చోవటం. ఒంటరిగా గడపటం వంటివేవి ఎవరూ నేర్పించరు. ఇవన్నీ మీ ఆరోగ్యం కోసం మీరే నేర్చుకోవాలి.

నిశ్శబ్దమూ కావాలి!
రోజులో కొద్దిసేపు ఇష్టమైన పాట వినండి. వర్షం శబ్దం వినండి. పక్షుల కిలకిలలు వినండి. మెదడుకు నిరంతరం కంటెంట్‌ మాత్రమే కాదు, అప్పుడప్పుడు కాస్త నిశ్శబ్దమూ కావాలి!

నిద్రతో రీచార్జ్‌!
మెదడుకు అసలు విశ్రాంతి ఇచ్చేది అంతరాయం లేని మంచి నిద్ర. నిద్రలోనే మెదడు రోజంతా సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరిస్తుంది. అందుకే హాలిడేలో కనీసం ఒకరోజైనా అలారం లేకుండా ప్రశాంతంగా నిద్రపోండి.

చిన్న హాలిడే! 
మెదడుకు హాలిడే ఇవ్వాలంటే ఒకరోజు మొత్తం ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. రోజుకు 15–30 నిమిషాల చిన్న విరామమే చాలాసార్లు మంచి ఆరంభం అవుతుంది. కాసేపు అన్నింటినీ పక్కన పెట్టి, నిశ్శబ్దంగా నడవండి. ఈ చిన్న అలవాటే, మెదడుకు మంచి హాలిడే!

ఒక్కరోజు ప్రయోగం!
ఒక్కరోజు మీ మెదడును వీఐపీ గెస్ట్‌లా ట్రీట్‌ చేసి చూడండి. ఉదయం లేచిన వెంటనే ప్రపంచాన్ని కాదు, మీ చుట్టూ ఉన్న ప్రశాంతతను పలకరించండి. రోజంతా తొందరపడకుండా, ఒకసారి ఒక పనికే సమయం ఇవ్వండి. మధ్యలో కొద్దిసేపు నిశ్శబ్దాన్ని ఆస్వాదించండి. సాయంత్రం మీకు నిజంగా ఆనందం ఇచ్చే పనిలో మునిగిపోండి. రాత్రి నిద్రకు గంట ముందు అన్నింటినీ పక్కన పెట్టి, మీ మెదడుకు కూడా ‘ఇవాళ్టి డ్యూటీ అయిపోయింది... వెళ్లి హాయిగా నిద్రపో!’ అని చెప్పండి.

ఇది కేవలం సరదా చాలెంజ్‌ కాదు, చిన్న సైన్స్‌ కూడా! కొన్ని పరిశోధనల ప్రకారం మన మెదడు రోజుకు సుమారు ఆరువేలకు పైగా ఆలోచనలు చేస్తుంది. అలాంటి మెదడుకు కొద్దిసేపు నిశ్శబ్దం దొరికినా, రోజంతా సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరించుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ప్రకృతిలో కేవలం 20 నిమిషాలు గడిపినా ఒత్తిడి తగ్గుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక్క రోజు ఇలా గడిపి చూడండి– వచ్చే హాలిడే కోసం ఎదురుచూసేది మీరు కాదు, మీ మెదడే!  

కుటుంబంలో అందరికీ!
బ్రెయిన్  హాలిడే అంటే ఉద్యోగస్తులకు మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ అవసరమే. పిల్లలు రోజంతా చదువు, హోంవర్క్, క్లాసులతో అలసిపోతారు. టీనేజర్లు సోషల్‌ మీడియా, పరీక్షల ఒత్తిడితో సతమతమవుతారు. తల్లిదండ్రులు ఉద్యోగం, ఇంటి పనులు, బాధ్యతల మధ్య తమ కోసం క్షణం కూడా కేటాయించలేరు. పెద్దవాళ్లు కూడా ఆందోళనలు, ఆరోగ్య సమస్యలతో మానసికంగా అలసిపోతారు.

అందుకే వారానికి ఒకరోజు ఇంట్లో ‘నో స్క్రీన్‌ డే’ పెట్టండి. టీవీ ఆఫ్, ఫోన్లు పక్కన, ల్యాప్‌టాప్‌లకు సెలవు. కలిసి అల్పాహారం చేయండి... పార్క్‌కు వెళ్లండి... బోర్డ్‌ గేమ్స్‌ ఆడండి... పాత ఫొటోలు చూస్తూ నవ్వుకోండి... లేదా గంటసేపు కబుర్లు చెప్పుకోండి. ఆ రోజు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు... ఆ రోజు జ్ఞాపకం మీ మెదడులో సేవ్‌ అయితే చాలు! కొన్నిసార్లు కుటుంబంతో కలిసి గడిపే క్షణాలు కూడా బెస్ట్‌ హాలిడేనే!  

శరీరానికి విశ్రాంతి ఇస్తే, అలసట పోతుంది. మనసుకు ప్రశాంతత ఇస్తే, ఉల్లాసం వస్తుంది. అదే మెదడుకు సెలవిస్తే, జీవితం మళ్లీ కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే, మెదడు హ్యాంగ్‌ అయితే జీవితం బఫరింగ్‌లో పడిపోతుంది!

∙కొండి దీపిక
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement