breaking news
Sarcoma Cancer
-
నొప్పి లేకున్నా... నిర్లక్ష్యం వద్దు!!
కొందరిలో ఒక్కోసారి తమ కాళ్లలో లేదా చేతుల్లో గడ్డ కనిపించవచ్చు. అది నొప్పి లేని గడ్డ కావడంతో పాటు క్రమంగా పెరుగుతూపోవచ్చు. కారణం లేకుండా ఎముకల్లో నొప్పి కనిపించడంతో రాత్రివేళల్లో ఆ నొప్పి పెరుగుతూ పోవచ్చు. ఆటల్లో గాయపడటమో లేదా తమకు తెలియకుండా ఏదైనా చిన్నపాటి దెబ్బతగలడం వల్లనో ఇలా జరుగుతుండవచ్చని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ లక్షణాలు కొన్నిసార్లు ‘సార్కోమా’ అనే క్యాన్సర్‌కు సూచనలు కావచ్చు. ఈ సార్కోమా తరహా క్యాన్సర్‌పై అవగాహన కోసం ఈ కథనం.సార్కోమా అనేది అరుదైన క్యాన్సర్లలో ఒకటి. సార్కోమా అంటే ఏమిటో చూద్దాం...మన దేశంలో సార్కోమా విస్తృతి... భారతదేశంలో ప్రతి ఏడాది సుమారు 20 వేల కొత్త సార్కోమా కేసులు నమోదవుతున్నట్లు అంచనా. అయితే అవగాహన లోపం, లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల చాలామంది వ్యాధి ముదిరిన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారు. తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందిస్తే మంచి ఫలితాలు కనిపించడంతో పాటు బాధితుల్లో మంచి మెరుగుదల కనిపిస్తుందని గుర్తుంచుకోవడం ముఖ్యం. సార్కోమా అంటే..? సార్కోమా అనేది దేహంలోని ఎముకలు, కండరాలు, కొవ్వు, రక్తనాళాలు, నరాలు, కార్టిలేజ్, టెండన్లు వంటి మృదుకణజాలా (సాఫ్ట్ టిష్యూస్)లో వచ్చే అరుదైన క్యాన్సర్. సాధారంగా కనిపించే మిగతా క్యాన్సర్లతో పోలిస్తే ఇది కాస్త అరుదుగా కనిపించినప్పటికీ, చిన్నపిల్లలు, యువత, మధ్యవయస్కుల్లోనూ ఇటీవల కొంత ఎక్కువగానే కనిపిస్తోంది. ఇది శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ముఖ్యంగా చేతులు, కాళ్లు, తొడలు, భుజాలు, పొత్తికడుపు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.లక్షణాలు... తొలి దశల్లో ‘సార్కోమా’లో పెద్దగా నొప్పి ఉండకపోవడంతో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. సార్కోమాలో కనిపించే సాధారణ లక్షణాలవి... ∙నొప్పి లేకుండా క్రమంగా పెరుగుతున్న గడ్డ ∙చేతులు లేదా కాళ్లలో అసాధారణ వాపు ∙రాత్రివేళల్లో ఎక్కువయ్యే ఎముకల నొప్పి ∙కారణం లేకుండా నెలల తరబడి నొప్పి కొనసాగడం ∙గడ్డ పరిమాణం వేగంగా పెరుగుతుండటం ∙కదలికల్లో ఇబ్బంది లేదా గడ్డ వచ్చిన అవయవం పనితీరు తగ్గడం ∙ఐదు సెంటీమీటర్లకు మించిన గడ్డలు రావడం, కొన్ని వారాలుగా ఆ గడ్డల్లో వాపు తగ్గకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయడం సరికాదు. పైన పేర్కొన్న లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది.నిర్ధారణ ఇలా... సార్కోమా నిర్ధారణ కోసం చేసే పరీక్షల్లో కొన్ని... ∙ఎంఆర్ఐ స్కాన్ ∙పీఈటీ–సీటీ స్కాన్ ∙బయాప్సీ. ఈ పరీక్షలతో కణితి రకం, సైజు, వ్యాప్తితో పాటు అది ఏ దశలో ఉందన్న విషయాలను నిర్ధారణ చేశాక... దాన్ని బట్టి చికిత్సను ΄్లాన్ చేస్తారు. చికిత్స ... బాధితుల పరిస్థితిని బట్టి శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీనిలలో పేషెంట్‌కు అవసరమైనదాన్ని నిర్ణయిస్తారు. ఒక్కోసారి ఈ చికిత్సలన్నింటినీ సమన్వయంతో అందించాల్సి రావచ్చు. అయితే తొలిదశల్లోనే చికిత్స మొదలుపెట్టడం వల్ల చాలా మంది జీవితం తిరిగి సాధారణంగా అయ్యేందకు అవకాశాలెక్కువ.ఆధునిక చికిత్సలతో అవయవాన్ని కాపాడే అవకాశం... గతంలో సార్కోమా చికిత్సలో చాలాసార్లు చెయ్యి లేదా కాలిని తొలగించాల్సి వచ్చేది. కానీ ఇటీవల వైద్యరంగంలోని అధునాత సాంకేతిక పురోగతితో లింబ్ సాల్వేజ్ సర్జరీలు, అత్యాధునిక ఇం΄్లాంట్లు, రీకన్ స్ట్రక్షన్ పద్ధతుల ద్వారా గడ్డను పూర్తిగా తొలగించడంతో పాటు అవయవాన్ని కాపాడే అవకాశాలూ గణనీయంగా పెరిగాయి.చికిత్స తర్వాత కూడా జాగ్రత్తలు అవసరం... శస్త్రచికిత్సతో లేదా ఇతరత్రా అవసరమైన చికిత్సల తర్వాత పరిస్థితి అంతా తిరిగి సాధారణ స్థితి చేరుకుందని అనుకోవడం సరికాదు. నిజానికి పేషెంట్లు తమ చికిత్స తర్వాత కూడా ఫిజియోథెరపీ, పునరావాస చికిత్స (రీ–హ్యాబిలిటేషన్ థెరపీ) వంటివి చేస్తూ ఉండటంతో పాటు క్రమం తప్పకుండా ఫాలోఅప్‌కు రావడమూ తప్పనిసరి. అలాగే కుటుంబ సభ్యుల సహకారమూ పేషెంట్లు పూర్తిగా కోలుకోవడంలో కీలక భూమిక పోషిస్తుందని గుర్తుంచుకోవాలి. డాక్టర్ రాజీవ్ రెడ్డిఆర్థోపెడిక్ ఆంకోసర్జన్– సార్కోమా స్పెషలిస్ట్ -
అరుదైన సార్కోమా క్యాన్సర్.. గుర్తించడం ఎలా?
క్యాన్సర్ అనగానే మనకు సాధారణంగా రొమ్ము, ఊపిరితిత్తులు లేదా ప్రేగుల క్యాన్సర్లు మాత్రమే గుర్తుకు వస్తుంటాయి. అయితే శరీరంలోని అనుసంధాన కణజాలాలలో (connective tissues) వచ్చే ‘సార్కోమా’ అనే అరుదైన క్యాన్సర్‌ను త్వరగా గుర్తించలేం. ఫలితంగా తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సార్కోమా క్యాన్సర్లు ఎముకలు, కండరాలు, కొవ్వు, మృదులాస్థి (cartilage), రక్తనాళాలు, నరాలు, ఇతర మృదువైన కణజాలాలలో (soft tissues) ఉత్పన్నమవుతాయి. పెద్దవారిలో వచ్చే క్యాన్సర్లలో ఇవి కేవలం ఒక శాతం మాత్రమే అయినప్పటికీ, ఇవి అటు పిల్లలపై, ఇటు పెద్దలపై కూడా ప్రభావం చూపిస్తాయి. దీని ప్రారంభ లక్షణాలు చాలా స్వల్పంగా, నొప్పి లేకుండా ఉండటం వల్ల వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతున్నది. అందుకే దీనిపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం.సార్కోమా అంటే ఏమిటి?మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ ఆంకాలజీ ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ సమీర్ ఖత్రీ తెలిపిన వివరాల ప్రకారం.. సార్కోమా అనేది ఒక అసాధారణ క్యాన్సర్. ఇది స్పష్టమైన కారణం లేకుండానే వస్తుంది. ‘సార్కోమా బారిన పడిన చాలామందికి అది తమకు ఎందుకు వచ్చిందో అసలు తెలియదు. చాలా కేసులలో దీనికి నిర్దిష్టమైన జీవనశైలి అలవాట్లు గానీ లేదా బాహ్య కారణాలు గానీ బాధ్యత వహించవు’ అని ఆయన వివరించారు. సార్కోమాలో 100 కంటే ఎక్కువ ఉప రకాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కోలా ప్రవర్తిస్తుంది. అందుకే దీని నిర్ధారణ, చికిత్స చాలా సవాలుతో కూడుకున్నవి. అయితే, ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కొన్ని అంశాలను వైద్యులు గుర్తించారు.ప్రమాద కారకాలు సార్కోమాను సాధారణంగా నివారించలేనప్పటికీ, దీని ముప్పును పెంచే కొన్ని అంశాలను వైద్యులు గుర్తించారు. అవి.. ‘లి-ఫ్రౌమెని సిండ్రోమ్’ వంటి వంశపారంపర్య జన్యుపరమైన సమస్యలు. న్యూరోఫైబ్రోమాటోసిస్ టైప్ 1.. గతంలో ఇతర క్యాన్సర్ల కోసం రేడియేషన్ థెరపీ తీసుకోవడం. దీర్ఘకాలంగా ఉండే లింఫెడెమా (lymphoedema - వాపు సమస్య). కొన్ని రకాల పారిశ్రామిక రసాయనాలకు సుదీర్ఘకాలం గురికావడం.ఉపేక్షించకూడని హెచ్చరిక సంకేతాలుసార్కోమా ఆలస్యంగా నిర్ధారణ కావడానికి ప్రధాన కారణం.. దీని ప్రాథమిక లక్షణం నొప్పి లేని గడ్డలా కనిపించడమే. క్యాన్సర్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. నిరంతరం పెరుగుతూ ఉండే గడ్డ, ఐదు సెంటీమీటర్ల కంటే పెద్దగా (సుమారుగా ఒక గోల్ఫ్ బంతి పరిమాణంలో) ఉండే వాపు, కండరాల లోపల లోతుగా ఉండే గడ్డ, ఎటువంటి గాయం కాకపోయినా ఎముకలలో నిరంతరం నొప్పి రావడం, రాత్రి వేళల్లో ఎముకల నొప్పి మరింత తీవ్రం కావడం, తగ్గకుండా పదే పదే వచ్చే వాపు. శరీరంలో వచ్చే చాలా గడ్డలు ప్రమాదకరమైనవి కానప్పటికీ, ఏదైనా వాపు తగ్గకుండా ఉన్నా లేదా పరిమాణం పెరుగుతున్నా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి పరీక్షించుకోవాలి.వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తారు?అనుమానాస్పదంగా ఉన్న గడ్డలను పరీక్షించడానికి వైద్యులు సాధారణంగా ఎంఆర్ఐ స్కాన్లు, పెట్-సిటి ఇమేజింగ్, ముందస్తు ప్రణాళికతో చేసే బయాప్సీ, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ, మాలిక్యులర్, జన్యుపరమైన పరీక్షలు, నెక్స్ట్-జనరేషన్ సీక్వెన్సింగ్ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. సార్కోమా చికిత్సలో అనుభవజ్ఞులైన కేంద్రాలలోనే బయాప్సీ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.నివారించడం సాధ్యమేనా?మిగతా సాధారణ క్యాన్సర్లలా కాకుండా, సార్కోమా రావడానికి ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి దీనిని నివారించడానికి నిర్దిష్టమైన మార్గాలేవీ లేవు. అయితే, అనవసరమైన రేడియేషన్‌కు గురికాకపోవడం, ప్రమాదకర రసాయనాలను ఉపయోగించే కార్యాలయాల్లో భద్రతా ప్రమాణాలు పాటించడం, వంశపారంపర్య క్యాన్సర్ సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, శరీరంలో తగ్గని గడ్డలు లేదా ఎముకల నొప్పులు ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
సార్కోమాను ఎదుర్కోలేమా!
దేహంలోని సూక్ష్మ కణజాలానికి వచ్చే ఆరు రకాల ప్రధాన కేన్సర్లలో ‘సార్కోమా’ ఒకటి. సార్కోమాను త్వరగా కనుగొంటే మనుగడ రేటు 81 శాతం. అంటే... దీన్ని ఎంత త్వరగా కనుక్కుంటే అంతగా దాన్ని అంతగా అరికట్టవచ్చని తెలుస్తోంది. అయితే దురదృష్టవశాత్తూ మనదేశంలో సార్కోమాను చాలా ఆలస్యంగా కొనుగొంటుండటం వల్ల పొరుగునే ఉన్న ధనిక దేశాలతో పోలిస్తే మన దగ్గర మరణాల రేటు ఎక్కువే. ఈ నేపథ్యంలో సార్కోమా గురించి తెలుసుకుందాం. ఎముక చివరన ఉండే మృదులాస్థి అయిన కార్టిలేజ్కూ, టెండన్స్కూ, కండరాలకూ, ఇక అక్కడి కొవ్వు కణజాలాలలో కనిపించే కేన్సర్లకు ఇచ్చిన ఒక కామన్ పేరు ‘సార్కోమా’. అంటే శరీరంలో ఉండే ఎముకకు గానీ లేదా దాని సపోర్టివ్ కనెక్టివ్ కణజాలానికి వచ్చే చాలా రకాల కేన్సర్లన్నింటికి ఇచ్చిన కామన్ పేరు ఇది. ఇది శరీరంలో ఎక్కుడైనా రావచ్చు... అయితే ప్రధానంగా చేతులు, కాళ్లూ, ఛాతీభాగంలో, పొట్ట భాగంలో ఈ కేన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. సార్కోమాలో మళ్లీ దాదాపు 70 రకాల సబ్టైప్స్ ఉంటాయి. ఈ కేన్సర్ ఉద్భవించే మౌలికమైన కణాలు, వాటి ప్రవర్తన, లక్షణాలు... వీటన్నింటిని బట్టి సార్కోమాను రెండు ప్రధానమైన పెద్ద సబ్టైప్స్గా విభజించారు. వాటిల్లో... మొదటిది ‘సాఫ్ట్ టిష్యూ సార్కోమా’, రెండోది ఎముకలకు సంబంధించిన ‘బోన్ సార్కోమా’. రిస్క్ ఫాక్టర్లు (ఈ ముప్పును తెచ్చిపెట్టే అంశాలు)... ఇటీవలి కొత్త పరిశోధనల ప్రకారం... హానికరమైన పరిశ్రమల్లో లేదా ప్రమాదకరమైన రసాయనాలకు ఎక్స్పోజ్ అయ్యేలాంటి చోట్ల పనిచేసేవారిలో ఈ సార్కోమా కేన్సర్లు ఎక్కువగా వస్తున్నట్లు కనుగొన్నారు. ఉదాహరణకు ప్లాస్టిక్ పరిశ్రమల్లో పనిచేసేవారు వినైల్ క్లోరైడ్ లేదా డయాక్సిన్స్ అనే హానికరమైన రసాయనాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు కాలేయానికి వచ్చే యాంజియోసార్కోమా వంటి క్యాన్సర్లు కనిపిస్తుంటాయి. అలాగే పురుగు మందులు, కలుపు మొక్కల నివారణ కోసం ఉపయోగించే మందుల (హె ర్బిసైడుల) కారణంగా వ్యవసాయ కూలీల్లోనూ, వ్యర్థాలను తొలగించే కార్మికుల్లోనూ సార్కోమా బాధితులు ఎక్కువ. ఇక పిల్లల్లో... వారి ఎదుగుదల అనే అంశమే సార్కోమాలు కనిపించడానికి కారణమవుతుంది. వారు ఎదిగే క్రమంలో జరిగే వేగవంతమైన కణవిభజనల్లో ఎక్కడైనా లోపం జరిగాక... ఆ లోపభూయిష్టమైన కణం నుంచి పెరిగే కణజాలం అపరిమితంగా పెరుగుతూపోతూ సార్కోమాకు దారితీయవచ్చు. అనారోగ్యకరమైన జీవనశైలి, కాలుష్యాలతో కూడిన పర్యావరణం, గతంలో ఏవైనా కారణాల వల్ల రేడియోథెరపీ తీసుకోవాల్సిన రావడం వంటివి సార్కోమా ముప్పును మరింతగా పెంచే అంశాలు. అలాగే ‘లి–ఫ్రౌమెనీ సిండ్రోమ్’ వంటి సిండ్రోములు, జెనెటిక్ మ్యూటేషన్లు కూడా సార్కోమాకు కారణమవుతుంటాయి. నిర్ధారణ... సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ టెక్నిక్స్ సార్కోమాలను కనుగొనడంలో కీలక భూమిక పోషిస్తుంటాయి. ఎక్కడో పుట్టిన మూల కేన్సర్... అటు తర్వాత మరో చోటకు చేరి అక్కడ పెరగడాన్ని (మెటాస్టేటిస్ను) కనుగొనడంలోనూ ఈ ఇమేజింగ్ ఉపకరణాలు సహాయపడతాయి. మృదు కణజాలంలో (సాఫ్ట్ టిష్యూల్లో) వచ్చే కేన్సర్ గడ్డలను ఎమ్మారై వంటి వాటితో కనుగొనడానికీ, రేడియోషన్ దుష్ప్రభావాలను వీలైనంతగా తగ్గించి ఉపయోగించే రేడియో టెక్నిక్స్ అయిన అలారా (ఏజ్ లో ఏజ్ రీజనబ్లీ అచీవబుల్) టెక్నిక్‌తో సురక్షితంగా సార్కోమాలను కనుక్కోడానికీ. ఇక పెట్–సీటీ, రేడియోమిక్స్ వంటి అధునాతన టెక్నిక్స్‌తో అవి హానికరం కాని బినైన్ గడ్డలా లేక హానికరమైన మేలిగ్నెంట్ లీజన్సా అన్న అంశాలను కనుగొనడానికి ఆస్కారం ఉంది. చికిత్సలు / అధునాతన చికిత్సా పద్ధతులు... అధునాతమైన శస్త్రచికిత్స పద్ధతుల ద్వారా అలాగే రేడియేషన్ థెరెపీ వంటి అంశాల్లో చోటు చేసుకున్న వినూత్న పద్ధతుల ద్వారా సార్కోమాకు చికిత్స అందించడం ఇప్పుడు సాధ్యం. బాధితుల కాళ్లు, చేతులను తొలగించకుండానే చేసే శస్త్రచికిత్సలు (లింబ్ స్పేరింగ్ సర్జరీస్), ఒకవేళ అలా తొలగించాల్సి వస్తే వారికోసమే రూపొందించిన (పేషెంట్ స్పెసిఫిక్ ఇం΄్లాంట్స్)తో... ఆ తొలగించిన చోట ఇంప్లాంట్స్ అమర్చుతూ అవయవాలు కోల్పోకుండా చేసే టెక్నిక్లిప్పుడు అందుబాటులో అత్యంత ఆధునికమైన ప్రోటాన్ థెరపీ, ఐఎమ్ఆర్టీ (ఇంటెన్సిటీ మాడ్యూలేటెడ్ రేడియేషన్ థెరపీ) వంటి అత్యాధునిక రేడియేషన్ పద్ధతులతో చుట్టుపక్కల ఉండే కణజాలానికి హానికలగకుండా లేదా తక్కువ హాని కలిగేలా చేసే రేడియోథెరపీ. రకరకాల మందుల కాంబినేషన్లతో ప్రభావపూర్వకమైన కీమోథెరపీ. ఇవేకాకుండా టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీల వంటి వాటితో జెనెటిక్ మ్యూటేషన్ల వల్ల వచ్చిన సార్కోమాలను నయం చేయడానికి ఆస్కారం. కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానున్న కార్–టీ సెల్ థెరపీల వంటి వాటి సహాయంతో మునుపు అంతగా లొంగని సార్కోమా కేన్సర్లను మరింత ప్రభావపూర్వకంగా చికిత్స అందించే వీలుంది. --డాక్టర్ (ప్రొఫెసర్) బి. రాజేష్, మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్, రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ బర్మింగ్హమ్ (యూకే) (చదవండి: కోళ్ల అందాల పోటీలు..!) -
సర్కోమా కేన్సర్‌కు కొత్త చికిత్స
న్యూఢిల్లీ: సర్కోమా కేన్సర్ రోగులకు శుభవార్త. బంధన కణజాలాల కేన్సర్ చికిత్సలో అవయవాల తొలగింపునకు ప్రత్యామ్నాయాన్ని ఢిల్లీలోని అఖిల భారతవైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) వైద్యులు కనుగొన్నారు. సర్జరీలో 10 సెంమీలను మించిన ట్యూమర్ల తొలగింపు వల్ల ఆ భాగంలోని రక్తనాళాలను కూడా తొలగించాల్సి వచ్చేది. దాంతో, పూర్తిగా ఆ అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడేది. సర్జరీ అనంతరం అవయవాల తొలగింపు వల్ల బాధితులు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించేందుకు ఎయిమ్స్ వైద్యులు నడుం కట్టారు. ప్రభావిత భాగాన్ని రక్తనాళాలతో సహా తొలగించి.. ఆ తరువాత, తిరిగి రక్తనాళాలను కృత్రిమంగా పునరుద్ధరించడం ద్వారా.. ప్రభావిత అవయవాన్ని తొలగించకుండా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నట్లుగా ఎయిమ్స్ డెరైక్టర్ ఎంసీ మిశ్రా ఆదివారం వెల్లడించారు. తొడ వద్ద 12 సెంమీల సర్కోమా కేన్సర్‌తో బాధపడ్తున్న బిహారీ యువకుడికి ఈ విధానం ద్వారా చికిత్స చేశామన్నారు. సాధారణ చికిత్సలో అయితే, కాలు తీసేయాల్సి వచ్చేదన్నారు.


