మెన్ మేకప్‌ మంత్రం! | Easy Makeup Look for Boys | Sakshi
Sakshi News home page

మెన్ మేకప్‌ మంత్రం!

Aug 16 2026 1:52 AM | Updated on Aug 16 2026 1:52 AM

Easy Makeup Look for Boys

ముఖంపై మచ్చలు, మొటిమలు, డార్క్‌ సర్కిల్స్‌ మగాళ్లను వదిలేస్తాయా? మరి ఫేస్‌ కాస్త ఫ్రెష్‌గా, షార్ప్‌గా కనిపించడానికి అబ్బాయిలు మేకప్‌ చేసుకుంటే తప్పేంటి? కానీ, ఇక్కడ రూల్‌ ఒక్కటే... మేకప్‌ కనిపించకూడదు. కానీ, లుక్‌ మాత్రం అదిరిపోవాలి. అందుకే, అబ్బాయిల సింపుల్‌ మేకప్‌ గైడ్‌ ఇప్పుడు మీకోసం..

ముందు మేల్కొలుపు!
ఒక్కసారిగా ముఖంపై ఫౌండేషన్  పూసుకుంటే, మేకప్‌ కూడా షాక్‌ అవుతుంది! ముందుగా ఫేస్‌వాష్‌తో ముఖాన్ని క్లీన్  చేసుకొని, తర్వాత చర్మం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే తేలికపాటి మాయిశ్చరైజర్‌ లేదా హైడ్రేటింగ్‌ జెల్‌ రాయండి. చర్మం డ్రైగా ఉంటే మేకప్‌ పొరలుగా కనిపిస్తుంది. ముక్కు, నుదురు, గడ్డం చుట్టూ ఆయిల్‌ ఎక్కువగా వస్తే అక్కడ మాత్రమే కొద్దిగా ప్రైమర్‌ వాడండి. అంతేకానీ... ప్రైమర్‌తో ముఖంపై సిమెంట్‌ కోటింగ్‌ వేయొద్దు!

ఎక్కడ అవసరమో... అక్కడే!
రోజువారీ లుక్‌కు లైట్‌ బీబీ క్రీమ్‌ లేదా టింటెడ్‌ ఫ్లూయిడ్‌ సరిపోతుంది. ముఖం మధ్యలో కొద్దిగా పెట్టి బయటివైపు బ్లెండ్‌ చేయండి. ఎక్కడైనా మొటిమ, మచ్చ లేదా రెడ్‌నెస్‌ ఉంటే అక్కడ మాత్రమే స్కిన్  టోన్ కు మ్యాచ్‌ అయ్యే కన్సీలర్‌ పెట్టండి.  చిన్న డాట్‌... చిన్న ట్యాప్‌... అంతే!

షాడో కావాలి... షో కాదు!
మెన్  కాంటూరింగ్‌ అంటే ముఖంపై బ్రౌన్  గీతలు గీసుకుని కొత్త మ్యాప్‌ తయారు చేయడం కాదు! జా లైన్  కింద, చెంప ఎముకల కింద, ముక్కు పక్కన సహజంగా పడే నీడను, కూల్‌ టోన్  కాంటూర్‌ స్టిక్‌ లేదా మ్యాట్‌ బ్రాంజర్‌తో కాస్త హైలైట్‌ చేయడమే.

కనుబొమ్మలు కూడా ముఖ్యమే!
జుట్టు దువ్వుకుంటారు... గడ్డం సెట్‌ చేసుకుంటారు... కానీ కనుబొమ్మల సంగతే మర్చిపోతారు! అవి ముఖానికి ఫ్రేమ్‌లాంటివి. క్లీన్  స్పూలీతో పైకి, బయటికి బ్రష్‌ చేసి సెట్‌ చేయండి. ఖాళీలు ఉంటే మీ సహజ రంగుకు దగ్గరగా ఉండే బ్రో పెన్సిల్‌తో చిన్న చిన్న హెయిర్‌ స్ట్రోక్స్‌ వేయొచ్చు.

గడ్డంలో దొరకకూడదు!
మేకప్‌ వేసుకున్నట్టు కనిపించే అబ్బాయిల దగ్గర ఒక కామన్  తప్పు... గడ్డంలో ఇరుక్కున్న పౌడర్‌! బేస్‌ వేసుకున్న తర్వాత శుభ్రమైన, కొద్దిగా తడిగా ఉన్న స్పూలీతో గడ్డం, మీసాలను మెల్లగా బ్రష్‌ చేయండి. అదనపు పౌడర్, క్రీమ్‌ తొలగిపోతాయి. అప్పుడు గడ్డం కూడా సహజంగా కనిపిస్తుంది.

పెదాలకు కూడా అవసరమే!
పెదాలు పొడిబారిపోయి ఉంటే... ఎంత గ్రూమింగ్‌ చేసినా లుక్‌ పూర్తిగా రాదు. అలాగని లిప్‌స్టిక్‌ వేయొద్దు.  నేచురల్‌ లేదా మ్యాట్‌ ఫినిష్‌ ఉన్న లిప్‌ బామ్‌ వాడండి. అయితే మరీ షైనీగా ఉండే దాన్ని వాడితే... దొరికిపోతారు!

ఫైనల్‌ ఇంటర్వ్యూ!
మేకప్‌ అయిపోయిందా? వెంటనే బయటికి వెళ్లొద్దు. ముందుగా సహజమైన వెలుతురులో ముఖాన్ని ఒకసారి చెక్‌ చేసుకోండి. కొన్నిసార్లు లైట్‌ మిమ్మల్ని మోసం చేయొచ్చు. కిటికీ దగ్గర నిలబడి చూడండి. మేకప్‌ గీతలు, కలర్‌ తేడాలు, ఎక్కువగా కనిపించే కాంటూర్‌ ఏమైనా ఉన్నాయా చెక్‌ చేసుకోండి.

మచ్చలు, డార్క్‌ సర్కిల్స్‌ దాక్కోని, జా లైన్  హైలైట్‌ అవ్వాలి. కాని మేకప్‌ మాత్రం ఎక్కడా కనిపించకూడదు! బదులుగా... ‘ఏంటి బ్రో... ఇంత హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నావ్‌?’ అని మాత్రం అందరూ అడగాలి! అదే అసలు సీక్రెట్‌ మేకప్‌ స్టయిల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement