పిల్లలు ఫిట్స్‌ (మూర్ఛ)తో బాధపడుతుంటే డాక్టర్‌ను అడగాల్సిన మూడు ప్రశ్నలు!  | Epilepsy in children is a condition that causes seizures | Sakshi
Sakshi News home page

పిల్లలు ఫిట్స్‌ (మూర్ఛ)తో బాధపడుతుంటే డాక్టర్‌ను అడగాల్సిన మూడు ప్రశ్నలు! 

Aug 16 2026 4:28 AM | Updated on Aug 16 2026 4:28 AM

Epilepsy in children is a condition that causes seizures

భారతదేశంలో లక్షలాది మంది పిల్లలు ఫిట్స్‌ / ఎపిలెప్సీతో బాధపడుతున్నారు. 2025లో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఏఐఐఎమ్‌ఎస్‌)  నిర్వహించిన ఒక సర్వే ప్రకారం... చిన్నారుల్లో ఈ ఎపిలెప్సీ వ్యాధి విస్తృతి 0.8% ఉంది. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. ఎందుకంటే పిల్లల్లో ఎక్కడ వివక్షకు గురవుతారో అనే ఆందోళనతో ఈ వ్యాధి ఉందని తెలపడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు. అందుకే పిల్లలు ఫిట్స్‌ / మూర్ఛ (ఎపిలెప్సీ)తో బాధపడుతూ... రెండు రకాల మందులు వాడుతున్నప్పటికీ ఫిట్స్‌ ఆగకుండా వస్తూనే ఉంటే... డాక్టర్‌ను మూడు ప్రశ్నలు అడగటం మంచిది. ఈ మూడు ప్రశ్నలూ పిల్లల జీవితాన్నే మార్చేయవచ్చు. ఇంతకీ ఆ మూడు ప్రశ్నలేమిటో చూద్దాం...

→ మొదటి ప్రశ్న: రెండు మందులు వాడుతున్నప్పటికీ పిల్లలకు ఫిట్స్‌ వస్తూనే ఉన్నాయి. అవి ఆగడానికి శస్త్రచికిత్స (సర్జికల్‌) అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలా? 
డాక్టర్‌ జవాబు : ఫిట్స్‌తో బాధపడే చిన్నారుల్లో మూడింట ఒక వంతు మందికి మందులతో తగ్గని ఎపిలెప్సీ (డ్రగ్‌–రెసిస్టెంట్‌ ఎపిలెప్సీ) వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై చాలామంది తల్లిదండ్రులకు పెద్దగా అవగాహన ఉండదు. అంటే... ఈ పిల్లల్లో ఎలాంటి మందులు వాడినా దాదాపుగా ఫిట్స్‌ అదుపులోకి రాకపోవచ్చు.  అప్పుడు ఆ పిల్లలకు శస్త్రచికిత్స చివరి ప్రయత్నం మాత్రమే కాదు... వైద్యపరంగా అది ఆ తర్వాతి చికిత్సాప్రక్రియను తెలుసుకునే అంశం కూడా. శస్త్రచికిత్స ద్వారా 50 నుంచి 86 శాతం కేసుల్లో ఫిట్స్‌ పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే ఎంతకీ ఫిట్స్‌ తగ్గని కేసుల్లో ఒకసారి ఈ ప్రశ్న డాక్టర్‌ను అడగటం మంచిది. 

→ రెండో ప్రశ్న: సాధారణ బ్రెయిన్  స్కాన్  మాత్రమే కాకుండా, ఎపిలెప్సీ-ప్రోటోకాల్‌ ఎమ్మారై చేయించారా?
డాక్టర్‌ జవాబు : మందులకు లొంగని ఫిట్స్‌కు కారణమయ్యే కొన్ని లోపాలు సాధారణ మెదడు స్కాన్లలో తరచుగా కనిపించకపోవచ్చు. ఇలాంటి పిల్లలకు ఎపిలెప్సీ-ప్రోటోకాల్‌ అనేది ఓ ప్రత్యేకమైన ఎమ్మారై పరీక్ష. అంతేకాదు... దీని  రెజల్యూషన్  కూడా చాలా ఎక్కువ. ఇది మెదడులోని ఫిట్స్‌ ఆవిర్భవిస్తున్న ప్రాంతాన్ని (సీజర్‌ ఫోకస్‌ను) గుర్తిస్తుంది. ఈ పరీక్ష లేకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన చికిత్స ప్రణాళికను మొదలుపెట్టడం సాధ్యం కాదు. అందుకే ఇలాంటి చిన్నారులు  చాలామందికి చేసిన ఎమ్మారై నార్మల్‌గానే ఉందంటూ డాక్టర్లు ఆ పిల్లల పేరెంట్స్‌కు చెప్పవచ్చుగానీ... నిజానికి అది ఎపిలెప్సీ-ప్రోటోకాల్‌ ఎమ్మారై కాకపోవచ్చు.

→ మూడో ప్రశ్న: వీడియో–ఈఈజీ మానిటరింగ్‌ గురించి మీ డాక్టర్‌ను అడిగారా? 
డాక్టర్‌ జవాబు : ఫిట్స్‌ వచ్చినప్పుడు పిల్లల మెదడులోని విద్యుత్‌ తరంగాలను ‘వీడియో ఈఈజీ’ (వీడియో ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్‌) పరీక్ష గుర్తిస్తుంది. ఆటైమ్‌లో వారి ప్రవర్తనలో కనిపించే మార్పులనూ ఇది  రికార్డు చేస్తుంది. ఫలితంగా మెదడులోని ఏ ప్రాంతం నుంచి ఫిట్స్‌ వస్తున్నాయో మరింత కచ్చితంగా / నిశితంగా గుర్తించవచ్చు. శస్త్రచికిత్స అవసరమా లేదా అని అంచనా వేయడానికి ఇది అత్యంత కీలకమైన పరీక్ష. పిల్లలకు మందులతో అదుపులోకి రాని ఎపిలెప్సీ ఉంటే, వీడియో–
ఈఈజీ గురించి తల్లిదండ్రులే ఒకసారి అడగవచ్చు. 

చాలా కుటుంబాలు ఫిట్స్‌ వ్యాధిని మౌనంగా భరిస్తుంటాయి. సమాజంలో ఎదురయ్యే  వివక్ష నుంచి పిల్లలను కాపాడటానికి సమస్యను దాచిపెడుతుంటారు. కానీ అలా చేయడం వైద్యపరీక్షలూ, చికిత్సలూ ఆలస్యం అవడం వల్ల ఫిట్స్‌ను పూర్తిగా తగ్గించే అవకాశాలు సన్నగిల్లే ముప్పు ఎక్కువ. అందుకే పిల్లల చికిత్స మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు ఈ మూడు ప్రశ్నలను పేరెంట్లే అడగవచ్చు. ఒకవేళ తమ డాక్టర్‌ను అడగటం మొహమాటంగా ఉంటే సెకండ్‌ ఒపీనియన్‌ అయినా తీసుకోవచ్చు. ఆ సమాధానాలు  చిన్నారిని ఫిట్స్‌ నుంచి పూర్తిగా విముక్తులను చేసే అవకాశాలెక్కువ. 

డాక్టర్‌ రమేష్‌ శిఘకొల్లి
సీనియర్‌ కన్సల్టెంట్‌ న్యూరోసర్జన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement