breaking news
Lumpy Skin Disease
-
నొప్పి లేకున్నా... నిర్లక్ష్యం వద్దు!!
కొందరిలో ఒక్కోసారి తమ కాళ్లలో లేదా చేతుల్లో గడ్డ కనిపించవచ్చు. అది నొప్పి లేని గడ్డ కావడంతో పాటు క్రమంగా పెరుగుతూపోవచ్చు. కారణం లేకుండా ఎముకల్లో నొప్పి కనిపించడంతో రాత్రివేళల్లో ఆ నొప్పి పెరుగుతూ పోవచ్చు. ఆటల్లో గాయపడటమో లేదా తమకు తెలియకుండా ఏదైనా చిన్నపాటి దెబ్బతగలడం వల్లనో ఇలా జరుగుతుండవచ్చని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ లక్షణాలు కొన్నిసార్లు ‘సార్కోమా’ అనే క్యాన్సర్‌కు సూచనలు కావచ్చు. ఈ సార్కోమా తరహా క్యాన్సర్‌పై అవగాహన కోసం ఈ కథనం.సార్కోమా అనేది అరుదైన క్యాన్సర్లలో ఒకటి. సార్కోమా అంటే ఏమిటో చూద్దాం...మన దేశంలో సార్కోమా విస్తృతి... భారతదేశంలో ప్రతి ఏడాది సుమారు 20 వేల కొత్త సార్కోమా కేసులు నమోదవుతున్నట్లు అంచనా. అయితే అవగాహన లోపం, లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల చాలామంది వ్యాధి ముదిరిన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారు. తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందిస్తే మంచి ఫలితాలు కనిపించడంతో పాటు బాధితుల్లో మంచి మెరుగుదల కనిపిస్తుందని గుర్తుంచుకోవడం ముఖ్యం. సార్కోమా అంటే..? సార్కోమా అనేది దేహంలోని ఎముకలు, కండరాలు, కొవ్వు, రక్తనాళాలు, నరాలు, కార్టిలేజ్, టెండన్లు వంటి మృదుకణజాలా (సాఫ్ట్ టిష్యూస్)లో వచ్చే అరుదైన క్యాన్సర్. సాధారంగా కనిపించే మిగతా క్యాన్సర్లతో పోలిస్తే ఇది కాస్త అరుదుగా కనిపించినప్పటికీ, చిన్నపిల్లలు, యువత, మధ్యవయస్కుల్లోనూ ఇటీవల కొంత ఎక్కువగానే కనిపిస్తోంది. ఇది శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ముఖ్యంగా చేతులు, కాళ్లు, తొడలు, భుజాలు, పొత్తికడుపు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.లక్షణాలు... తొలి దశల్లో ‘సార్కోమా’లో పెద్దగా నొప్పి ఉండకపోవడంతో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. సార్కోమాలో కనిపించే సాధారణ లక్షణాలవి... ∙నొప్పి లేకుండా క్రమంగా పెరుగుతున్న గడ్డ ∙చేతులు లేదా కాళ్లలో అసాధారణ వాపు ∙రాత్రివేళల్లో ఎక్కువయ్యే ఎముకల నొప్పి ∙కారణం లేకుండా నెలల తరబడి నొప్పి కొనసాగడం ∙గడ్డ పరిమాణం వేగంగా పెరుగుతుండటం ∙కదలికల్లో ఇబ్బంది లేదా గడ్డ వచ్చిన అవయవం పనితీరు తగ్గడం ∙ఐదు సెంటీమీటర్లకు మించిన గడ్డలు రావడం, కొన్ని వారాలుగా ఆ గడ్డల్లో వాపు తగ్గకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయడం సరికాదు. పైన పేర్కొన్న లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది.నిర్ధారణ ఇలా... సార్కోమా నిర్ధారణ కోసం చేసే పరీక్షల్లో కొన్ని... ∙ఎంఆర్ఐ స్కాన్ ∙పీఈటీ–సీటీ స్కాన్ ∙బయాప్సీ. ఈ పరీక్షలతో కణితి రకం, సైజు, వ్యాప్తితో పాటు అది ఏ దశలో ఉందన్న విషయాలను నిర్ధారణ చేశాక... దాన్ని బట్టి చికిత్సను ΄్లాన్ చేస్తారు. చికిత్స ... బాధితుల పరిస్థితిని బట్టి శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీనిలలో పేషెంట్‌కు అవసరమైనదాన్ని నిర్ణయిస్తారు. ఒక్కోసారి ఈ చికిత్సలన్నింటినీ సమన్వయంతో అందించాల్సి రావచ్చు. అయితే తొలిదశల్లోనే చికిత్స మొదలుపెట్టడం వల్ల చాలా మంది జీవితం తిరిగి సాధారణంగా అయ్యేందకు అవకాశాలెక్కువ.ఆధునిక చికిత్సలతో అవయవాన్ని కాపాడే అవకాశం... గతంలో సార్కోమా చికిత్సలో చాలాసార్లు చెయ్యి లేదా కాలిని తొలగించాల్సి వచ్చేది. కానీ ఇటీవల వైద్యరంగంలోని అధునాత సాంకేతిక పురోగతితో లింబ్ సాల్వేజ్ సర్జరీలు, అత్యాధునిక ఇం΄్లాంట్లు, రీకన్ స్ట్రక్షన్ పద్ధతుల ద్వారా గడ్డను పూర్తిగా తొలగించడంతో పాటు అవయవాన్ని కాపాడే అవకాశాలూ గణనీయంగా పెరిగాయి.చికిత్స తర్వాత కూడా జాగ్రత్తలు అవసరం... శస్త్రచికిత్సతో లేదా ఇతరత్రా అవసరమైన చికిత్సల తర్వాత పరిస్థితి అంతా తిరిగి సాధారణ స్థితి చేరుకుందని అనుకోవడం సరికాదు. నిజానికి పేషెంట్లు తమ చికిత్స తర్వాత కూడా ఫిజియోథెరపీ, పునరావాస చికిత్స (రీ–హ్యాబిలిటేషన్ థెరపీ) వంటివి చేస్తూ ఉండటంతో పాటు క్రమం తప్పకుండా ఫాలోఅప్‌కు రావడమూ తప్పనిసరి. అలాగే కుటుంబ సభ్యుల సహకారమూ పేషెంట్లు పూర్తిగా కోలుకోవడంలో కీలక భూమిక పోషిస్తుందని గుర్తుంచుకోవాలి. డాక్టర్ రాజీవ్ రెడ్డిఆర్థోపెడిక్ ఆంకోసర్జన్– సార్కోమా స్పెషలిస్ట్ -
లంపీ స్కిన్ డిసీజ్ నివారణకు వ్యాక్సిన్
కొవాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థ ఆధ్వర్యంలోని బయోవెట్ ఇటీవల లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్ఎస్డీ) కోసం వ్యాక్సిన్ తయారు చేసినట్లు ప్రకటించింది. పాడి పశువుల చర్మంపై వచ్చే లంపీ స్కీన్ వ్యాధికి ఈ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. దేశంలో మొదటిసారిగా ఈ వ్యాధి నివారణకు ‘బయోలంపీవాక్సిన్’కు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) ఆమోదం లభించినట్లు సంస్థ పేర్కొంది.బయోలంపీవాక్సిన్బయోలంపీవాక్సిన్ అనేది పాడి పశువులను ఎల్ఎస్డీ నుంచి రక్షించడానికి తయారు చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్. మూడు నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న జంతువులకు ఏటా ఒకసారి దీన్ని ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది. బయోవెట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) పరస్పర సహకారంతో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. ఈ వ్యాక్సిన్‌ను క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఐసీఏఆర్-నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ (ఐసీఏఆర్-ఎన్ఆర్సీఈ), ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐవీఆర్ఐ)ల్లో విస్తృతంగా పరీక్షించినట్లు తెలిపారు.ఇదీ చదవండి: Aero India 2025 బీఈఎల్ కొత్త ఉత్పత్తులుఈ వ్యాక్సిన్ తయారు ప్రాజెక్ట్‌కు ఎన్ఆర్సీఈ శాస్ట్రవేత్తలు నవీన్ కుమార్, బీఎన్ త్రిపాఠి నేతృత్వం వహించారు. ఎల్ఎస్డీ వల్ల దేశంలో పాడి ఉత్పాదకత గణనీయంగా ప్రభావం చెందుతోంది. గడిచిన రెండేళ్లలో దాదాపు రెండు లక్షలకుపైగా పాడి పశువులు ఈ వ్యాధి బారినపడి మరణించాయని కంపెనీ తెలిపింది. ఈ వ్యాధివల్ల 2022 సంవత్సరంలో రూ.18,337.76 కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. ఈ వ్యాధి వల్ల పాల ఉత్పత్తి 26% క్షీణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
పశువుల్లో పంజా విసురుతున్న లంపీస్కిన్.. పాలు తాగడం సురక్షితమేనా?
పశువుల్లో వచ్చే వ్యాధుల్లో అధిక శాతం నివారించదగ్గవే. వ్యాధి రాకముందు టీకాలతోను, వ్యాధి వచ్చిన తరువాత వైద్యుల సలహాలతో పాటు సూచించిన మందులతో పాడి రైతులు నయం చేసుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం మూగజీవాలకు సోకిన లంపీస్కిన్ వ్యాధి తీవ్రతరంగా మారింది. దీంతో పాడి పశువులు బక్కచిక్కిపోవడంతో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఈ వ్యాధి బారిన పడిన పశువులు కూడా మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. వీటిలో అధికంగా తెల్లజాతి పశువుల్లో ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా కనిపిస్తుంది. వ్యాధి తీవ్రతరం కాకుండా గోట్‌ఫాక్స్ వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చి టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరం చేసింది. జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతీయ ఆస్పత్రులు, 65 పశు వైద్యశాల లు, 40 గ్రామీణ పశువైద్య కేంద్రా లు ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లాలో 3 లక్షల 77 వేల ఆవులు ఉన్నా యి. జిల్లాలో 3,02,450 టీకాలు లక్ష్యం కాగా ఇప్ప టివరకు సుమారు 1.35లక్షల వరకు టీకాల కార్యక్రమం చేపట్టారు. మున్సిపాల్టీ పరిధి కొత్తవలస గ్రామంలో బి.హరనాథరావుకు చెందిన మూడు ఆవులు ఈ నెల 2న ఒకే రోజు లంపీస్కిన్ వ్యాధి బారిన పడి మృతి చెందాయి. పశువులకు లంపీస్కిన్ (ముద్దచర్మం) వ్యాధి సోకక ముందు గ్రామంలో పశువైద్యాధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని లబోదిబోమంటున్నాడు. ఇలా ఎక్కడో ఒక చోట పశువులకు వ్యాధులు సోకడంతో మృత్యువాత పడుతున్నాయి. అధికారులు స్పందించి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతున్నారు. మురుగు నీరు నిల్వ ఉన్న చోట దోమలు, ఈగలు అధికంగా ఉంటాయి. దీంతో లంపీస్కిన్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏడాది పొడువునా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ వర్షాకాలంలోనే అధికంగా కనిపిస్తుంది. దీంతో ఓ వైపు మేత కొరత, మరోవైపు వ్యాధితో బాధపడుతున్న పశువుల నుంచి పాలు తగొచ్చా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. అంతే కాకుండా ఈ వ్యాధి కారణంగా పాల దిగుబడి కూడా తగ్గుముఖం పడుతుంది. వ్యాధి సోకిన పశువులను మొదట్లోనే గుర్తించి ఇతర పశువులకు సోక కుండా జాగ్రత్త పడాలి. పశువైద్యులను సంప్రదించి ముందస్తుగా టీకాలు వేయించుకుంటే ప్రమాదం తప్పేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే ఉపశమనం పాడి పశువులకు లంపీస్కిన్ వ్యాధి సోకిన సమయంలో సాంప్రదాయ పద్ధతులు పాటిస్తే కొంతమేర వ్యాధిని అరికట్టవచ్చు. పది తమలపాకులు, పది గ్రాముల మిరియాలు, పది గ్రాములు ఉప్పుతో లేపనం తయారుచేయాలి. దీనికి తగినంత బెల్లం కలపి పశువులకు తినిపించాలి. మొదటి రోజు ఇలా తయారు చేసిన మందును రోజుకు మూడు సార్లు, రెండో రోజు నుంచి రెండు వారాల పాటు రోజుకు రెండు సార్లు తినిపించాలి. రెండు వెల్లుల్లి పాయలు, ధనియాలు పది గ్రాములు, జీల కర్ర పది గ్రాములు, గుప్పెడు తులసి ఆకులు, పది గ్రాముల బిరియాని ఆకులు, పది గ్రాములు మిరియాలు, ఐదు తమలపాకులు, పది గ్రాములు పసుపు, గుప్పెడు వేప ఆకులు, నేరేడు ఆకులు, వంద గ్రాముల బెల్లం తీసుకుని మందును తయారుచేసుకోవచ్చు. దీనిని పశువు ఆరోగ్యం మెరుగుపడే వరకు మొదటి రోజు నాలుగుసార్లు, రెండో రోజు నుంచి రెండు సార్లు చొప్పున తినిపించాలి. లంపీ స్కిన్‌తో పశువు చర్మంపై గాయమైతే సాంప్రదాయ పద్ధతిలో మందు తయారుచేసి రాయాలి. వెల్లుల్లి పది రెక్కలు, కుప్పింటాకులు, వేపాకులు గుప్పెడు, 500 మిల్లీ గ్రాముల కొబ్బరి నూనె, గోరింటాకు, తులసి ఆకులు గుప్పెడు చొప్పున తీసుకుని బాగా మిక్సీ చేసుకుని గాయంపై పూయాలి. గాయంపై పురుగులు ఉంటే సీతాఫలం ఆకురసం రాయడం ద్వారా త్వరగా నయం అవుతుంది. -
దేశంలో పెరిగిన పాల ధర
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పాల ధరలు పెరిగిపోయాయి. పాల సగటు రిటైల్ ధర లీటర్‌కు ఏడాదిలోనే 12 శాతం పెరుగుదలతో రూ.57.15కు పెరిగిందని నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. ఇటీవల పాడి పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకడంతో పాల ఉత్పత్తిలో స్తబ్ధత, దాణా ధరల పెరుగుదల ఇందుకు కారణమని తెలిపింది. లంపి స్కిన్ వ్యాధి కారణంగా దేశవ్యాప్తంగా పాడి పశువులు భారీ సంఖ్యలో మరణించినట్లు పేర్కొంది. 30 లక్షలకుపైగా పశువులకు ఈ వ్యాధి సోకగా వాటిలో 1.68 లక్షలకు పైగా పశువులు మరణించాయని వెల్లడించింది. దీంతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని తెలిపింది. 2023లో పశువుల దాణాలో వాడే తృణధాన్యాలు బియ్యం నూక వంటి ధరలు భారీగా పెరిగి, దాణా ఖర్చు పెరిగిపోయిందని, రవాణా వ్యయం కూడా పెరిగిందని, ఇవన్నీ పాల ధర పెరగడానికి కారణాలని వివరించింది.లంపి స్కిన్ వ్యాధి నివారణకు టీకా డ్రైవ్ నిర్వహించడంతో పరిస్థితి మెరుగుపడిందని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 6,68,93,290 పశువులకు టీకా వేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో సకాలంలో టీకాలు లంపి స్కిన్ వ్యాధి వ్యాప్తి మొదలైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పశువులకు సకాలంలో టీకాలు వేసింది. ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని పశువులకు టీకాలను వేయడంతో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని నాబార్డు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో కేవలం 767 పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకగా 58 పశువులు మాత్రమే మరణించాయని, 709 పశువులు రికవరీ అయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 1,17,300 పశువులకు టీకాలు వేసినట్లు పేర్కొంది. రాజస్థాన్‌లో అత్యధికంగా 75,820 పశువులు మరణించాయని నివేదిక పేర్కొంది. -
రాష్ట్రంలో లంపీస్కిన్ వ్యాధి తగ్గింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లంపీస్కిన్ వ్యాధి స్థిరంగా ఉందని, వ్యాధి వ్యాప్తి తగ్గిందని పశుసంవర్థక శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇప్పటివరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి 8,263 గోజాతి పశువులు ఈ వ్యాధి బారిన పడగా.. 7,543 పశువుల్లో రికవరీ అయిందని తెలిపాయి. మొత్తం 54 పశువులు ఈ వ్యాధి సోకి మరణించాయని అధికారికంగా నిర్ధారించారు. ప్రస్తుతం 703 పశువుల్లో లంపీస్కిన్ వ్యాధిని కలుగజేసే వైరస్ ఉందని, రాష్ట్రంలోని మొత్తం 1,635 గ్రామాల్లోని పశువులకు వ్యాధి సోకిందని పశుసంవర్థక శాఖ అధికారులు చెపుతున్నారు. ఈ వ్యాధిని నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 19,53,955 డోసుల గోట్‌పాక్స్ వ్యాక్సిన్ ఇచ్చామని, అయితే మరణాల రేటు కొంత ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. పశుసంవర్థక శాఖ గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటివరకు అత్యధికంగా వనపర్తి జిల్లాలో 1,709 పశువులకు ఈ వ్యాధి సోకింది. ఆ తర్వాత జోగులాంబ గద్వాల జిల్లాలోని 1,502 పశువులకు ఈ వ్యాధి సోకగా, నల్లగొండ జిల్లాలోని 920 పశువులు ఈ వైరస్ బారిన పడ్డాయి. అత్యల్పంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 2, మెదక్‌లో 12, కరీంనగర్లో 18 పశువులకు ఈ వైరస్ సోకింది. కాగా, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా చేపడుతున్నామని, రాష్ట్రంలోని అన్ని గోజాతి పశువులకు మరో వారం, పది రోజుల్లో వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తామని పశుసంవర్థక శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ వ్యాధి బారిన పడిన పశువులకు ఉచితంగా వైద్య సేవలందించేందుకు పశుసంవర్థక పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లు సంసిద్ధత వ్యక్తంచేశారు. తమకు మందులు సరఫరా చేస్తే వీలైనన్ని గ్రామాలకు వెళ్లి గోజాతి పశువులకు ఈ వ్యాధి సోకకుండా, సోకిన పశువులు కోలుకునేలా సేవలందిస్తామని డిప్లొమా హోల్డర్ల సంఘం ప్రభుత్వానికి వెల్లడించింది.


